హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాస్తున్నా, రేవంత్‌రెడ్డి సర్కార్ ఇప్పటికీ నోరెత్తలేదు. కేంద్ర మంత్రిని కలిసినా కనీసం ఆ ఫిర్యాదులను ప్రస్తావించలేదు. ఏపీ సర్కార్ తీరును ఖండించలేదు. కానీ, ఆచరణ సాధ్యంకాదని నిపుణులు మొత్తుకుంటున్నా, తమ్మిడిహట్టికి అనుమతులు ఇప్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కోరడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి దాదాపు 15 ప్రాజెక్టులన్నీ అక్రమమంటూ తాజాగా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. 11 పేజీల లేఖ రాసింది. అనుమతులిచ్చేవరకూ పనులను నిలిపేసేలా చర్యలు చేపట్టాలని బోర్డును డిమాండ్ చేసింది.
బోర్డు మీటింగ్ ఎజెండాకు ఆయా అంశాలపై చర్చకు ప్రతిపాదించింది. గతంలోనూ కేంద్ర జల్‌శక్తి శాఖకు సైతం నేరుగా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ ఇప్పటికీ మీటింగ్ ఎజెండాను బోర్డుకు పంపలేదు. ఇదిలా ఉంటే, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సాయంత్రం స్వయంగా కలిశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అంతేతప్ప ఏపీ ఫిర్యాదులను ఖండించ లేదు. ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిందీ లేదు. మరోవైపు కాళేశ్వరం పంపింగ్ వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ, మరోవైపు వరద పోతున్నా, నీటిని ఎత్తిపోసుకునే అవకాశమున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును పడావుపెట్టి చోద్యం చూస్తున్నది.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తమ్మిడిహట్టి బరాజ్‌ను 152 మీటర్లతో నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించేలా చూడాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్ఐఎస్), సీతారామసాగర్ బహుళార్థక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని తెలిపారు. సమ్మకసాగర్ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కోరారు. నీటిమళ్లింపుల లెక్కల కోసం కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో టెలీమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి జీ వివేక్‌వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్ పాల్గొన్నారు.