మారేడ్‌పల్లి, అక్టోబర్ 3: బొల్లారం మిలిటరీ ఏరియాలో జరిగిన అత్యాధు నిక ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మాజీ హవిల్దార్తో పాటు అంతరాష్ట్ర ముఠాకు చెందిన మొత్తం 8మంది నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన 12 ఆయుధాలు, 1,912 బుల్లెట్లును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి సహకరించినవారు, ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చునున్నవారు, సాయుధ దోపిడీలకు పథకం వేసిన వారి పాత్రలను దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బి. సుమతి శనివారం సికింద్రాబాద్‌లోని మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజు (37) గతంలో మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లో హవిల్దార్‌గా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు భారీ దోపిడీలకు ప్రణాళిక రూపొందించాడు. గతంలో తనతో పని చేసిన కొండూరి శేషులు, వినోద్‌కుమార్, కుచరకంటి ప్రవీణ్ సహకారంతో ఆగస్టు 31న బొల్లారం మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్ ఆయుధాగారం, మందుగుండు సామగ్రి నిల్వ గది తాళాలు పగులగొట్టి అత్యాధునిక ఆయుధాలను చోరీ చేశారు.
ఆగస్టు 31న ఉదయం 7.50 గంటలకు చోరీ జరిగినట్లు గుర్తించిన సైనిక అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బొల్లారం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గతనెల 11న అందిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు మల్లేష్‌ను అచ్చంపేటలో అదుపులోకి తీసుకొని , చోరీ చేసిన ఆయుధాలను అచ్చంపేట లోని తన తండ్రి ఇంట్లో దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రూ. లక్షల్లో ఆయుధాల కొనుగోలు ఒప్పందం
ప్రధాన నిందితుడిని గతనెల 22 నుంచి ఈనెల1 వరకు పది రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారించడంతో చోరీ వెనుక ఉన్న కుట్ర వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయుధాల వ్యాపారులు అవిడే అలియాస్ ఓబి, బీర్బల్ షా చోరీ చేసిన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు అంగీరించినట్లు విచారణలో వెల్లడైనట్లు సీపీ సుమతి తెలిపారు. ఒక్కో పిస్టల్‌కు రూ. 3 లక్షలు, ఒక్కో రైఫిల్‌కు రూ. 5లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయుధాల కొనుగోలుకు సహకరించిన ఇద్దరితో పాటు స్థానికంగా సాయుధ దోపిడీలకు పథకం వేసిన మల్లికార్జున్, నిరంజన్లను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
దోపిడీలే లక్ష్యంగా కుట్ర…
మల్లికార్జున్, నిరంజన్‌లతో కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకొని సాయుధ దోపిడీలకు పాల్పడడానికి ప్రధాన నిందితుడు మల్లేష్ పథకం వేశాడు. గతంలో మల్లేష్ పై అచ్చంపేట, అమ్రాబాద్ పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయని, అవిడే పై పశ్చిమ బెంగాల్ లో ఆయుధాల చట్టం కింద కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ ముఠాకు ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్‌ను ఇప్పటికే జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించగా, మిగిలిన ఏడుగురిని నిందితులను శనివారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు సీసీ సుమతి వెల్లడించారు.
భారీ ఆయుధాలు స్వాధీనం..
నిందితుల నుంచి నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఐదు మ్యాగజైన్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, ఆరు 9 ఎంఎం పిస్టళ్లు, 1,156 పిస్టల్ బుల్లెట్లు, 720 ఏకే-203 బుల్లెట్లు, 36 ఇన్సాస్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. మొత్తం 1,912 బుల్లెట్లును, 5 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. 2022లో బారక్పూర్లో పని చేస్తున్న సమయంలో కొనుగోలు చేసిన నాటు తుపాకీని కూడా మల్లేష్ ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. ఆయుధాల చోరీ కేసును ఛేదించడంలో ప్రత్యేక బృందాలు సమన్వయంతో పని చేశాయని తెలిపారు.