కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్యపాలనలో నేతన్నల ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల.. బీఆర్ఎస్ సర్కార్ కృషితో కళకళలాడగా.. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ సంక్షోభంలోకి నెట్టబడి ‘హస్త’వ్యస్తమైంది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ‘అభయహస్తం’ పథకాలు ఎగ్గొట్టినట్టే నేత కార్మికులకు గండి కొట్టేలా తీసుకున్న నిర్ణయాలు భస్మాసుర హస్తంలా మారడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఫలితంగా వస్త్ర పరిశ్రమ ఉనికి ప్రశ్నార్థకమైంది. జీవో నంబర్ 1కి తూట్లు పొడవడం, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడం, స్కూల్ యూనిఫామ్ టెండర్లను ప్రైవేట్‌కు కట్టబెట్టడం వంటివి ఒక్కొక్కటిగా పెరుగుతున్న సమస్యలు నేతన్నల మెడకు ఉరితాళ్లు పేనుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వేలాది మరమగ్గాలు మూతపడి, చేతినిండా పని దొరుకక 35మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మూడేండ్లుగా ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వం.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో మరోసారి కార్మికులను నమ్మించేందుకు యత్నిస్తున్నది. ఇన్నాళ్లూ కార్మిక నాయకులు, ఆసాముల కష్టసుఖాలు తెలుసుకోని ‘హస్తం’ సర్కార్.. ఇప్పుడ తెగ హడావుడి చేస్తుండటంపై కార్మికలోకం మండిపడుతున్నది.
నాటి కాంగ్రెస్ పరిపాలన(2004-2014)లో జరిగిన నేతన్నల మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదేండ్లలో 402మంది నేతన్నలు ఆత్మహత్యతో ఉరిశాలగా మారిన తీరు ఆందోళన కలిగించింది. సానుభూతి చూపడం, ఎన్నికలు రాగానే వరాలు కురిపించి ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం నాటి సమైక్య పాలకులకు పరిపాటిగా మారింది. దీంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హుటాహుటిన 2008 అక్టోబర్ 12న సిరిసిల్ల నడిబొడ్డున బహిరంగ సభ పెట్టారు. సిరిసిల్లను స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా చేస్తామని, మరమగ్గాలపై తయారైన వస్ర్తాలను మార్కెటింగ్ చేసేందుకు సిరిసిల్లలో సౌకర్యాలు కల్పిస్త్తామని, ప్రభుత్వ శాఖలు ఇక్కడినుంచి వస్త్రం కొనేలా చర్యలు తీసుకుంటామని, అపరెల్ పార్కు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధ కార్మికుల కోసం ఆశ్రమం ఏ ర్పాటుచేస్తామని చెప్పినా ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసలు కార్మికులను పట్టించుకోలేదు.
మళ్లీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్‌లో పాత పరిస్థితులే కనిపిస్తున్నాయి. మూడేండ్ల రేవంత్ పాలనలో అసమర్థ నిర్ణయాలతో కార్మికులకు శాపంగా మారి 35మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గొప్పలు చెప్పిన సర్కార్, ఆ మేరకు జీవో 1ని(2024 మార్చి 11) జారీ చేసింది. చేనేత పరిశ్రమను ప్రోత్సహించి, నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు టెస్కో ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంచేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ దవాఖానలు తదితర సంస్థలకు అవసరమైన అన్ని రకాల వస్ర్తాలను టెస్కో ద్వారా తీసుకోవాలని పేర్కొన్నది. ఆయా ప్రభుత్వ శాఖలు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ టెస్కో సరఫరా చేయలేకపోయినా, సరుకు అందుబాటులో లేకపోయినా టెస్కో నుంచి నాన్-అవైలబిలిటీ సర్టిఫికెట్ ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాతే ఇతర ఏజెన్సీల నుంచి సేకరించేందుకు అనుమతిస్తూ జీవోలో పేర్కొన్నది. కానీ ఈ నిబంధనలను సర్కారే అదే జీవోకు తూట్లు పొడిచింది. టెస్కో నుంచి ఎలాంటి వివరాలు సేకరించకుండానే ఇటీవల ఈ-టెండర్లు పిలిచి పలు రకాల ఉత్పత్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది.
నేతన్నపై కక్ష గట్టిన సర్కార్.. ముందుగా విద్యాశాఖ స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు రద్దు చేసింది. ఆ షాక్ నుంచి కోలుకోకముందే.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఏటా దాదాపు రూ.200 కోట్ల విలువైన స్కూల్ యూనిఫామ్ క్లాత్, కార్పెట్, బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్ వంటివి టెస్కో నుంచి సేకరించే వాటికి సర్కార్ నేరుగా ఈ-టెండర్లు పిలిచి ఉపాధిపై దెబ్బకొట్టింది. బతుకునిచ్చిన బతుకమ్మ చీరల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో నిలిపివేసి నేతన్నలకు పూర్తిగా ఉపాధి లేకుండా చేసింది. కేటీఆర్, నేతన్నల పోరాటం తర్వాత చీరల పథకాన్ని మరోపేరుతో ప్రారంభించినా దాన్ని కేవలం మహిళా సంఘాలకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన స్కూల్ యూనిఫామ్‌లు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఆర్డర్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఇలా దాదాపు రూ.200 కోట్ల విలువైన ఆర్డర్లు రద్దు కావడంతో సిరిసిల్లలోని పలువురు సాంచాలను నిలిపివేయడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మున్ముందు కార్మికుల భవిష్యత్ ఎటువైపు దారితీస్తుందోననే ఆందోళన ఇప్పుడు నేతన్నల్లో వ్యక్తమవుతున్నది.
సమైక్య రాష్ట్రంలో ఉరిశాలగా మారిన సిరిసిల్ల స్వరాష్ట్రంలో కళకళలాడింది. బీఆర్ఎస్ హయాంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని పరిశ్రమకు అండగా నిలిచింది. నేతన్నల వేతనాలు, కూలీ రెట్టింపు అయ్యేలా చేసింది. చేనేతమిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చి భరోసా నింపింది. సమైక్య రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత రూ.1,200 కోట్ల్లు బడ్జెట్‌ను కేటాయించింది. నిత్యం పని కల్పించి ఉపాధికి అండగా నిలిచేందుకు రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్షా అభియాన్ కింద దుస్తులకు సంబంధించిన ఆర్డర్లను నేతన్నలకు ఇచ్చి చేతినిండా పని కల్పించింది. కుల వృత్తిని ప్రోత్సహిస్తూనే.. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా కార్మికులను తీర్చిదిద్దింది. మగ్గాల ఆధునికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్‌తో అనుసంధానం వంటివి చేసింది. నేతన్నలకు బతుకులను సంపూర్ణంగా మార్చాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే రంజాన్, క్రిస్మస్ కానుకలతోపాటు ఇచ్చే వస్ర్తాల సంబంధించి రూ.3,313 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చి ఏడాది పొడవునా ఉపాధి దొరికేలా చేసింది. కేసీఆర్, కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన పథకాల వల్ల సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తుల టర్నోవర్ ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.1000 కోట్ల పెరిగింది.
ఫలితంగా నేతన్నల వలసలు, ఆత్మహత్యలను నివారించడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఉపాధి కోసం సిరిసిల్లకు వలస వచ్చేలా చేసింది. అలాగే ప్రతి కార్మికుడికీ నెలకు రూ.2,015 పింఛన్ ఇచ్చి కుటుంబాలకు అండగా నిలిచింది. దేశంలో ఎకడా లేని విధంగా త్రిఫ్ట్, చేనేత మిత్ర పథకాలను అమలు చేసింది. పెద్దూర్లో 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో అపెరల్ పార్ నిర్మాణం చేసి, ప్రముఖ గార్మెంట్స్ గోకుల్దాస్ కంపెనీ టెక్సీ పోర్ట్ కంపెనీ ద్వారా 2,500 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. కార్మికున్ని యజమానిగా మార్చాలనే లక్ష్యంతో 88 ఎకరాల స్థలంలో రూ.387.61 కోట్లతో వీవింగ్ పార్ ఏర్పాటు చేసింది. మొదటి దశలో 1,104 మంది కార్మికులకు ఒకొకరికి 4 అధునాతన మరమగ్గాల చొప్పున మొత్తం 4,416 మరమగ్గాలు అందించి యజమానులుగా చేయడానికి నిర్ణయం తీసుకున్నది. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను క్రమంగా రేపియర్, ఎయిర్ జెట్, వాటర్ జెట్ వంటి అధునాతన మరమగ్గాలతో ఆధునీకరించడం.. సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తులకు ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించి ఎగుమతులు ప్రోత్సహించడం, దశలవారీగా కార్మికులను యజమానులుగా మార్చడం, పెద్దూర్ అపెరల్ పార్లో 10వేల మంది మహిళల కోసం ఉపాధి కల్పనకు సంకల్పించింది. సిరిసిల్ల పాలిటెక్నిక్, జేఎన్టీయూల్లో టెక్స్టైల్ కోర్సులు ప్రవేశపెట్టింది.
నేను సాంచాలు కిరాయికి తీసుకున్న. నేను, నా భార్య సంధ్య ఇద్దరం కలిసి పనిచేసుకుంటున్నం. కేటీఆర్ సార్ నాడు మాకు చేతినిండా పనివ్వాలని ఆలోచన చేసిండు. బతుకమ్మ చీరలతోపాటు ఇతర ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్నడు. దాంతో మా బతుకులు మారినయ్. అప్పులు తీరినయ్. తలెత్తుకొని బతికినం. కార్మికులుగా ఉన్న మమ్మల్ని సేట్లుగా చేస్తామని ‘వర్కర్ టు ఓనర్’ పథకం తెచ్చిండు. దరఖాస్తు చేసుకున్నం. మా కూలీ బతుకులు మారుతయని సంబురపడ్డం. అంతలోనే సర్కార్ మారింది. మా బతుకులు మళ్లీ మొదటికి వచ్చాయి. మూడేళ్లగా కాంగ్రెస్ సర్కారు మమ్ముల్ని పట్టించుకుంట లేదు. పథకాన్ని అమలు చేసి, కార్మికులను యజమానులుగా చేయాలె.
ఇందిర మహిళా శక్తి చీరలకు యార్న్ సబ్సిడీ ఇస్తలేరు. కేసీఆర్ సర్కార్ బతుకమ్మ చీరలకు మంచిగ సబ్సిడీ ఇచ్చింది. మేం నేసిన బట్టకు మీటరు చొప్పున పది శాతం సబ్సిడీ వేసిన్రు. చీరలు నడిపినప్పుడు సబ్సిడీ మంచిగ వచ్చింది. అదనంగా రూ.15వేల-రూ.20 వేల వరకు వచ్చింది. ఈ సర్కార్ మాత్రం చీరలకు యార్న్ సబ్సిడీ వర్తించదని చెబుతున్నది. ఇందిరమ్మ చీరలకు పని ఎక్కువ. కూలి గిట్టుబాటు అయితలేదు. చేతినిండా పనియ్యాలె. యార్న్ సబ్సిడీ కేసీఆర్ సార్ లెక్క ఇయ్యాలే.
మాది జగిత్యాల జిల్లా. నేను పదిహేనేండ్ల క్రితం ఉపాధి కోసం భీవండి నుంచి సిరిసిల్లకు వచ్చిన. అప్పుడు పని మంచిగ దొరికింది. బతుకమ్మ చీరలు, యూనిఫామ్ ఆర్డర్లు వచ్చినయ్. ఏడాదంతా పనుండేది. రూ.18వేల-రూ.20వేల దాకా ఆదాయం వచ్చేది. మూడేండ్ల సంది సరిగా పనుంటలేదు. రెండేండ్ల నుంచి ఇందిరమ్మ చీరలు ఇచ్చిన్రు. వీటితో ఏడాదంతా పని దొరుకతలేదు. సర్కార్ పట్టించుకోవాలే.
నూలు బ్యాంకుతో మాకేం ఉపయోగం లేదు. సిరిసిల్లలో పెడితే బాగుండు. కానీ, వేములవాడలో పెట్టిన్రు. నూలు తీసుకొనే సంఘాలకు రవాణా భారం పడుతున్నది. అది యజమానులకే పనికొస్తది. మేం ఆసాములం. యజమానులకు కూలీకి వస్ర్తాన్ని తయారీ చేసి ఇస్తం. యజమాని మాకు మీటర్‌కు రూ.11 ఇస్తడు. అందులో కార్మికుడికి రూ.5 ఇస్తం. వైపనికి, కండెలు చుట్టేవారికి, టాకాలు పట్టేవారికి, మగ్గాల మరమ్మతులకు పోను మిగిలేది తక్కువే. ఇంకా సేట్లు కూడా పూర్తిగా పైసలు ఇస్తలేరు. సర్కార్ ఎప్పటికప్పుడు కొని వస్ర్తాలకు డబ్బులు చెల్లించాలి. మా ఆసాములకు ప్రత్యేకంగా సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. సొంతంగా వస్త్రాలను తయారు చేస్తం.