Sarpanch Suicide Attempt | కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి అలియాస్ వినయ్ సాగర్ ఆత్మహత్యకు యత్నినంచారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు తనను అవమానాలకు గురిచేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద క్రిమిసంహార మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని ఆయనను ప్రైవేటు వాహనంలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. గంజాయి కేసు పెడతానంటూ బెదిరిస్తున్నారని, గంగాధర పోలీసులు ఫోన్ చేసి కేసు నమోదైందని, నోటీసులు తీసుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర మండల సర్పంచుల వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు తనను అవమానకరంగా మాట్లాడుతున్నారని తిరుపతి ఆరోపించారు. తన ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముద్దం నగేష్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.`