తాండూరు, మార్చి 2: భవన నిర్మాణ రంగంలో ఇసుక కొనుగోళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు నిబంధనలు విస్మరించి తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్- చించోలి నేషనల్ హైవే పనులు తాండూరు పట్టణం మీదుగా జరుగుతుండడంతో కల్వర్టులు, వంతెనల నిర్మాణాలకు రెవెన్యూ, మైనింగ్ శాఖలు ఎంపిక చేసిన ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వగా ఇదే అదనుగా అక్రమార్కులు నేషనల్ హైవే పనులకు ఇచ్చిన అనుమతి పత్రాలతోనే అక్రమ రవాణా తంతు సాగిస్తున్నారు.
ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తే దీని ఆధారంగా అధికారులు కూడా అక్రమాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో బెన్నూర్, విశ్వనాథ్‌పూర్, గోంవింద్రావుపేట, సంగెంకుర్దు, తాండూరు మండలం గోనూర్ తదితర ప్రాంతాల్లో కాగ్నా , కాక్రవేణి వాగుల్లో ఇసుక రీచ్‌లు గుర్తించారు. అభివృద్ధి పనులకు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ఇండెంట్లు సమర్పిస్తే రెవెన్యూ శాఖ పర్మిట్లు ఇస్తుండగా మైనింగ్ శాఖ రవాణాకు రాయల్టీ బిల్లులు వసూలు చేయాలని నిబంధనలున్నాయి.
కొందరు అక్రమార్కులు ఇవే పర్మిట్లతో అక్రమంగా ఇసుకను బహిరంగ మార్కెట్, డంపింగ్ స్థలాలకు తరలిస్తున్నారు. ఆ తరువాత డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్‌కు రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్లలో అయితే రూ. 50 వేల రేటుకు విక్రయిస్తున్నారు. నేషనల్ హైవే పేరిట బ్యానర్లు కట్టిన ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతుంటే వాటిని తనిఖీ చేసేందుకు పోలీసులు కూడా వెనుకంజ వేస్తుండడం గమనార్హం.
కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి కొన్నాళ్లుగా ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తుండడంతో తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లోని వాగుల పరీవాహక ప్రాంత పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక తవ్వకాలు భారీ ఎత్తున జరుగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, పంట భూములు కోతకు గురై తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని తెలిపారు.
కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అవుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని అక్రమాలకు తెగబడుతున్నారు. ఇటీవల యాలాల మండలం అగ్గనూర్ పరిధిలోని కాగ్నా వాగులో ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆయా ట్రాక్టర్లను పట్టుకుని యజమానులతో బేరసారాలాడి వారం తర్వాత కేసు నమోదు చేయడం గమనార్హం.