మంచిర్యాల, మార్చి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచింది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బాల్క సుమన్సహా బీఆర్ఎస్ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులో మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. క్యాతన్‌పల్లిలో ప్రజా తీర్పుకు కట్టుబడి.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేసిన బాల్క సుమన్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసినా.. జైలులో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురి చేసినా.. జైలు నుంచి బయటికి రాకుండా పాత కేసులను తవ్వి పీడీ యాక్ట్ పెట్టాలని కుట్రలు చేసినా.. చివరకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవేవి ఫలించ లేదు.
బాల్క సుమన్‌పై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురి చేయాలని చూసిన సర్కార్, పోలీసులకు చెంపపెట్టులా.. మంచిర్యాల జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. బాల్క సుమన్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్, రామిడి లక్ష్మీకాంత్లకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్లు బాల్క సుమన్ న్యాయవాదులు రవీందర్రావు, మల్లేశ్‌గౌడ్ తెలిపారు. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు రెండు షూరిటీలు, మూడు నెలలపాటు ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలనే షరతులతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందన్నారు.
కాగా చెన్నూర్ కోర్టులో క్రైమ్ నంబర్ 37/2026లో బాల్క సుమన్‌పై పోలీసులు పీటీ వారెంట్ పిటిషన్ వేశారన్నారు. అది బెయిలేబుల్ సెక్షన్ అయినప్పటికీ.. వాదనలు వినిపించేందుకు ప్రాసిక్యూషన్ ఈ నెల 5వ తేదీకి గడువు కోరారన్నారు. ఈ నెల 5వ తేదీన ఆ కేసులోనూ బెయిల్ వచ్చాక బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బయటికి వస్తారని తెలిపారు. ఈ కేసులో ఉన్న మిగిలిన బీఆర్ఎస్ నాయకులకు త్వరలోనే బెయిల్ వస్తుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని కోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. బాల్క సుమన్‌ను బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
ఈ కేసులో బాల్క సుమన్ జైలు నుంచి బయటికి రాకుండా అడ్డుకొనేందుకు సర్కార్ చివరి నిమిషం వరకు ప్రయత్నించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గత శుక్రవారం బాల్క సుమన్‌ను కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను రద్దు చేశాక.. ఆ ఫిటిషన్‌పై అప్పీల్‌కు వెళ్లడం బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు జరిగిన కుట్ర అంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. చెన్నూర్ కోర్టులో పీటీ వారెంట్ వేసి కౌంటర్ వేయకుండా వాయిదాల మీద వాయిదాలు తీసుకోవడం, బాల్క సుమన్‌ను ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు జైలులోనే ఉంచాలనే కుట్రలో భాగంగానే చేస్తున్నారన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా ఐదో తేదీన చెన్నూర్ కోర్టులోనూ బాల్క సుమన్‌కు బెయిల్ రావడం కాయమంటున్నారు. మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారంటూ స్పష్టం చేస్తున్నారు.
చెన్నూర్ కోర్టులో వేసిన పీటీ వారెంట్ బెయిలేబుల్ అయినప్పటికీ ప్రాసిక్యూషన్ కావాలని కాలయాపన చేస్తున్నారు. మరిన్ని రోజులు బాల్క సుమన్‌ను జైలులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫిటిషన్లో కౌంటర్ వేసేందుకు ఇప్పటికే రెండుసార్లు గడువు తీసుకున్న ప్రాసిక్యూషన్ ఈరోజు మరోసారి గడువు తీసుకోవడం విడ్డూరంగా ఉంది. బెయిలెబుల్ సెక్షన్ అయినప్పటికీ కోర్టు ఇన్ని సార్లు వాయిదాలు ఇవ్వడం సరికాదన్నారు. అసలు పీటీ వారెంట్ ఇచ్చిన రోజేనే ఆ కేసులో బెయిల్ మంజూరు చేయాలి. కావాలని దురుద్దేశపూర్వకంగా వాయిదాలు వేస్తూ వస్తున్నారన్నారు. ఈ విషయంపై లోకాయుక్తాలో, హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, కోర్టులపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
– మల్లేశ్‌గౌడ్, బాల్కసుమన్ న్యాయవాది