Obesity | ఊబకాయం (ఒబెసిటీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక అనారోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా యువతలో ఊబకాయం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ఊబకాయం నియంత్రణలో అత్యంత కీలకం. రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సరైన మోతాదులో ఉండాలి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, డ్రైఫ్రూట్స్‌ను ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
ఆహారం తీసుకునే సమయం కూడా బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. రాత్రంతా ఉపవాసం తర్వాత శరీరానికి శక్తిని అందించేందుకు పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. తేనె, డ్రైఫ్రూట్స్‌తో కూడిన పాలు, తృణధాన్యాలు లేదా ఇతర ఆరోగ్యకరమైన అల్పాహారం మంచి ఎంపిక. చిరుతిండి పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవాలి. పండ్లు, సోయా గింజలు, ఓట్స్ బార్లు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల జీవక్రియ చురుకుగా ఉండి శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. వ్యాయామానికి ముందు, తర్వాత తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే. వ్యాయామానికి ముందు పండ్లు, గుడ్లు లేదా డ్రైఫ్రూట్స్ వంటి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం పూర్తయిన 30 నుంచి 45 నిమిషాల్లోపు ప్రోటీన్లు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయి.
రాత్రి భోజనం తేలికగా ఉండేలా చూసుకోవాలి. పగటిపూట భోజనం మానేసి రాత్రి అధికంగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పేరుకుపోతాయి. రాత్రి సమయంలో జీవక్రియల వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి సూప్‌లు, సలాడ్లు, తక్కువ కొవ్వు ఉన్న మాంసాహారం లేదా పెరుగు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం కూడా అవసరం. ధూమపానం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుండగా, మద్యం అధిక క్యాలరీలను అందించి బరువు పెరగడానికి కారణమవుతుంది. శుద్ధి చేసిన ధాన్యాల కంటే తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సజ్జలు, రాగులు, జొన్నలు, మొక్కజొన్న వంటి ధాన్యాలను తరచూ ఆహారంలో చేర్చాలి. అలాగే తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మంచిది. కేవలం కందిపప్పు, మినప్పప్పుతోనే కాకుండా రాజ్మా, శనగలు, సోయాబీన్స్, ఇతర సంపూర్ణ పప్పుధాన్యాలను కూడా ఆహారంలో చేర్చాలి. మొలకల రూపంలో లేదా వండుకుని వారంలో పలుమార్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి. మాంసాహారం తీసుకునేవారు తక్కువ కొవ్వు ఉన్న ముక్కలను ఎంచుకోవడం ఉత్తమం.
రోజుకు కనీసం మూడు సార్లు కూరగాయలు, రెండు సార్లు సంపూర్ణ పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. రోజుకు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ అవసరమవుతుంది కాబట్టి ఒక్క యాపిల్పైనే ఆధారపడకుండా వివిధ రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఫాస్ట్ఫుడ్స్, ప్యాకెట్ స్నాక్స్, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, కుకీలు, మార్జరిన్ వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలను వీలైనంత వరకు తగ్గించాలి. ప్యాకెట్ ఆహారాలను కొనుగోలు చేసే ముందు వాటి లేబుళ్లను పరిశీలించి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిది. సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం వంటి అలవాట్లు పాటిస్తే ఊబకాయాన్ని సహజంగానే నియంత్రించడంతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.