Anganwadi Posts | అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తాం. ఈ దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినం.వెంటనే దరఖాస్తులు స్వీకరించి, సాధ్యమైనంత తొందరలో పరీక్షలు నిర్వహించి మూడు, నాలుగు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం.
-2025, మార్చి 1న మహిళా దినోత్సవంపై ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క ప్రకటన
హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ మాత్రం పట్టాలెక్కలేదు. రేపు, మాపు అంటూ ఊరించడం తప్ప సర్కార్ ఆ దిశగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టడమే లేదు. సాంకేతిక కారణాలు, ఎస్పీ వర్గీకరణ పేరిట కొంతకాలం, పంచాయతీ ఎన్నికలంటూ మరికొంత కాలం సాగదీస్తూ అంతులేని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఖాళీల భర్తీలో జాప్యం కారణంగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అగమ్యగోచరంగా మారుతున్నది.
ఉన్న టీచర్లు, హెల్పర్లపై అదనపు భారం పడుతున్నది. నిరుడు ఆగస్టులో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆమోదంతెలిపింది. 6,399 టీచర్లు, 7,834 ఆయాల నియామకానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సర్కార్ ఆదేశించింది. కానీ ఆరు నెలలు దాటినా నోటిఫికేషన్లు జారీ చేయకుండా జాప్యం చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాంకేతికంగా ఇక్కట్లు ఎదురవుతాయని కొంతకాలం ఆలస్యం చేసింది.
కానీ గత నవంబర్లోనే ఈ సమస్య కొలిక్కివచ్చింది. పంచాయతీ ఎన్నికల పేరిట మరికొంతకాలం సాగదీసింది. ఎన్నికలు ముగిసినప్పటికీ సర్కార్ మాత్రం పోస్టుల భర్తీపై నిర్లక్ష్యాన్ని వీడటమే లేదు. మంత్రి ప్రకటించి 12 నెలలు కావస్తున్నా.. నియామక ప్రక్రియపై స్పష్టత ఇవ్వడమే లేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ కప్పదాటు వైఖరిపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లలో అసహనం వ్యక్తమవుతున్నది.
65 ఏండ్లు నిండిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యోగ విరమణ చేసేలా రెండేండ్ల క్రితం ప్రభుత్వం నిబంధనలు రూపొందించి వెంటనే అమలులోకి తెచ్చింది. దీంతో ఏటా సుమారు 1,000 మందికిపైగా సిబ్బంది విరమణ పొందుతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో ఒక్కో కేంద్రానికి టీచర్లు, ఆయాలు 71 వేల మంది పనిచేయాల్సి ఉంటుంది. కానీ నిరుడు ఆగస్టు నాటికే 14 వేల ఖాళీలు ఉన్నాయని ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 15 వేలు దాటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సిబ్బంది విరమణతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిర్వహణ భారంతో సతమతమవుతున్నారు. ఒక్కో టీచర్ రెండు, మూడు కేంద్రాల బాధ్యతలు చూడాల్సి వస్తున్నదని అంగన్వాడీ యూనియన్ నాయకులు చెప్తున్నారు. అంతేగాకుండా ఎన్నికల సమయంలో బీఎల్వోలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ, చిన్నారులకు అక్షరాలు దిద్దించడం, వారి ఆలనాపాలనా చూడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిరుడు జూన్లో అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసింది. టీచర్ల వేతనాన్ని పెంచింది. వీటిలో వెంటనే హెల్పర్లను నియమిస్తామని ప్రకటించింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో వీటిని టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. హెల్పర్ల పనులను కూడా తామే చేయాల్సి వస్తున్నదని పలువురు టీచర్లు చెప్తున్నారు. వంట చేయడం, పోషకాహారం పంపిణీ, చిన్నారులకు చదువు చెప్పడం తమకు తలకుమించిన భారంగా మారిందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే అప్గ్రేడ్ అయిన కేంద్రాల్లో ఆయాలను నియమించాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం త్వరలోనే భారీగా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ ప్రకటన వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ మహిళలెందరో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా తాత్సారం చేస్తుండటంతో వారంతా నిరాశ చెందుతున్నారు. మంత్రితోపాటు సంబంధిత శాఖ అధికారులు తరుచూ లీకులివ్వడమే తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది మహిళాదినోత్సవం నాడే నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని ఆర్భాటం చేసిన సర్కార్.. తీరని జాప్యం చేస్తుండటంతో అసహనానికి గురవుతున్నారు. వెంటనే మంత్రి ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ కేంద్రాల్లో ఆయాల నియామకంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. 10 నెలలు దాటినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. ఎన్నికలు, సర్వేల బాధ్యతలు సైతం మాకే అప్పగిస్తున్నది. వెంటనే అంగన్వాడీ సెంటర్లలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసి సాధ్యమైనంత తొందరలో నియామక ప్రక్రియ మొదలుపెట్టాలి..
– వరలక్ష్మి, అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు (మినీ)