అతను ఆంధ్రాకు చెందిన వ్యక్తి. గత మూడేండ్లుగా తెలంగాణలో ఉంటూ పౌరోహిత్యం నేర్చుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం తన ఆధార్‌కార్డ్ అడ్రస్ తెలంగాణకు మార్చుకున్నాడు. ఈ వ్యక్తిని ఇటీవల దేవాదాయశాఖ నిర్వహించిన పోస్టుల్లో నిబంధనలకు విరుద్ధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ ఆలయంలో అర్చక పోస్టుకు ఎంపిక చేశారంటూ ఆలయానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఈవో పోస్టు పెట్టారు. దీనిపై ఆలయ ఉద్యోగులతోపాటు స్థానికంగా పెద్దఎత్తున దుమారం రేపుతున్నది. ఈ విషయంలో ఆలయ ప్రధాన అర్చకుడితోపాటు దేవాదాయశాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి, ఇంటర్వ్యూ చేసిన ఎగ్జామినర్ లక్షల రూపాయలు తీసుకుని ఆంధ్రా ప్రాంత ఉద్యోగిని ఎంపిక చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సికింద్రాబాద్‌లోని ఓ ప్రధాన ఆంజనేయస్వామి దేవాలయంలో ఎంపికైన వేదపండితుడి నియామకంపై దుమారం చెలరేగుతున్నది. ఎంపికైన వేదపండితుడు దేవాదాయ ముఖ్యఅధికారి ఇంట్లో పూజలు చేయడమే కాకుండా, ప్రధాన పరీక్షా నిర్వాహకుడికి అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో ఇతని కంటే ఎక్కువ అర్హతలు, సర్టిఫికెట్లు ఉండడంతోపాటు తెలంగాణలో అరుదైన వేదపండితుల్లో ఒకరుగా పేరుగాంచిన వ్యక్తికి ఇవ్వకుండా, ఇతనికి ఇవ్వడంపై తెలంగాణ పండితలోకం మండిపడుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 11 (నమస్తే తెలంగాణ) : దేవాదాయశాఖలో ఉద్యోగాల నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిర్వహించిన నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ‘నమస్తే తెలంగాణ’ ఆ శాఖ ముఖ్య అధికారులకు సాక్ష్యాధారాలు సహా అందించింది. అయితే, డబ్బులు తీసుకున్న తర్వాత కమిట్మెంట్ ఎలా వదిలేస్తామనుకున్నారో ఏమో.. మొత్తం మీద హడావిడిగా 191 పోస్టుల నియామకం పూర్తిచేశారు. నవంబర్ 2025లో ప్రకటించిన మొత్తం పోస్టులు హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా 326 కాగా, ఆ తర్వాత రెండు ప్రాంతాల్లో కోడ్ ముగిసిన తర్వాత వచ్చిన పోస్టులను కూడా కలిపితే సుమారుగా 400 ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఇందులో కొన్ని కోర్టు వివాదాలు, మరికొన్ని స్థానిక సమస్యలు, ఇంకొన్నిటిలో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో 191 పోస్టులకు మాత్రమే అభ్యర్థులను ఎంపికచేశారు.
వారందరినీ రవీంద్రభారతికి పిలిచి గత నెలలో మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, సలహాదారు గోవిందహరి, ఎండోమెంట్ డైరెక్టర్ హనుమంతరావు, ప్రధాన పరీక్షాధికారి శ్రీరాంఘనాపాటి చేతులమీదుగా కొందరికి నియామకపత్రాలు అందజేశారు. మిగతావారికి దేవాదాయ ముఖ్య అధికారులు, ఈవోల చేతులమీదుగా ఇచ్చారు. అయితే ఈ జాబితా విషయంలో దేవాదాయశాఖ గోప్యత పాటిస్తున్నది. ఎంపికైన అభ్యర్థుల జాబితా నేరుగా కమిషనర్‌ను అడిగినా, దేవాదాయశాఖ మంత్రి పేషీ సిబ్బందిని అడిగినా ఆ లిస్టు తమ వద్ద లేదనడం వెనుక ఆంతర్యమేందనే చర్చ జరుగుతున్నది. ఈ పోస్టుల వ్యవహారం సంబంధిత శాఖ మంత్రికి కూడా తెలియకపోవడం, పోస్టులకు ఏమేరకు డబ్బులు వసూలు చేశారనే విషయంలోనూ ఆమె కొంత అసహనంగా ఉన్నా, తర్వాత పోస్టుల భర్తీనే ప్రధానంగా చూడడంతో అసలు వ్యవహారం పక్కదోవ పట్టిందని దేవాదాయశాఖ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
ఆ పాఠశాల విద్యార్థులే ఎక్కువ..
వేదపండితుల పోస్టులపై మొదటి నుంచీ దుమారం చెలరేగుతుండగా తాజా నియామకాల్లో ఎంపికైనవారు దాదాపుగా ఒక పాఠశాలకు చెందినవారేనంటూ అభ్యర్థులు చెప్పుకొంటున్నారు. పరీక్ష ముఖ్య అధికారి అతనే ఉండటంతో తమ సంస్థకు చెందిన విద్యార్థులకే ఎక్కువగా నియామకాలు ఇప్పించి కొందరిని మాత్రమే వేరే వారిని ఎంపిక చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అర్హత కలిగిన చాలామంది తెలంగాణ అభ్యర్థులకు ఈ నియామకాల్లో నష్టం జరిగిందనే చర్చ జరుగుతున్నది. కొందరు ఆంధ్రా ప్రాంతానికి చెందినవారై ఉండి తెలంగాణలో సర్టిఫికెట్ తీసుకోవడం, మరికొందరు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు కావడంతో నియామకాల్లో అంతా రామమయమైందని, ఆయన ఏం చెబితే అదే జరిగిందంటూ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు చెప్తున్నారు. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం వంటి ప్రధాన ఆలయాలతోపాటు మరికొన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ఆలయాల్లో అర్చక పోస్టులకు జరిగిన ఎంపిక ప్రక్రియలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖలో ఓ అధికారితోపాటు కొన్ని ఆలయాలకు సంబంధించిన వ్యక్తులు ముందస్తుగానే మాట్లాడుకొని డబ్బులు తీసుకున్న తర్వాతే ఎంపిక చేశారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ అమ్మవారి ఆలయంలో పోస్టులకు లక్షలు చేతులు మారాయంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆ ఆలయ ఈవోపై సీరియస్ అయినట్టు తెలిసింది. మొత్తంగా పోస్టుల కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులే స్వయంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ ఆ దిశగా అడుగులేయకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.
మిగిలిన పోస్టులకు పైరవీలు..
ప్రస్తుతం ఉన్న పోస్టులతోపాటు రెండు ఆలయాలకు సంబంధించి ఎంపికైన ఇద్దరు అభ్యర్థుల విషయంలో పెద్దఎత్తున పైరవీలు జరుగుతున్నట్టు సమాచారం. సరస్వతీ అమ్మవారి దేవాలయంలో ఒక పోస్టుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ అభ్యర్థి అక్కడికి వెళ్లలేదు. ఖమ్మం జిల్లాలోని అమ్మవారి ఆలయంలో ఒక పోస్టు ఎంపిక జరిగినప్పటికీ ఆ మహిళ వేరొకచోట కూడా ఎంపికవడంతో అక్కడ చేరింది. సదరు శాఖలోని ఒక అధికారి సహకారంతో ప్రస్తుతం ఉన్న రెండు పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయడానికి బేరాలు జరుగుతున్నట్టు సమాచారం. మిగిలిన పోస్టులకు త్వరలోనే మళ్లీ నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీటిపై కూడా అధికారులు లోపాయికారి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.
కొరవడిన పారదర్శకత..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శివాలయంలో ఎంపికైన అర్చక అభ్యర్థి పోస్టు విషయంలో రూ.10 లక్షలు చేతులు మారాయంటూ గుసగుసలు వినిపిస్తున్నా యి. సంస్థాగతంగా ఆ ఆలయంలో అర్చకుడిగా ఎంపికయ్యేందుకు మిగతావారికి అర్హతలు ఉన్నప్పటికీ అందులో ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగిన ప్రశ్నలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. తమకు నచ్చిన వారికైతే సులువు, ఇతరులకైతే క్లిష్టమైన ప్రశ్నలు అడిగారంటూ ఇంటర్వ్యూలు జరిగిన తుల్జాభవన్ పరిసరాల్లో చర్చించుకోవడం కనిపించింది. రాత, మౌఖిక పరీక్షల్లో ఎవరికెన్ని మార్కులు వచ్చాయి, ఎ క్కువ పరీక్షలు వచ్చిన అభ్యర్థులు ఎందుకు సెలక్ట్ కాలేదనే విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. ఎంపికైన వారి జాబితా ను నియామకపత్రాలు ఇచ్చే ముందురో జు రాత్రి ఆలయ వాట్సాప్ గ్రూపులో పెట్టడమేంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.