రెండు రాష్ర్టాలు ఆయనకు రెండు కండ్లు.. అయినా ఒక కన్నులో ఆనందం కోసం మరో కన్నును తన వేలితోనే పొడవగలరు. తెలంగాణ నీటి ప్రాజెక్టులన్నా, జల హక్కులన్నా చంద్రబాబుకు ఏనాడూ గిట్టదు. నాడు కాళేశ్వరం పైనా, పాలమూరు-రంగారెడ్డి పైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖలు రాసిన ఆయనే.. ఆ తర్వాత తానెన్నడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని కూడా బుకాయించారు. ఆయన కుటిలనీతి గురించి, రెండు నాల్కల గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అలాంటి బాబు మళ్లీ ఇప్పుడు తెలంగాణ మీద పడ్డారు. ఇప్పటికే కృష్ణా జలాల్లో తన వాటా కన్నా ఎక్కువ నీటిని పట్టుకెళ్తూనే .. తెలంగాణకు నీళ్లు, ప్రాజెక్టులు ఎందుకు? అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన ప్రాజెక్టులన్నీ అక్రమ ప్రాజెక్టులని, వాటిని అడ్డుకోవాలని కృష్ణా రివర్ బోర్డుకు ఏకంగా 11 పేజీల లేఖ రాసిండా పుణ్యాత్ముడు!
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ అక్రమమేనని, అనుమతులు వచ్చే వరకూ ఆయా ప్రాజెక్టుల పనులను నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. 66ః34 నిష్పత్తిలోనే జలాలను వినియోగించుకుంటామని, శ్రీశైలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేపట్టకుండా తెలంగాణను నిరోధించాలని డిమాండ్ చేసింది. తెలంగాణకు చెందిన దాదాపు 15 ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఫిర్యాదు చేసింది. 21వ బోర్డు మీటింగ్‌లో ఆయా అంశాలను ఎజెండాలో చేర్చి చర్చించాలని 11 పేజీల ప్రతిపాదనలను సమర్పించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కేఆర్ఎంబీ చైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు. ఏపీ రాసిన లేఖలో ప్రధానంగా తెలంగాణ చేపడుతున్న, ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులపై మరోసారి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఆ ప్రాజెక్టులకు అవసరమైన కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేవని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా ప్రాజెక్టుల పనులు నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని బోర్డును డిమాండ్ చేసింది. సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని, అనుమతిచ్చేవరకూ పనులను నిలిపేయాలని కోరింది.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం ద్వారా తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం వల్ల రిజర్వాయర్ నిల్వ వేగంగా తగ్గిపోతున్నదని ఏపీ ఆరోపించింది. సెప్టెంబర్ 21 వరకు తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు పవర్‌హౌస్ ద్వారా 82.75 టీఎంసీల నీటిని విద్యుత్తు ఉత్పత్తి కోసం వినియోగించిందని పేర్కొన్నది. తకువ ఇన్‌ఫ్లో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమ, చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసేలా చూడాలని బోర్డును కోరింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని మరోసారి ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయాలని కోరింది.

అక్టోబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన కేఆర్ఎంబీ 21వ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్‌కుమార్ కాంబోజు ఇరు రాష్ర్టాలకు తాజాగా సమాచారం అందించారు. 2026-27 నీటి సంవత్సరానికి సంబంధించి నీటి వాటాల అంశంపై తొలుత త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గత ఆగస్టులోనే నిర్వహించాలని నిర్ణయించారు. రెండు దఫాలుగా నిర్వహించినా ఇరురాష్ర్టాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌ను అక్టోబర్ 1న నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశానికి సంబంధించి ఏపీ తన ఎజెండా అంశాలను ఇప్పటికే నివేదించింది. తెలంగాణ సర్కార్ ఎజెండా అంశాలను ఖరారు చేసినా బోర్డుకు సమర్పించలేదు. ఇదిలా ఉండగా 1వ తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉన్నందున బోర్డు మీటింగ్‌కు హాజరుకాలేమని, మీటింగ్‌ను వాయిదా వేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ ఇటీవలనే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బోర్డు మీటింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు కేఆర్ఎంబీ వెల్లడించింది. త్వరలోనే సమావేశ తేదీని ఖరారుచేస్తామని ఇరు రాష్ర్టాలకు తెలిపింది.
2026-27 నీటి సంవత్సరంలోనూ కృష్ణా నీటిని ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో పంచాలని బోర్డుకు ఏపీ డిమాండ్ చేసింది. 2024-25, 2025-26 నీటి సంవత్సరాల్లో అదే నిష్పత్తి కొనసాగిందని, అందులో మార్పునకు అంగీకరించబోమని పేర్కొన్నది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 22, 2026 వరకు 83.98 టీఎంసీలను ఏపీ వినియోగించుకున్నదని, తెలంగాణ 66.40 టీఎంసీలను వినియోగించుకున్నదని వెల్లడించింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి రిజర్వాయర్లలో సెప్టెంబర్ 22 నాటికి 90.98 టీఎంసీలు నీరు వినియోగానికి అందుబాటులో ఉన్నదని తెలిపింది. 66:34 నిష్పత్తి ప్రకారం ఇంకా తమకు 68.22 టీఎంసీల వాటా వస్తుందని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ డిమాండ్ చేసింది.
పోలవరం నుంచి కృష్ణాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాల్లో 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన వినియోగించవచ్చనే అంశంపై తెలంగాణ సర్కార్ చేస్తున్న వాదనలను ఏపీ తిరసరించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఏపీకి 32.25 టీఎంసీల కేటాయింపులున్నా, ఆ మేరకు నీరు రావడం లేదని, 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్‌లోని క్రాస్వాల్స్ అందుకు కారణమని పేర్కొన్నది. దీనికి పరిష్కారం చూపాలని కోరింది. ఎడమ కాలువలో నీటి సరఫరా నష్టాలు 15% ఉన్నాయని నిర్ధారించిన కమిటీ నివేదికను ఈ నీటి సంవత్సరం నుంచే అమలు చేయాలని డిమాండ్ చేసింది. నాగార్జునసాగర్ రైట్, లెఫ్ట్ మెయిన్ కెనాల్స్‌లో నీటి ప్రవాహం కొలిచే గేజ్ల్లో వ్యత్యాసాలున్నాయని, ఇరు రాష్ర్టాలు, కేఆర్ఎంబీ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ గేజ్‌లను రీకాలిబ్రేట్ చేయాలని, నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ వైపు దెబ్బతిన్న సీసీ టీవీ వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు, డ్యామ్‌కు సంబంధించిన అన్ని కెమెరాల లైవ్, రికార్డెడ్ ఫుటేజీని వీక్షించే అవకాశమివ్వాలని డిమాండ్ చేసింది. నాగార్జునసాగర్‌పై ఆటోమేటెడ్ వాటర్ లెవల్ రికార్డర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 90 టీఎంసీల వినియోగ ప్రతిపాదనలపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాలకు సంబంధించి 7.15 టీఎంసీల పరిమితికి మించి సాగునీటి పనులను కొనసాగించకుండా చూడాలని డిమాండ్ చేసింది.
కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్‌కు 25 టీఎంసీలను కేటాయించగా, దానిని 40 టీఎంసీలకు, ప్రస్తుతం 53 టీఎంసీలకు తెలంగాణ పెంచుకున్నదని ఆక్రోశం వెళ్లగక్కింది. ఆ కేటాయింపులను రద్దు చేయాలని, అదనంగా పెంచిన 28 టీఎంసీలను నూతన కాంపోనెంట్గా పరిగణించాలని, గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.

అచ్చంపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా 2.5 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతిచ్చేవరకూ పనులను నిలిపివేయాలని కోరింది.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
వైరా నదిపై మధిర ప్రాంతంలో నిర్మించతలపెట్టిన జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌ను కొత్త ప్రాజెక్టుగా పరిగణించాలని డిమాండ్ చేసింది.
నెట్టంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2.45 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు, గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు విస్తరించే ప్రతిపాదనలను కూడా ప్రశ్నించింది.
పులిచింతల రిజర్వాయర్ నుంచి, దాని దిగువ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రతిపాదించిన 5 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలని ఏపీ డిమాండ్ చేసింది. రాజీవ్‌గాంధీ లిఫ్ట్, బుగ్గమాధారం, జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, బెట్టెతండా, నక్కగూడెం, ముక్త్యాల లిఫ్ట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం జీవో-34 ద్వారా నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో 16 పథకాలను చేపట్టిందని, వాటిని కొత్త ప్రాజెక్టులుగా పరిగణించాలని ఏపీ పేరొన్నది.
మున్నేరు-పాలేరు లింక్ ద్వారా మున్నేరు వరద నీటిలో 50 టీఎంసీలను పాలేరుకు మళ్లించే ప్రతిపాదనలను అనుమతులు వచ్చే వరకు నిలిపివేయాలని కోరింది.