Eggs | కోడిగుడ్లలో ఒక్క విటమిన్ సి తప్ప అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. రోజూ ఒక కోడిగుడ్డును తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. కోడిగుడ్లను రోజూ ఒకటి చొప్పున తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. కోడిగుడ్ల ద్వారా పూర్తి స్థాయిలో పోషకాలను పొందాలంటే వాటిని ఉడకబెట్టి తినడమే ఉత్తమమైన మార్గం అని కూడా సూచిస్తుంటారు. అయితే కోడిగుడ్లను తినడం వల్ల అనేక పోషకాలను పొంది పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. కానీ గుడ్లను రోజులో అసలు ఏ సమయంలో తినాలి, వీటిని ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం.. ఏ సమయంలో తింటే మనకు ఎక్కువ పోషకాలు లభిస్తాయి, ఏ సమయంలో వాటిని తినడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది..? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
కోడిగుడ్లను ఉడికించేందుకు సాధారణంగా చాలా తక్కువ సమయం పడుతుంది. ఒక కోడిగుడ్డు పూర్తిగా హార్డ్ బాయిల్ అయ్యేందుకు సుమారుగా 10 నిమిషాల సమయం పడుతుంది. కనుక వీటిని చాలా త్వరగా ఉడికించవచ్చు. ఇక గుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జింక్ అధికంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. జింక్ వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఉత్పత్తి అవుతుంది. శుక్ర కణాల కదలికలు సరిగ్గా ఉంటాయి. దీని వల్ల సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. కోడిగుడ్లలో ఉండే మెగ్నిషియం కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. కండరాల నొప్పులను తగ్గించి కండరాలకు బలం కలిగేలా చేస్తుంది. దీంతో కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
కోడిగుడ్లలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చూస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. కోడిగుడ్లను తినడం వల్ల ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. దీని వల్ల శరీరానికి శక్తి లభించి చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. బద్దకం తగ్గిపోతుంది. కోడిగుడ్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా కోడిగుడ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
ఇక కోడిగుడ్లను ఉదయం తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఉదయం వ్యాయామం చేసిన అనంతరం గుడ్లను తింటే శరీరానికి శక్తి లభించి యాక్టివ్గా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు. రోజంతా శారీరక శ్రమ చేసేవారు కూడా ఉదయం గుడ్లను తింటే మేలు జరుగుతుంది. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు. నీరసం, అలసట రాకుండా ఉంటాయి. అయితే కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక శక్తి పెద్దగా అవసరం లేదని భావించేవారు గుడ్లను మధ్యాహ్నం ఉడకబెట్టి తినవచ్చు. అయితే కోడిగుడ్లను రాత్రి పూట తినకూడదు. తింటే శరీరంలో అనవసరంగా క్యాలరీలు, కొలెస్ట్రాల్ చేరుతాయి. ఇవి మనకు హాని చేస్తాయి. కనుక కోడిగుడ్లను ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాల్సి ఉంటుంది.