– మాతృభాషపై పట్టు సాదించి ఉత్తమ పరిశోధనలు చేయాలి
– ప్రముఖ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, యోగా గురువు మాదగాని శంకరయ్య
రామగిరి, ఆగస్టు 29 : బతుకునిచ్చే భాష తెలుగు. అయితే మాతృభాషలో ఉన్న మాదుర్యంతో మరే భాషలో ఉండదని నేటి తరం మాతృభాషను విస్మరించకుండా దాని మాదుర్యం, విశిష్టతను తగ్గించకుండా విస్తృతమైన రచనలు చేయాలని ప్రముఖ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, యోగా గురువు మాదగాని శంకరయ్య అన్నారు. తెలుగు భాష దినోత్సవం, ప్రముఖ రచయిత గిడుగు రామ్మూర్తి పంతులు 184వ జయంతి వేడుకలను నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాల సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలువేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.
ఆంగ్ల భాష కేవలం జ్ఞానాన్ని ఇస్తే, తెలుగు భాష మనిషికి బతుకునిస్తుందన్నారు. విద్యార్థులకు మాట్లాడే నైపుణ్యం ఉన్నప్పటికీ రాయడంలో లోపాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లభాషను సైతం ఇంగ్లీష్ లిపిలో రాసే అలవాటును మానుకోవాలని కోరారు. 2020-27 విద్యా సం. నుంచి డిగ్రీ తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధికి తన తండ్రి మాదగాని పెంటయ్య జ్ఞాపకార్ధం బంగారు పతకం అందచేస్తామని ప్రకటించారు. తెలుగు విభాగం నిర్వహించే కథా సెమినార్, సాంస్కృతిక పోటీలకు ఆర్ధిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు.
తెలుగు అధ్యాపకుడు డా.ఇడురోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. గిడుగు పోరాట స్ఫూర్తిని, కఠినమైన పదాలు, దీర్ఘ సమాసాలతో ఉన్న తెలుగును వ్యవహారిక భాషగా మార్చడానికి గిడుగు దశాబ్దాల పాటు పోరాడారని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితంగానే నేడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డా.పరంగి రవికుమార్, తెలుగు విభాగం అధ్యాపకుడు డా.వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.