Puvvada Ajay Kumar : రాష్ట్రంలోని ఒక్క గ్రామంలోనైనా రైతు రుణమాఫీ పూర్తిగా జరిగినట్టు నిరూపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) సవాల్ విసిరారు. రైతు రుణమాఫీపై గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను దగా చేసిందని పువ్వాడ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనను చూస్తుంటే.. ‘మోసపోతే గోస పడతాం, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని చెప్పిన కేసీఆర్ మాటలు నిజం అవుతున్నాయని మాజీ మంత్రి గుర్తు చేశారు.
రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామంలో ఆదివారం పర్యటించిన పువ్వాడ అజయ్ కుమార్ రైతు రుణమాఫీపై కాంగ్రెస్ చిత్తశుద్దిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పువ్వాడ.. రఘునాథపాలెం మండలంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ జరిగిందని నిరూపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు.

గతంలో కూడా రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగారని, కానీ రైతులకు ఇచ్చిన హామీల అమలుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని మంత్రి తుమ్మలను ఆయన విమర్శించారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్న పువ్వాడ ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపించాలని తుమ్మలను డిమాండ్ చేశారు.
పాలించే నాయకుడి మనసు మంచిగా ఉంటే ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారని, అందుకు కేసీఆర్ పరిపాలన ప్రత్యక్ష నిదర్శనమని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి రైతుబంధు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువుల సరఫరా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే రైతుబంధు నిధులను అరకొరగా జమ చేస్తోందని పువ్వాడ విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులకు సులభంగా అందుబాటులో ఉన్న యూరియాను ఇప్పుడు యాప్‌ల పేరుతో అందకుండా చేసి, గతంలో మాదిరిగా ఎరువుల కోసం రైతులు చెప్పులు అరిగేలా క్యూల్లో నిలబడే పరిస్థితి తీసుకొచ్చారని కాంగ్రెస్ సర్కార్‌పై ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ విద్యుత్ కోతలు పెరిగాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పువ్వాడ తెలిపారు. పంటలకు బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పూర్తిగా నీరుగారిపోయిందని, కాంగ్రెస్‌ను నమ్మి రైతులు మరోసారి మోసపోయారని మాజీ మంత్రి వెల్లడించారు. “మోసపోతే గోస పడతాం” అని కేసీఆర్ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇప్పుడు అదే పరిస్థితిని అనుభవిస్తున్నారని పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.