మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది వెండితెరపై మెరిసే నటుల గురించి కాదు. నిజజీవితంలో వెలుగులు చిమ్మే నాయికానాయకుల గురించి. తమ ప్రతిభాపాటవాలతో చరిత్ర సృష్టించిన మహనీయుల గురించి. అది ఏ రంగమైనా కావచ్చు. ఆశయసాధన కోసం వాళ్లు తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. అవరోధాలు ఎదురైనా అనుకున్న గమ్యానికి చేరుతారు. తమ కృషికి శాశ్వతత్వాన్ని కల్పిస్తారు. చరిత్రలో తమకో పేజీని మిగుల్చుకుంటారు. అలాంటివారిలో మీరూ ఒకరు కాదలుచుకున్నారా? అందుకు మీరేం చేయాలో తెలుసుకోండి.
Real Hero | ప్రపంచ జనాభాలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే తమతమ రంగాల్లో అత్యున్నత స్థితికి చేరుకుంటారు. వీళ్లను మనం ‘హీరో’లు అని చెప్పుకోవచ్చు. వాళ్లలో ఉండే విశిష్ట లక్షణాలు… అసాధారణమైన సృజనాత్మకత, ఉన్నతమైన ఉత్పాదకత. సాధారణమైన సమూహానికి భిన్నంగా ఆలోచించటం, ప్రవర్తించటం వారి నైజం. తమకు సహజంగా లభించే శక్తులను వారు ద్విగుణీకృతం చేసుకుంటారు. అంతర్గత మేధాశక్తిని పెంపొందించుకునేలా వాళ్లు నిరంతరం కృషిచేస్తారు. గంటల తరబడి చురుగ్గా పనిచేయగలగటం వారి స్వభావం. ఇందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. ఒక క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, వారిలో ఉండే ప్రత్యేకతలు హీరోయిజాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి కొంతమంది గురించి తెలుసుకుందాం.
లియోనార్డో డావిన్సీ అసాధారణ సృజనాత్మకతగల వ్యక్తి. ఒక్క చిత్రకళలోనే కాదు. వాస్తుశిల్పం, చిత్రలేఖనం, శరీరధర్మ శాస్త్రం, శిల్పకళ, ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్ ఇలా వివిధ రంగాల్లో ప్రతిభ చాటాడు. డావిన్సీ అత్యంత స్వల్ప విషయాలపైన రోజుల తరబడి అధ్యయనం కొనసాగించే వాడు. ఆయన డైరీలను పరిశీలిస్తే ఎన్నో విజ్ఞానదాయకమైన అంశాలు మనకు తెలిసివస్తాయి. ఒకదానిలో నీటి ప్రవాహంలో సాంకేతికతను వివరించటానికి 730 రకాల భావనలను అందించాడు. మరోదానిలో వృత్తం గురించి 160 పరిశీలనాంశాలు పొందుపరిచాడు. ప్రవహించే నీటికి సంబంధించిన 67 పర్యాయపదాలను రాసి ఉంచాడు. ఆయన అవిశ్రాంతంగా పనిచేసినప్పటికీ, ఇతర సృజనాత్మక జీవుల మాదిరిగానే కొన్ని గంటలపాటు విశ్రాంతిగా గడుపుతాడు.
విఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ కొన్ని వారాలపాటు ఉత్తినేలపైన నిద్రించేవాడు. అహంకారాన్ని తలకెక్కించుకోకుండా దృఢంగా, అత్యంత వినయంగా ఉండేందుకు, బుద్ధి పూర్వకంగా మసలేందుకు, అన్నిటినీ సమదృష్టితో చూసేందుకు ఇలా వ్యవహరించేవాడు. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందానికి కూడా ఈ అలవాటు ఉంది. సన్మానాలు, సత్కారాలు అందుకుని ఇంటికి వచ్చిన తర్వాత.. ఈ పొగడ్తలు, మెచ్చుకోళ్లు తనపై ప్రభావం చూపకూడదని తాను నేలమీద సేదతీరానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
రోమ్‌లో యువ స్పార్టన్లు ఒంటిమీద గోచీ తప్ప మరే వస్త్రం లేకుండా అత్యంత శీతల ప్రాంతంలో శిక్షణ పొందుతారు. ఈ విషయంలో వాళ్ల తల్లులు పక్కన నిలబడి “మీరు విజయం సాధించి తిరిగిరండి. లేకపోతే శిరస్ర్తాణంతో అక్కడే చావండి” అని హెచ్చరిస్తారు. పరోక్షంగా విజయమో, వీరస్వర్గమో అన్న మాట ఇక్కడ వర్తిస్తుంది.
మైల్స్ డేవిస్.. ప్రఖ్యాత జాజ్ నిపుణుడు. సంపన్న కుటుంబంలో జన్మించినా జాత్యంహకారానికి గురయ్యాడు. నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ సంగీతం గురించి ఆలోచించేవాడు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండటం అనేది అతనికి ఇష్టం ఉండేది కాదు. నిత్యం కొత్త ప్రయోగాలు చేసేవాడు. అప్పటికప్పుడు చేస్తున్న పని తప్ప, అంతకుముందు చేసిన పని గురించి మాట్లాడటానికి అతను అంతగా ఇష్టపడేవాడు కాదు. అందరూ ఆమోదించిన, వ్యాపార వర్గాలు సమ్మతించిన వాటిని దాటి ఎప్పుడూ ఏదో కొత్తగా సాధించాలని తపనేపడేవాడు. ‘మీకు తెలిసినదాని గురించి కాదు, తెలియని దాని గురించి ప్రయత్నించండి’ అని తన బృందంలో వారికి తరచూ చెప్పే హీరో అతను.
ఆర్సన్ వెల్జ్ గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యానికి గురికాక మానం. ఆయన చలనచిత్ర రంగంలో అసాధారణ నిపుణుడు. తన మనసుకు నచ్చే ఫలితం వచ్చే వరకూ అతను పనిచేస్తూనే ఉండేవాడు. దీంతో చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకుంటాడనే అపవాదు ఉండేది. తన ‘టచ్ ఆఫ్ ఈవిల్’ సినిమాకు మూడు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాడనే కోపంతో సినిమా యాజమాన్యం ఆయనను ప్రాజెక్టు నుంచి తొలగించింది. ఇంకెవరితోనో ఎడిటింగ్ పూర్తి చేయించి సినిమా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని చూసిన ఆర్సన్ వెల్జ్ .. తనకు సంబంధం లేకపోయినా, ఆర్థికంగా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయినా ఎడిటింగ్‌లో చేయవలసిన మార్పులు చేర్పుల గురించి యాజమాన్యానికి సుదీర్ఘమైన లేఖ రాశాడు. సహజంగానే వాళ్లు దాన్ని పక్కన పడేశారు. 18 ఏళ్ల పాటు అది చీకట్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఓ సినిమా పత్రిక, 58 పేజీల లేఖను ముద్రించింది. ఆర్సన్ వీరాభిమాని ఒకరు, అదే చిత్రాన్ని ఆయన సూచించిన విధంగా ఎడిటింగ్ చేసి విడుదల చేశాడు. దానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వృత్తిపట్ల అపరిమితమైన ఆరాధనా భావం ఉండటం వల్లనే ఆర్సన్ ఇలా చేయగలిగాడని మనం అర్థం చేసుకోవచ్చు. నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ, ఫ్లోరెన్స్ నైటింగేల్, ఆస్కార్ షిండ్లర్… ఇంకా కోపర్నికస్, విలియం షేక్స్పియర్, వాల్ట్ డిస్నీ, హెడీ లామర్, ఫిలిప్ స్టార్క్, జీన్ మైఖేల్ బాసియట్, సాల్వడార్ డాలీ ఇలా చెప్పుకొంటూ పోతే ప్రభావశీలురైన హీరోల జాబితా అనంతంగా ఉంటుంది.
ప్రసిద్ధ రాక్ బ్యాండ్ ‘ట్రాజికల్లీ హిప్’లో కీలక గాయకుడు గార్డు డానీ. అతను రాసే పాట, ఆయన గాత్రం కూడా అద్భుతంగా ఉండేవి. అతని కదలికలు ఉర్రూతలూగించేవి. అలాంటి వ్యక్తికి హఠాత్తుగా అరుదైన బ్రెయిన్ క్యాన్సర్ సోకింది. అన్ని పనులు కట్టిపెట్టి హాయిగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. అతను వాటిని లెక్క చెయ్యలేదు. కీమోథెరపీ తీసుకుంటూనే మరింత శక్తిమంతంగా మారిపోయాడు. అతనిలో శక్తి, చరిష్మా రెండూ పెరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ అతనికి ఏమైనా అయితే హుటాహుటిన దవాఖానకు తీసుకువెళ్లడానికి ప్రదర్శన సమయంలోనూ ఎమర్జెన్సీ టీమ్‌లు సిద్ధంగా ఉండేవి. డానీ చివరి ప్రదర్శనను 12 లక్షల మంది టీవీలో చూసి ఆనందించారు.
జీవపరిణామ సిద్ధాంతం ఆవిష్కర్త చార్లెస్ డార్విన్ అసాధారణ ఓర్పు కలవాడు. తన పరిశోధనల నిమిత్తం పెటగోనియా, తాహితి, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో పర్యటించాడు. 770 డైరీలు, 1750 పేజీల అధ్యయన పత్రాలను వెలువరించాడు. మనుగడ కోసం పోరాటంలో జీవుల్లో సమర్థులే బతికి బట్టకడతారని ప్రతిపాదించాడు. అయితే, జీవజాతుల సామర్థ్యం కేవలం మనుగడ కోసమే కాదు. మారుతున్న పరిస్థితుల్లో ఆధిక్యాన్ని చాటడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మార్పులను అర్థం చేసుకుని కాలం కంటే ముందు ఆలోచించి వ్యవస్థను నడపగలిగినవాడే సమర్థుడయిన యజమానిగా తనను తాను నిరూపించుకుంటాడు. అలాగే నేర్చుకునే స్వభావం ఉన్న ఉద్యోగి కొత్త నైపుణ్యాలను అలవరచుకుంటూ ముందుకు వెళ్లటం వల్ల పదోన్నతులు దక్కించుకోగలుగుతాడు. సృజనాత్మకరంగంలో వారు ఇతరులు అనుసరించని మార్గంలో నడిచినప్పుడు అద్భుతాలను ఆవిష్కరించగలుగుతారు. ఎవరైతే కొత్తదనాన్ని స్వీకరించగలుగుతారో వారే నిత్యం తమను తాము అధిగమించగలుగుతారు. సంతోషాన్ని అందుకోగలుగుతారు. డార్విన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే.
ఎక్కువ కాలం జీవించిన వాళ్లు ఏం తింటారు అనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే మీ శక్తికి, తేజస్సుకు, దీర్ఘాయువు సాధించటానికి అవసరమైన స్పృహ మీలో పెరుగుతుంది. కళల్లో అద్భుతమైన ప్రతిభ చాటేవారి దినచర్యను అధ్యయనం చేస్తే మీలో అంతర్దృష్టి పెరుగుతుంది. వాటిని ఆచరణలో పెట్టగలిగితే ఊహించని ఫలితాలు సొంతం చేసుకోగలుగుతారు. సంపన్నుల మనస్తత్వం, ఉద్వేగాలు, ప్రవృత్తి లాంటివి తెలుసుకోవటం మన ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతస్థితిని అందుకున్న వారిని అధ్యయనం చేయటం ద్వారా ఆ స్థాయిని మనం అందుకోగలుగుతాం. మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఎవరైనా విద్యను సొంపుగా వినియోగించుకుంటే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది.
రోజువారీగా, చిన్నచిన్న ప్రాధాన్యం లేని పనులను నిలకడగా, స్థిరంగా చేసుకుంటూ పోతే అది చివరకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. రోజువారీ హీరోయిజం ప్రదర్శించటానికిది తప్పనిసరి. అందుకే ప్రణాళికా బద్ధంగా పనిచేయటమే కాదు. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. “ఏడుసార్లు కింద పడండి. ఎనిమిది సార్లు పైకి లేవండి” అని జపాన్‌లో ప్రసిద్ధమైన సూక్తి. ‘నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మరింత సాధించండి. మీ దృష్టి ఎదురుగా కనిపించే దానిపైన కాదు. ఇంకా రూపుదిద్దుకోని అంశంపై ఉండాలి’ అని దాని సారాంశం.
అసాధారణ సామర్థ్యం అనే విషయంపైన పరిశోధన చేపట్టిన ఎండర్ ఎరిక్సన్ “10వేల గంటల మూలసూత్రం” గురించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచస్థాయి ప్రతిభను ప్రదర్శించే అత్యున్నత క్రీడాకారులు, చదరంగ నిపుణులు, సంగీత కోవిదులు, ఇతర సృజనశీలురు ఎవరైనా ఇంతకాలం శ్రమించిన తర్వాతనే తమ అసాధారణమైన తొలి పనితీరును ప్రదర్శించగలరని చెప్పాడు. మనం ఎంచుకున్న రంగంలో సాధికారతను సాధించాలంటే పద్ధతి ప్రకారం అభ్యాసం చేసుకుంటూ పోవాలి. జీవితాంతం నేర్చుకుంటూ పోతే అత్యున్నతమైన ఫలితాలను సాధించటం వీలవుతుంది.
ప్రకృతి సహజంగా చురుకుదనం, కుతూహలం గల వారిని, కష్టపడే స్వభావం ఉన్నవారిని, కష్టాలు ఎదురైనప్పుడు తెలివిగా, వేగంగా వాటిని అధిగమించేవారిని, శక్తిమంతుల్ని, ఇతరులను అదుపు చేయగలవారిని ఎంచుకుంటుంది. అందుకే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతిఘటించవద్దు. వాటికి ఎదురొడ్డి నిలవాలి. ఎదగటానికి అవకాశం ఉన్న ఏ పరిస్థితినీ వదులుకోవద్దు. లేకపోతే మ్యూజియంలో భద్రపరిచిన డైనోసర్‌లా మారిపోతాం.
విజయానికి ముగింపు అంటూ ఉండదు. అసాధారణ విజయాలు సాధించిన వారు గెలవటాన్ని ఆస్వాదిస్తారు. పదవీ విరమణ గానీ, అలసత్వంగానీ మృత్యువుతో సమానం అన్న భావనలో ఉంటారు. తమ ఆత్మలు సదా చైతన్యవంతంగా ఉండాలని తహతహలాడతారు. మనం కూడా అంతే. గతంలో సాధించిన విజయాలు చూసుకుని ఇంకేదీ అవసరం లేదు అని సరిపుచ్చుకోవద్దు. వేగం తగ్గించకూడదు. సోమరిగా మారకూడదు. కొన్నేళ్ల క్రితం సాధించిన విజయాలను మీ స్వీయ సామర్థ్యానికి గుర్తింపుగా భావించుకోవటం మానండి. మీరు అంతకంటే గొప్పవారు. ప్రయత్నిస్తూ వెళితే ఇంకా విజయాలు సాధిస్తారని గ్రహించండి.
ఎక్కువ సమయం కష్టపడి పనిచేయటం వల్ల ఉత్పాదకత పెరుగుతుందనేది బూజు పట్టిన సిద్ధాంతం. అది లోప భూయిష్ఠమైంది కూడా. పనిచేస్తున్నంత సేపు మరే విషయాన్ని పట్టించుకోరు కొందరు. రియల్ హీరోలు అలాకాదు. పనిలో తాము కోల్పోయిన శక్తిని కూడగట్టుకోవటానికి కూడా సమయాన్ని వెచ్చిస్తారు. అసాధారణ పనితీరుతో అంచెలంచెలుగా ఎదుగుతారు. దీనివల్ల వాళ్లూ అలసటకు గురవుతారు. తమను తాము పునరుద్ధరించుకోవటానికి, పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, నడక, వ్యాయామం, కుటుంబసభ్యులతో సరదాగా కబుర్లు చెప్పుకోవటం వంటి పనుల్లో నిమగ్నమవుతారు. తిరిగి శక్తిని సంతరించుకుంటారు.
గొప్పగొప్ప కంపెనీలు ఉన్నట్టుండి తమ ప్రాభవాన్ని కోల్పోవటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆయా రంగాల్లో ప్రాధాన్యం గల వ్యక్తులు ఒక్కసారిగా దిగజారిపోతారు. ఇందుకు కారణం అలసత్వం, మితిమీరిన అహంకారం అని చెప్పాలి. కొత్తగా తెలుసుకోవలసింది ఏమీ లేదనే భావన, ఇతరులు ఎవరూ తమను అందుకోలేరనే ధీమా వాళ్లను దెబ్బతీస్తుంది.
గ్రీసు దేశంలో ప్రాచీన కాలంలో ఆటల్లో విజయం సాధించిన క్రీడాకారుని తలపైన సువాసనలు వెదజల్లే దండ వేసి సత్కరించేవాళ్లు. అదే సమయంలో “విజయాన్ని చూసి ఉప్పొంగిపోకండి” అని సూచన చేసేవాళ్లు. కాబట్టి, సాధారణంగా ఉన్న మిమ్మల్ని ఉన్నతస్థాయికి చేర్చిన పనిని విస్మరించకండి. ఉత్పాదకత విషయంలో గానీ, నైపుణ్యాన్ని ప్రదర్శించటంలోగానీ ఏ మాత్రం ఉపేక్ష వహించినా అది మిమ్మల్ని కబళిస్తుంది. క్రీడాకారులు, కళాకారులు నిరంతర సాధనలో నిమగ్నమవుతారు. పేరు ప్రఖ్యాతులు లభించాయి కదా అని శిక్షణను పక్కన పెట్టరు. పరిశ్రమించటం మానరు. అందుకే వాళ్లు మరింత ఉన్నతస్థాయికి చేరతారు. ఎప్పుడయితే ‘గెలవాలన్న తపన’ అడుగంటుతుందో వ్యక్తిగానీ, మహాసామ్రాజ్యాలు గానీ కుప్పకూలక తప్పదు. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే మీ ప్రయాణం విజయవంతంగా సాగుతుంది.
వృద్ధాప్యం వచ్చే వరకూ చేయాల్సిన పనులను వాయిదా వేసుకోవద్దు. అవసాన దశ సమీపించాక అప్పుడు ఈ పని చేసుంటే బాగుండేది. ఇతరులు ఏమనుకుంటారోనని ఆలోచించకుండా ఉంటే బాగుండేది. అంత సమయం వృథా చేయకుండా బాగుండేది, మరింత దయగా ప్రేమాస్పదంగా వ్యవహరించి ఉంటే బాగుండేది.. ఇలా పశ్చాత్తాపాలకు లోనుకాకుండా జీవితానికి ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి.
ఈ సృష్టిలో మనలా ఇంకొకరు ఉండరు. ఎవరికి వారే ప్రత్యేకం. మన వేలిముద్రల మాదిరిగానే మన బలాలు, బలహీనతలు, ఆశయాలు, ఆశీర్వచనాలు అన్నీ మనకే ప్రత్యేకం. ఆ ప్రత్యేకతలను, ఆ విశిష్టతలను మనవిగా చేసుకోవాలి. మనలోని మంచి గుణాలకు సంతోషపడాలి. మంచితనానికి పొంగిపోవాలి. మనకు మనమే చీర్‌లీడర్‌గా మారిపోయి మంచిపదాలతో వీలైనంత గొప్పగా మనల్ని మనమే ప్రశంసించుకోవాలి. మనకు మనమే తొలి అభిమానులుగా మద్దతు ఇచ్చుకోవాలి మరి!
మీకు భయం కలిగినప్పుడు ‘హీరోయిజం’ ఏం చేస్తుంది? అని ప్రశ్నించుకోండి. విచారం కలిగినప్పుడు ‘ఆత్మవిశ్వాసం’ ఎలా ప్రవర్తిస్తుంది అని ఆశ్చర్యానికి గురికాండి. కోపం వచ్చినప్పుడు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? అని ఆలోచించండి. గాయపడినప్పుడు ఆశావాదాన్ని వెతుక్కుంటూ వెళ్లండి. అభ్రదత వెంటాడినప్పుడు స్వీయప్రేమను అనుసరించండి. అప్పుడు అన్నీ మీకు అనుకూలంగా మారతాయి. మీ సంతోషానికి భిన్నంగా ఏదీ జరగదు. ఈ పరీక్షలు మీ సామర్థ్యానికి సాన పెడతాయి. మీ పనులు గొప్ప విజయాన్ని అందిస్తాయి. వరుస విజయాలు మిమ్మల్ని ‘హీరో’ చేస్తాయి. మీకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. చరిత్రలో మీకంటూ ఓ పేజీ నమోదవుతుంది. హీరోగా జీవించండి. .. హీరోగా మరణించండి..
మనం కొంతమందిని గమనించినప్పుడు వారి మాటల్లో నిరాసక్తత కనిపిస్తుంది. అన్నిటి గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేస్తారు. తాము ప్రయత్నించకపోవటానికి పరిస్థితులు సహకరించలేదని, వాతావరణం అనుకూలంగా లేదని, ఫలానా వ్యక్తులు ఎదగనీయకుండా అడ్డుపడ్డారని ఇలా ఏవేవో చెబుతారు. వీళ్లను బాధితులు అని చెప్పుకోవాలి. బాధితుల మనసత్వానికి హీరో మనస్తత్వానికి తేడా ఏమిటో చూడండి.
బాధితుడు హీరో
నేను చేయలేను అంటాడు నేను చేయగలను అంటాడు
ఏవో సాకులు చెబుతాడు ఫలితాలు సాధించి చూపుతాడు
గతంలో జీవిస్తాడు భవిష్యత్తును సుందరంగా మలుచుకుంటాడు
ఏదో ఒక పని తలకెత్తుకుంటాడు అవసరమైన పనిలో మాత్రమే నిమగ్నమవుతాడు
ప్రపంచం నుంచి తీసుకుంటాడు ప్రపంచానికి ఇస్తాడు
“జీవితంలో ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం దాని వెంట అంతే స్థాయిలో గానీ… అంతకంటే గొప్పవైన ప్రయోజనాలను వెంట తీసుకువస్తుంది” అని చెబుతాడు నెపోలియన్ హిల్. కష్టాలను అధిగమించి వ్యక్తిగతంగా విజయం సాధించటానికి మీరు ఇలాంటి మానసిక స్థితిని అలవరచుకోవాలి.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు