Trainee IPS : మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణుల ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. హైదరాబాద్‌లోని రెండు అడ్రస్‌ల్లోనూ ఆయన కనిపించలేదు. గత 2 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. చివరకు ఆయన పరారీలో ఉన్నారని నిర్ధారించుకున్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు.
హైదరాబాద్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. హైదరాబాద్‌లోని రెండు అడ్రస్‌ల్లోనూ ఆయన కనిపించకపోవడంతో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
పరారీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి
లైంగిక వేధింపులకు గురిచేశాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు
ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లోని రెండు అడ్రస్‌ల్లోనూ కనిపించని ఉదయ్… https://t.co/XnlNo6Ts3F pic.twitter.com/d8Raib8UiL
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2026
‘మేమిద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం’ అని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయంలో తనపై ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ అధికారితో ప్రేమలో ఉన్నానని, ఇద్దరం మానసికంగా, శారీరకంగా సన్నిహితంగా ఉన్నామని, సర్వీస్‌లో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కోర్టుకు ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే, తనకు మరో యువతితో సంబంధం ఉందనే అనుమానంతో ఆమె మే నెలలో ఓ ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుందని ఆయన వెల్లడించారు. అనంతరం హైదరాబాద్ అకాడమీకి వచ్చాక తనకు మరో మహిళతో సంబంధం లేదని తెలుసుకుని, ఆమె తన గదికి వచ్చిందని.. తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని కోరగా, అప్పటికే ఆమెకు వివాహం కావడంతో తాను తిరస్కరించానని తెలిపిన హైకోర్టుకు ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు.

అయినా సరే తను వినకుండా తరచూ ఫోన్లు చేయడం, తరచూ తన గదికి రావడం చేసేదని.. ఈ విషయం తెలుసుకున్న ఆమెను భర్త నిలదీయడంతో, తానే ఆమెను వేధిస్తున్నానని భర్తకు చెప్పినట్లు పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఆమె భర్త తనకు ఫోన్ చేసి ప్రశ్నించగా, గతంలో తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించినా నమ్మకపోవడంతో.. ముస్సోరిలో తాము సన్నిహితంగా ఉన్న వీడియోను ఆమె భర్తకు పంపానని, దీంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు..ఈ విషయంలో తనపై పగ పెంచుకుని ఆమె కావాలనే పోలీసులకు తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసిందని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు ఉదయ్ కృష్ణారెడ్డి.