సోమవారం 06 జూలై 2020
Khammam - Apr 30, 2020 , 03:04:00

నీళ్లలో ధాన్యం.. కళ్లలో దైన్యం..

నీళ్లలో ధాన్యం.. కళ్లలో దైన్యం..

ఇల్లెందు రూరల్‌: అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా కల్లాల్లో విక్రయానికి సిద్ధం చేసిన మొక్కజొన్న, వరి, మిర్చి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కోతకొచ్చిన వరి పంట నేలవాలి గింజ రాలిపోయింది. పంట చేతికొచ్చిన దశలో ఇలాంటి విపత్తును చూసిన రైతులు తల్లడిల్లిపోయారు. తడిసిన పంటను ఆరబెట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఏజెన్సీ గ్రామాల్లో చాలా మంది రైతులు పంట చేతికొచ్చిన్పటికీ పొలంలోనే ఆరబెట్టుకుంటూ ఉండిపోయారు. ప్రస్తుతం అవి తడవడం, ఆరబెట్టుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.  

వర్షంతో తడిసిన ధాన్యం, నేలకూలిన బొప్పాయి

కూసుమంచి: మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు బొప్పాయి తోటల్లోని చెట్లు కూలిపోయాయి. మూడు రోజులుగా ఉరుములు, మెరుపులు వస్తుండడంతో వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మండలంలో ఐకేపీ, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కాంటాలు పూర్తయిన రైతులు ఊపిరిపీల్చుకున్నారు. పూర్తికాని వారు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొంత ధాన్యం మాత్రం తడిసిపోయింది. 

కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..

కూసుమంచి రూరల్‌: తమ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చేగొమ్మ సొసైటీ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌ తెలిపారు. 

పొలాల వద్దే ధాన్యం కాంటాలు 

చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, పంట పొలాల్లోనే కాంటాలు వేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం తిప్పనపల్లి, దామరచర్ల గ్రామాల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

ఖమ్మం వ్యవసాయం: అకాల వర్షం వల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్యాన పంటలకు స్వల్ప నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లాలో బలమైన గాలులతో అకాల వర్షం రావడంతో మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో బుధవారం తమ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి కస్తూరి వెంకటేశ్వర్లు తెలిపారు. కల్లూరు మండలం లింగాల, చండ్రుపట్ల గ్రామాల్లో దెబ్బతిన్న మామిడి తోటలను అధికారులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఏన్కూరు మండలం బీఎల్‌ పేట, రేపల్లెవాడ గ్రామాల్లో బొప్పాయి తోటలు నేలకొరగడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 450 ఎకరాల్లో మామిడికి 10  15 శాతం నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అంచనా వేసింది. 18 ఎకరాల్లో బొప్పాయి నేలకొరిగిందన్నారు. పంటల నష్ట తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. ఉద్యాన అధికారులు కే.మీనాక్షి, జీ.సందీప్‌కుమార్‌, జీ.నగేశ్‌, కే.అపర్ణ, విస్తరణ అధికారి ఎం.సాంబశివరావు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  

దమ్మపేటలో అకాల వర్షం..

దమ్మపేట: మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మొక్కజొన్న, వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. దమ్మపేటలోని వెల్డింగ్‌షాపుపై రేకులు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. పెద్ద వృక్షాలు, విద్యుత్‌ స్థంభాలు కూలాయి. వర్షం కురుస్తున్నప్పటికీ నాచారం, నాగుపల్లి, అల్లిపల్లి సరిహద్దు చెక్‌పోస్టులను అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సందర్శించి లాక్‌డౌన్‌ పరిస్థితిని సమీక్షించారు. 


logo