హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన గొడవల్లో స్పీకర్‌ను దూషించారంటూ నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్‌రెడ్డికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. ఈ నెల 8న కింది కోర్టు వారికి రిమాండ్ తిరస్కరించి, బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు సోమవారం విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు ఉత్తర్వులను రద్దుచేసి, నిందితుల రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ తాతా మధుసూదన్, నవీన్ కుమార్‌రెడ్డికి నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.