హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలోని సున్నపురాయి మైనింగ్ బ్లాకుల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపి, వివాదాస్పదమైన టెండర్లను రద్దు చేయాలని డిమాండు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. గనుల శాఖ చేపట్టిన ఈ-వేలం ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. గనుల శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం చేపట్టిన ఈ-వేలం ప్రక్రియలో విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు, పారదర్శకత లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్పూర్ మైనింగ్ బ్లాకుల్లో సుమారు 1,100 ఎకరాల రిజర్వు ఫారెస్టు భూమి ఉన్నప్పటికీ టెండర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన కీలక వివరాలు పొందుపరచలేదని ఆరోపించారు. ముఖ్యంగా మినరల్ బ్లాకుల కచ్చితమైన అక్షాంశ-రేఖాంశాలు (డీజీపీఎస్), కంపార్ట్మెంట్ల వివరాలు, డీజీపీఎస్ సర్వే ధ్రువీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు, ఎంటీఎం జియో కోఆర్డినేట్లు వంటి సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇలాంటి లోపాలు వేలం ప్రక్రియ చట్టబద్ధతను, పారదర్శకతను తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు.
టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాకులను కచ్చితంగా గుర్తించి, పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ నిబంధనలు పాటించలేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ అక్రమ టెండర్లపై మరింత ఆందోళన కలిగించే అంశాలను కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు (పిల్ నంబర్ 21/2024) ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, పర్యావరణ అనుమతులు పూర్తి కాకముందే ముందే అనుకున్న బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. సైదుల్నామా బ్లాకుకు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్పుర బ్లాకుకు నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీలు ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని, ఈ కంపెనీలు రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాకుల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇచ్చేందుకు నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నదని పేర్కొన్నారు. అటవీ శాఖ నుంచి తప్పనిసరిగా పొందాల్సిన నిరంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) లేకుండానే వేలం నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయని, రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ చేపట్టడం పర్యావరణానికి ముప్పు కలిగించడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో నాలుగు కీలక డిమాండ్లు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. లేఖ ప్రతులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మైనింగ్ శాఖ డైరెక్టర్‌కు కూడా పంపారు.