Harish Rao | మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని మండిపడ్డారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 12.07.2026నాటి G.O.Rt.No.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని అన్నారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి.. కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయమని మండిపడ్డారు. ఈ నిర్ణయం 31 వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేతనాల పెంపు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేతనాల్లో కోతలు ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఉద్యోగుల వేతనాలు తగ్గించడం ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన అవుతుందని అన్నారు.
ప్రభుత్వం వెంటనే G.O.Rt.No.1181ను రద్దు చేయాలని, ఉద్యోగుల పూర్వపు హోదాను యథావిధిగా కొనసాగించాలని, వేతన రక్షణ కల్పించడంతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని BRS పక్షాన డిమాండ్ చేశారు.