కారేపల్లి, ఆగస్టు 01 : నకిలీ బంగారాన్ని సృష్టించిన ముఠాగుట్టు రట్టు ముగ్గురుతోనే ముగిసినట్టేనానని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా వెనక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఏమైనట్టనే సందేహం నెలకొంది. ఖమ్మం జిల్లా కారేపల్లి పరిసర ప్రాంతాల్లో రాగితో నకిలీ ఆభరణాలు తయారు చేసి, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాగితో నగలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూయడం, ముత్తూట్ లాంటి ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం, ఒక సంస్థలో తాకట్టు పెట్టిన నకిలీ బంగారానికి మరో గోల్డ్ కంపెనీ నుండి అదనంగా డబ్బులు తీసుకోవడం వంటి ప్రక్రియలో అసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠాలో సుమారు 40 మంది ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో కొంతమంది తమకున్న అంగ బలం, అర్థ బలాన్ని ఉపయోగించి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులతో పాటు పరారీలో ఉన్న నిందితుడు తోనే కథ ముగుస్తుందా? లేక అసలు సూత్రధారులెవరైనా ఇంకా తెరపైకి వస్తారా అనేది వేచి చూడాల్సిందే.