Morning Mantra | ఒకప్పుడు ఉదయం కాగానే పక్షుల కిలకిలారావాలు సుప్రభాతం పలికేవి. వేకువజామునే మలయమారుతం ముంగురులను ముద్దాడేది. కానీ, ఇప్పుడు ప్రతి ఉదయం సెల్ఫోన్ చూడటంతోనే మొదలవుతున్నది. ఇంట్లో ఉన్నవాళ్లను పలకరించకముందే.. స్నేహితులకు సందేశాలు పంపడం రివాజుగా మారింది. అయితే, ఉదయం లేవగానే కొంత సమయాన్ని మనకోసం కేటాయించుకోవడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
కష్టమే అయినా తెల్లవారుజామున లేవడం మంచిది. ముఖ్యంగా వేసవిలో సూర్యోదయానికి ముందు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కాస్త పెందరాలే లేచి డాబాపైకి వెళ్లి… ఉదయిస్తున్న సూర్యుణ్ని చూడటం దినచర్యగా చేసుకోండి.
లేవగానే నేర వార్తలు, రాజకీయ వార్తలు వినడం ద్వారా నెగెటివిటీ పెరుగుతుంది. ఆ భారం రోజంతా కొనసాగుతుంది. అలా కావొద్దంటే.. శ్రావ్యమైన సంగీతం వినండి. లేదంటే మీకు నచ్చిన మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. నాలుగు మంచి మాటలు వినే ప్రయత్నం చేయండి. సంగీతం ఆసక్తి లేకపోతే.. కండ్లు మూసుకొని మీకు నచ్చిన వ్యక్తిని, మీ జీవితంలో నచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఇది మీలో ఆనందాన్ని,నమ్మకాన్ని పెంచుతుంది.
తేలికపాటి యోగాసనాలు రోజూ చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మనసు ఉత్సాహంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
ఉదయం లేవగానే మీ గురించి ఆలోచించుకోవాలి. ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రత్యేకమైన పనులు ఉన్నట్లయితే వాటిని ఏ సమయంలోగా పూర్తిచేయాలి.. ఇలా మనసులో అనుకోండి. దానికి
తగ్గట్టుగా వ్యవహరించండి.
ప్రతీ ఉదయం చిక్కటి టీ ఆస్వాదిస్తూ కుటుంబసభ్యులతో నాలుగు మంచి విషయాలు మాట్లాడండి. ఇరుగుపొరుగు, బంధువుల తప్పొప్పుల గురించి కాకుండా.. సరదా కబుర్లు చెప్పుకొనే ప్రయత్నం చేయండి.