Health Tips | కార్యాలయాలు, పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఈ సలహా మీ కోసమే. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పని ప్రదేశాల్లో చిన్నచిన్న మొక్కలు పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. పని ప్రదేశాల్లో మొక్కలు పెంచడం వల్ల చాలామంది ఒత్తిడిని జయించారని జపాన్లోని హ్యోగో యూనివర్సిటీ పరిశోధకుడు మసాహిరో ఉవాచ. సుమారు 63 మంది ఉద్యోగులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వర్కర్స్ డెస్క్ వద్ద చిన్న మొక్కలను ఉంచి వారిలో జరుగుతున్న మార్పులను అధ్యయనం చేశారు.
అలసట అనిపించే సమయంలో డెస్క్ వద్ద మూడు నిమిషాలు కూర్చోవాలని బృందం సూచించింది. మొక్కలను చూశాక వారిలో ప్రశాంతత నెలకొనడంతోపాటు పనిలో వేగం పెరిగినట్టు గుర్తించింది. అదే సమయంలో మొక్కలు లేని స్థలంలో ఉద్యోగుల పని తీరును కూడా గమనించింది. ఇరువురి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. కంప్యూటర్ల దగ్గర ఒకటీ అరా మొక్కలు ఉంచిన వాళ్లలో పనితనం పెరిగిందని మసాహిరో మాట. మొత్తంగా ఆఫీస్లో చిన్నచిన్న ఇండోర్ ప్లాంట్స్ పెంచడం వల్ల ఒత్తిడి చిత్తయి పనిమంతులు అనిపించుకునే అవకాశం ఉందన్నమాట!