Supreme Court : ప్యాకేజీ ఫుడ్ విషయంలో కొందరు చాలా అప్రమత్తంగా ఉంటారు. తమ పిల్లలకు ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి అనారోగ్యకరం అని భావిస్తారు. అయితే, కొందరికి వాటిపై అవగాహన ఉండదు. ఆరోగ్యానికి అవి ఎలాంటి హాని చేస్తాయి అనే విషయం గురించి తెలియదు. అందుకే, ఇకపై ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రత్యేక లేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆ ఫుడ్లోని పదార్థాలు, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను సూచించే లేబుళ్లు ఆ ప్యాకెట్లపై ముంద్రించాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని ‘ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఎఫ్‌ఓపీఎల్ (ఫ్రంట్ ఆఫ్ ప్యాకెట్ వార్నింగ్ లేబుల్స్)కు సంబంధించి దాఖలైన కేసులో సుప్రీంకోర్టు గతంలో ఎఫ్ఎస్ఎస్ఏఐకి కీలక సూచనలు చేసింది. ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఆ ఆహారానికి సంబంధించిన ప్రభావాల్ని చూపించే లేబుల్స్ ఉండేలా చూడాలని కోర్టు ఆదేశించింది. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇస్తున్న ఫుడ్ ఎలాంటిదో ఒక అంచనాకు రాగలుగుతారు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ వార్నింగ్ లేబుల్స్‌ను అమలు చేయడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆలస్యం చేసింది.
దీనిపై స్పందించిన కోర్టు.. ఆహార తయారీ సంస్థలు, కార్పొరేట్ సంస్థల నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తించింది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా కోర్టుకు ఆరు పేజీల అఫిడవిట్ సమర్పించింది. ఎక్కువ ఉప్పు, ఎక్కువ కొవ్వు, ఎక్కువ చక్కెర ఉండే పదార్థాలున్న ఫుడ్ ప్యాకేజ్‌పై రెడ్ లేబుల్ ఉండేలా చూస్తామని కోర్టుకు తెలిపింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోని కీలక అంశాలివి. ప్యాకెట్ల ముందు భాగంలో ఆరు కోణాలుండే ఎరుపు రంగు మార్క్ ఉంటుంది.
దీనర్థం ఆ ప్రొడక్ట్‌లో అధిక చక్కెర, అధిక ఉప్పు, అధిక కొవ్వు ఉన్నాయని. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ న్యూట్రిషన్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ 2024లో సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఒక ఉత్పత్తిలోని పోషక విలువల్ని గుర్తిస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం అధిక స్థాయిలో హానికర పదార్థాలుంటే రెడ్ లేబుల్ వేస్తారు. ముందు వైపు పెద్ద సైజులో రెడ్ లేబుల్ వేయడం వల్ల అది చాలా హానికరం అని పిల్లలు, తల్లిదండ్రులు గుర్తించే వీలుంది. అయితే, సహజసిద్ధమైన ఉత్పత్తులకు ఈ రూల్ వర్తించదు.
అంటే తేనె, నెయ్యి, ఉప్పు, చక్కెర, నూనె వంటి వాటికి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తన అఫిడవిట్ సమర్పించింది. దీనిపై మరో 10 రోజుల తర్వాత విచారణ జరగనుంది. ఆ తర్వాత ఈ నిబంధన అమలుపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.