Thalapathy Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తన దర్శకత్వంలో రాబోతున్న సిగ్మా సినిమాతో పాటు తన భవిష్యత్తు కలల ప్రాజెక్ట్ గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో జాసన్ స్టాథమ్‌తో భవిష్యత్తులో సినిమా చేసే అవకాశం వస్తే, తమిళ సినిమా నుంచి ఏ హీరోను ఎంచుకుంటావని ఇంటర్వ్యూలో భాగంగా ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన తండ్రి విజయ్ పేరును జేసన్ సంజయ్ చెప్పారు. తన తండ్రి విజయ్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్ కలిసి పనిచేస్తే ఆ కలయిక చాలా అద్భుతంగా ఉంటుందని, అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన వెల్లడించారు. అయితే తాను ఈ సమాధానం చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్, జోక్స్ వస్తాయని తనకు ముందే తెలుసని ఆయన సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇక నటనపై ఆసక్తి లేకపోవడం వల్లే తాను దర్శకత్వం వైపు అడుగులు వేసినట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి సెట్స్‌లో తిరగడం వల్ల ఫిలింమేకింగ్పై మక్కువ పెరిగిందని, కెనడాలో దీనిపై శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా ఆయన ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.