హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలోని శ్రీ శాతవాహన గ్రామీణ బ్యాంక్లో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఆ బ్యాంక్ ఉద్యోగి ఆ నంద్ పద్ కుమార్కు హైకోర్టు ఊరట కల్పించింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా 3 ఇంక్రిమెంట్ల కోత విధించి ఆనంద్ పద్ కుమార్ను ఇప్పటికే ఓసారి శిక్షించినందున మళ్లీ ఆయన నుంచి రూ.10.78 లక్షలు రికవరీ చేయాలని శాతవాహన గ్రామీణ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఏకపక్షంగా ఆదేశించడం తగదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆనంద్కు శిక్ష పెంచాలనుకుంటే నిబంధనల ప్రకారం ఉండాలని, అందుకు విరుద్ధంగా ఏకపక్షంగా రెండోసారి శిక్షించడం, ఆయన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా రికవరీ ఆదేశాలు జారీచేయడం చెల్లదని పేర్కొన్నది. ఒకవేళ ఆనంద్ నుంచి ఇప్పటికే సొమ్ము రికవరీ చేసినట్టయితే ఆ డబ్బు వాపసు ఇవ్వాలని స్పష్టం చేసింది.