హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): బాలలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతలకు కొందరు ఉపాధ్యాయులు దూరంగా ఉంటున్నారు. ఆన్‌డ్యూటీ (ఓడీ) పేరుతో ఇతర శాఖల విధుల్లో ఏండ్లుగా కొనసాగుతున్నారు. ఇలా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో ఓడీల రాజ్యం నడుస్తున్నది. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 4,530 మంది ఉపాధ్యాయులు ఆన్‌డ్యూటీపై పనిచేస్తున్నారు. మరో 2,189 మంది టీచర్లు ఆన్‌డ్యూటీ విధుల కోసం క్యూకట్టారు. ఇందుకు సంబంధించిన అప్రూవల్ పెండింగ్‌లో ఉన్నది. దీంతో బోధనేతర విధుల నుంచి వారంతా దూరంగా ఉండటంతో ఆయా సబ్జెక్టుల పాఠాల్లో విద్యార్థులు వెనుకబడుతున్నారు.
ఉన్న ఉపాధ్యాయులకు అదనపు భారం పడుతున్నది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో కో-ఆర్డినేటర్లల్లో అత్యధికులు ఉపాధ్యాయులే ఉండటం గమనార్హం. కొందరు ప్రధానోపాధ్యాయులను కూడా కో-ఆర్డినేటర్లుగా తీసుకుంటున్నారు. డీఈవో కార్యాలయాలు, సమగ్రశిక్ష ప్రాజెక్టుల్లో బోధనేతర పనులకు సైతం టీచర్లనే వినియోగించుకుంటున్నారు. డిప్యుటేషన్ల విషయంలోనూ సామాజిక వర్గం, కుల, మతాల ఆధారంగా ఎంపిక జరుగుతున్నట్టు కొందరు టీచర్లు ఆరోపిస్తున్నారు. ఎస్సీఈఆర్టీలో తెలుగు విభాగంలో మూడు పోస్టులకు ఇద్దరిని డిప్యుటేషన్‌పై తీసుకోగా, పొసగక ఒక టీచర్ తానుండలేనంటూ వెళ్లిపోయారట.
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఆన్‌డ్యూటీ (ఓడీ) సదుపాయం ఉన్నది. రాష్ట్ర, జిల్లా నాయకత్వంలో అత్యధికులు విధులకు హాజరుకావడమే లేదు. ఓడీ లేని సంఘాలకు చెందిన వందలాది మంది నేతలు కూడా బడి దిక్కే చూడటం లేదట. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు టీచర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో డిప్యుటేషన్ల పేరిట పనిచేస్తున్నట్టు వార్తలొచ్చాయి. గడువు ముగిసినా వీరందరినీ రిలీవ్ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం హాజరు సర్టిఫికెట్ ఇస్తే టీచర్ల జీతాల బిల్లులను ప్రధానోపాధ్యాయులు డ్రా చేస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలంటున్నారు.
పాఠశాలలకు సమాచారమే ఇవ్వకుండా డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుల విషయం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో సగటున 20 వేల మంది టీచర్లు గైర్హాజరవుతున్నట్టు విద్యాశాఖ లెక్కలే చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మంది టీచర్లున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో నమోదైన వివరాల ప్రకారం.. అర్బన్.. ట్రైబల్ జిల్లాల్లో డుమ్మాకొట్టే వారి శాతం అధికంగా ఉంటున్నది. భద్రాద్రి-కొత్తగూడెం, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హాజరుశాతం తక్కువగా ఉన్నది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఓడీల కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నది.
ఈ జిల్లాలో ఇప్పటికే 181 మంది ఓడీపై పనిచేస్తుండగా, మరో 206 మంది ఓడీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లోనూ ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రం నడిబొడ్డున గల పాఠశాలలకు చెందిన 183 టీచర్లు ఒక్కరోజే డుమ్మాకొట్టారు. ఆగ్రహించిన అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ నెల 1న ఏకంగా 4,160 మంది సెలవు పెట్టకుండా, సమాచారమివ్వకుండా విధులకు డుమ్మాకొట్టారు. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 378, రంగారెడ్డిలో 260, సూర్యాపేట జిల్లాలో 236 మంది ఉపాధ్యాయులు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. ఇక మరో 11,041 మంది లీవు పెట్టారు.