AP News | విజయవాడ: విజయవాడ (Vijayawada) కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఓ బస్సులో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నరసారావుపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి అప్రమత్తతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం నగరంలో కలకలం రేపడంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే వ్యక్తి నరసారావుపేట (narasaraopeta) నుంచి విజయవాడకు బస్సులో వచ్చాడు. బస్సు దిగిన తరువాత తన బ్యాగుకు బదులు వేరే బ్యాగును తీసుకున్నాడు. తర్వాత ఆ బ్యాగును తెరిచిచూడగా అందులో పేలుడు పదార్థాలు కనిపించాయి. షాక్‌కు గురైన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
రంగంలోకి దిగిన కృష్ణలంక (krishnalanka) పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. బ్యాగులో 50 డిటోనేటర్లు, 46 జిలెటిన్ స్టిక్స్‌లు ఉన్నట్లు గుర్తించారు. బాంబ్, డాగ్ స్క్వాడ్లను రప్పించి బస్సుతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను తనఖీ చేశారు. కృష్ణలంక ఎస్సై గిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు, ప్రయాణికుల వివరాలను పరిశీలిస్తున్నారు. నగరంలో భద్రతను పెంచారు.