న్యూఢిల్లీ, మార్చి 7: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్)ల వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని, ముఖ్యంగా పిల్లల్లో హృదయ సంబంధ మెటబోలిక్ రుగ్మతలు, మానసిక రుగ్మతలు, మరణాల పెరుగుదల సంభవిస్తుందని ఒక కెనడా పరిశోధన వెల్లడించింది. కార్ఖానాల్లో వివిధ దశల్లో తయారు చేసే ఆహారాన్నే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. అధికంగా శుద్ధి చేసిన పదార్థాలను ఇందులో వాడతారు.
ఇందులో ఆహారం కంటే ఎక్కువగా రసాయనాలు, ఫ్లేవర్లు, రంగులు, స్వీట్నర్లు వంటివి కలుపుతారు. మనం తినే బర్గర్లు, ప్యాకెట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్‌లు, సోడాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన స్నాక్స్, బ్రెడ్, కేకులు, బిస్కట్లు వంటివన్నీ ఈ కోవకే వస్తాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం ఎక్కువగా తీసుకున్న ఐదేండ్లలోపు పిల్లల్లో ఆందోళన, భయం, దూకుడు, భావోద్వేగ ఇబ్బందులు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన పరిశోధకుల బృందం ఆధ్వర్యంలో జరిపిన ఈ పరిశోధన వివరాలను జమా నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురించారు.
వీరు యూపీఎఫ్‌లను మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్ (ఎంపీఎఫ్)తో మార్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు రెండు వేల మంది పిల్లలపై ఈ పరిశోధన జరిపారు. దీనిపై న్యూట్రిషనల్ సైన్సెస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, బృందంలోని ముఖ్య పరిశోధకుడు కొజెటా మిలిక్ మాట్లాడుతూ ప్రీ స్కూల్ సమయం పిల్లల అభివృద్ధికి చాలా కీలకమని, పిల్లల ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవడం, ప్రారంభించే సమయం కూడా అదేనని అన్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం కెనడాలో ప్రీ స్కూల్ పిల్లల ఆహారంలో 46 శాతం వాటాను కలిగి ఉంది. వీటి కారణంగా చిన్న వయసులోనే పిల్లలు ఊబకాయంతో పాటు కార్డియో మెటబాలిక్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు.