Supreme Court : సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘సుప్రీం కోర్టు జడ్జిల సంఖ్య సవరణ బిల్లు-2026 (Supreme Court Number of Judges Amendment Bill)’ కు లోక్సభ ఆమోదం తెలిపింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఈ బిల్లును రూపొందించారు. బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) చర్చను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విపక్ష సభ్యులు పదేపదే నినాదాలు చేశారు. కీలకమైన బిల్లుపై చర్చలో పాల్గొనాలని సభ్యులను స్పీకర్ కోరారు. విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చించకుండానే స్పీకర్ ఆమోదం తెలిపారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంపు విషయంపై మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దానిని కార్యరూపంలోకి తీసుకొస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ద సుప్రీం కోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2026’ను జారీచేశారు. ఈ ఏడాది జారీ చేసిన తొలి ఆర్డినెన్స్ ఇదే.
ఇప్పుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీన 8 మంది న్యాయమూర్తులతో ప్రారంభమైన సర్వోన్నత న్యాయస్థానం 76 ఏళ్లలో సంఖ్యాపరంగా 30కు, నిష్పత్తి ప్రకారం 375 శాతం పెరిగినట్లయ్యింది.