– వైద్యం కోసం పలు ప్రైవేట్ ఆస్పత్రులు తిరుగుతున్న రోగి
– ఆర్ఎంపీ వేసిన ఇంజక్షనే కారణం అని బాధితుడి ఆరోపణ
సూర్యాపేట, సెప్టెంబర్ 15 : ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించడంతో నానా యాతనతో ఓ రోగి పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ చికిత్స చేయించుకుంటున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామ వాసి కర్ర వెంకటేశ్వర్లు అలియాస్ చిట్టి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం జ్వరం భారిన పడడంతో గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు మల్లేశం వద్ద చికిత్స తీసుకున్నాడు. ఆర్ఎంపీ తొంటి పిరుదుకు ఇంజక్షన్ ఇవ్వడంతో అది కాస్త వికటించింది. ఇన్ఫెక్షన్గా మారి రంద్రం పడడంతో రోగి బాధ వర్ణాతీతంగా మారింది. దీంతో సూర్యాపేట పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదించగా ఇంజక్షన్ వికటించడంతో చెడు రక్తం చేరి చీము పట్టడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువగా తయారైందన్నారు. కిడ్నీపై ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఇదేంటని సదరు ఆర్ఎంపీని ప్రశ్నించగా నేను అందుకే మీకు ఇంజక్షన్ వేయను వేస్తే మీరు ఏదో ఒకటి చెబుతారు అని బెదిరిస్తున్నాడని రోగి వాపోయాడు. దీంతో సదరు ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు.