హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారింది. గడిచిన పది నెలల్లో రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాగ్ లెకల ప్రకారం.. మొత్తం రాష్ట్ర ఆదాయం భారీగా కనిపిస్తున్నా, అందులో సింహభాగం అప్పుల రూపంలోనే ఉండటం గమనార్హం. పది నెలల్లో రాష్ర్టానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.2,07,558 కోట్లు. వినడానికి ఇది పెద్ద మొత్తమే అయినా, ఇందులో సొంత పన్నుల ద్వారా సమకూరింది రూ.1,26,293 కోట్లు మాత్రమే. అంటే, రాష్ట్రం తన రోజువారీ అవసరాలు, పథకాలకు సరిపడా నిధులను స్వయంగా సమకూర్చుకోలేకపోతున్నది. 2025-26 బడ్జెట్లో వార్షిక రెవెన్యూ ఆదాయం రూ.2,29,720.63 కోట్లుగా రేవంత్ సర్కార్ ప్రతిపాదించింది.
కానీ, పది నెలల్లో అంటే జనవరి వరకు రూ.1,38,371.11 కోట్లు అంటే 60.23 శాతమే ఆదాయం వచ్చింది. ఇందులో సొంత రాబడులు అంటే పన్ను ఆదాయం రూ.1,26,293.64 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఇందులో జీఎస్టీ ద్వారా రూ.43,673.66 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,345.81 కోట్లు, సేల్స్ ట్యాక్స్ కింద రూ. 27,911.75 కోట్లు, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.19,083.91 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటా రూ.16,496.76 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.6,781.24 కోట్ల ఆదాయం వచ్చింది. నాన్ ట్యాక్స్ రెవె న్యూ ద్వారా రూ.7,864.18 కోట్లు, కేంద్రం నుంచి రూ.4,213.29 కోట్లు వచ్చినట్టు జనవరి నెల కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
క్యాపిటల్ రిసీట్స్ రూ.69,187 కోట్లు
ప్రభుత్వం చూపుతున్న రాబడుల్లో క్యాపిటల్ రిసీట్స్ విలువ రూ.69,187 కోట్లు. ఇవి ప్రభుత్వ ఆస్తులను అమ్మి లేదా కొత్తగా అప్పు చేసి తెచ్చుకున్న నిధులు. రూ.70వేల కోట్లు అప్పుల రూపంలోనే ఉండటాన్ని గమనిస్తే అప్పుచేస్తే కానీ గడువని స్థితికి రాష్ట్రం చేరిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్లో వార్షిక ఆదాయం రూ.2,84,837.30 కోట్లుగా ప్రతిపాదించగా, జనవరి నాటికి రూ.2,07,558.18 కోట్లు (72.87 శాతం) మాత్రమే వస్తే.. అప్పులు మాత్రం లక్ష్యాన్ని దాటి 130 శాతానికి పెరిగాయి.
ఆర్థిక నిర్వహణలో లోపాలు
రాష్ట్ర ఆదాయంలో సగం వాటా అప్పులదే కావడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. భారీ అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు రాష్ట్ర బడ్జెట్ను కుంగదీస్తాయి. కొత్త ప్రాజెక్టుల కంటే, పాత అప్పుల వడ్డీలకే ఎకువ నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఆదాయం కంటే అప్పులు పెరిగినప్పుడు, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెట్టక తప్పని పరిస్థితి. రోడ్లు, సాగునీరు వంటి ఆస్తుల కల్పనకు వాడకుండా, వేతనాలు, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చులకు వాడితే ఆర్థి క వ్యవస్థ కుప్పకూలుతుంది. పది నెలల్లోనే రూ.70 వేల కోట్ల అప్పు అంటే, రాష్ట్రం అప్పుల ఊబిలో ఎంతలోతుగా కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నియంత్రణ పాటించకపోతే, భవిష్యత్తరాలపై భారం పడుతుందని ఆర్థికనిపుణులు హెచ్చరిస్తున్నారు.
11 నెలల అప్పు@ 83,300 కోట్ల
కాంగ్రెస్ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.80,800 కోట్ల రుణం సమీకరించగా తాజాగా సోమవారం ఆర్బీఐ నుంచి తీసుకున్న రూ.2,500 కోట్ల రుణంతో మొత్తం రూ.83,300 కోట్లకు చేరింది. బడ్జెట్లో ప్రతిపాదించిన వార్షిక రుణ లక్ష్యం రూ.54,009 కోట్లు కాగా, సోమవారం నాటికి రూ.83,300 కోట్లకు(154.23 శాతం) చేరింది. ఈ వేలం ద్వారా 20 ఏండ్ల కాల పరిమితితో 7.67 వార్షిక వడ్డీ రేటుకు రూ.1,000 కోట్లు, 26 ఏండ్ల కాల పరిమితితో 7.65 వార్షిక వడ్డీ రేటుకు రూ.500 కోట్లు, 29 ఏండ్ల కాలానికి 7.65 వార్షిక వడ్డీ రేటుకు మరో రూ.1,000 కోట్ల రుణాన్ని సెక్యూరిటీ బాండ్లు పెట్టి తీసుకున్నారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమైన రేవంత్ సరార్.. కేవలం అప్పులపైనే ఆధారపడటం ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్నది. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే, కోలుకోలేని సంక్షోభంలో చికుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు
