రాయపోల్, ఫిబ్రవరి 26 : పదో తరగతి విద్యార్థులు మంచిగా చదివి, ఉత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలలకు మంచి గుర్తింపు తేవాలని పీఎంశ్రీ పాఠశాలల కేంద్ర పరిశీలకులు శైలేంద్ర కుమార్ ఐఏఎస్ అన్నారు. పీఎం శ్రీ పథకంలో భాగమైన రాయపోల్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. పాఠశాల పరిశుభ్రత నిర్వహణను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో కలియదిరిగిన శైలేంద్ర కుమార్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించి, త్రీడీ ప్రింటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు.
విద్యార్థులు ఉన్నతమైన చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాలు పొందాలని శైలేంద్ర కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు, డిఈఓ శ్రీనివాస రెడ్డి, మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, ఏపీసి బేతి భాస్కర్ తదితరులు ఉన్నారు.