AB Venkateswara Rao | ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ (Central Administrative Tribunal) ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఆయనను రెండోసారి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వేస్తూ.. సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని ఆదేశించింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. సర్వీస్ పరంగా ఆయనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించింది.
సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పినా మరోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడం కిందకే వస్తుందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా పని చేసిన కాలంలో ఆయన అవినీతికి పాల్పడినట్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేసింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డట్లుగా ఆయనపై ఆరోపణలున్నాయి.
సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా 2022లో నియమించింది. మళ్లీ రెండువారాల్లోనే మరోసారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆయన సస్పెండ్‌ను సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ విషయంలో వాదనలు ఇప్పటికే ముగియగా.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన క్యాట్.. తాజాగా తీర్పును వెలువరించింది.