Viral News : చైనా (China) లో జరిగిన ఒక పెళ్లి వేడుక (Marriage Ceremony) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి తంతులో భాగంగా జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో పెళ్లికుమార్తె (Bride) కు మెయిడ్‌గా ఉన్న ఆమె 20 ఏళ్ల స్నేహితురాలు జాంగ్ వెన్నెముక విరగింది. దాంతో ఆమె శాశ్వత వైకల్యానికి గురై మంచానికే పరిమితమైంది. దీనిపై బాధితురాలు కోర్టు (Court) ను ఆశ్రయించగా.. కోర్టు వధూవరులతోపాటు వేడుకలో పాల్గొన్న పలువురు సభ్యులను బాధ్యులను చేస్తూ తీర్పు ఇచ్చింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ ఘటన 2023 అక్టోబర్‌లో జరిగింది. పెళ్లి సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ హున్నావో వేడుక (ర్యాగింగ్ లాంటి వేడుక) జాంగ్ పాలిట శాపమైంది. హున్నావో అనేది ఒక పురాతన చైనీస్ ఆచారం. ఈ వేడుక వాస్తవానికి దుష్ట శక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య ఉన్న బిడియాన్ని తొలగించడానికి ఉద్దేశించబడింది. అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ వేడుక రూపాలు మార్చుకుంటూ ప్రమాదకర వేడుకగా మారింది. దీనిపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి.
హున్నావో వేడుకలో భాగంగా జాంగ్‌ను దాదాపు 10 మంది పురుషులతో (వారిలో చాలామంది వరుడి స్నేహితులే) ఒక గదిలో ఒంటరిగా వదిలేశారు. ఆమెను ఆ పురుషులు ఒక అల్మరా నుంచి బయటకు లాగి, మంచం మీదకు విసిరి, ఆపై ఒక దుప్పటితో గాల్లోకి ఎగురవేశారు. ఆ తర్వాత అందుకున్నారు. అలాగే రెండోసారి ఎగురవేసి అందుకోవడంలో విఫలమయ్యారు. దాంతో జాంగ్ వెన్నెముక విరిగిపోయింది. ఆస్పత్రికి తరలించగా 18 రోజులపాటు చికిత్స తీసుకుంది. ఆగస్టు 2024లో నిర్వహించిన ఫోరెన్సిక్ న్యాయ మదింపులో ఆమె గాయాన్ని గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించారు, ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం.
ఆమె వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 2,70,000 యువాన్లు (రూ.38 లక్షలు) కోరుతూ ఈ ఘటనలో పాల్గొన్న వధూవరులు మరో తొమ్మిది మందిపైన దావా వేశారు. కోర్టు చివరికి ఆమెకు సుమారు 2,30,000 యువాన్లు (సుమారు రూ. 32 లక్షలు) ఇవ్వాలని ఆదేశించింది. పెళ్లి నిర్వాహకులుగా ఈ ప్రాంక్ గురించి తెలిసి కూడా దానిని ఆపడంలో విఫలమైనందున, నూతన వధూవరులు 40 శాతం బాధ్యత వహించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. జాంగ్‌ను అల్మరా నుంచి బయటకు లాగి, ఈ చిలిపి పని చేయమని సూచించిన వ్యక్తిని 20 శాతం బాధ్యుడిగా పరిగణించగా, మిగిలిన వారు ఇందులో తమకు ప్రమేయం లేదని నిరూపించుకోవడంలో విఫలమైనందున, మిగిలిన 40 శాతం పరిహారాన్ని పంచుకోవాలని ఆదేశించింది.
కాగా, చైనా పెళ్లిళ్లలో జరిగే ప్రమాదకరమైన ర్యాగింగ్ ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. 2018లో గైజౌ ప్రావిన్స్‌లో ఒక వరుడు వివాహ వేడుకలో భాగంగా జరిగే ఒక ప్రాంక్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో అదే ప్రావిన్స్‌కు చెందిన మరో వరుడు ఇలాంటి ఆచారం నుండే తప్పించుకునే క్రమంలో కాలు విరగ్గొట్టుకున్నాడు. ఆ తర్వాత దీనికి బాధ్యులైన వారు అతనికి 50,000 యువాన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.