Maharashtra : మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో భార్యను హత్య చేయించిన భర్త బండారం బయటపడింది. భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేసి అడ్డు తొలగించుకోవాలి అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి, కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్ధానా జిల్లాకు చెందిన వృషాలి ప్రకాష్ గవాండే అనే మహిళా టీచర్ ఈ నెల 2న బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించింది. అయితే, ఈ రోడ్డు ప్రమాదంపై వృషాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
దీనిపై ఆమె మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. వృషాలి స్కూటీని ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావించిన ఒక వాహనాన్ని గుర్తించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా షాకింగ్ విషయం చెప్పాడు. ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదని.. కావాలనే చేసిందని తేలింది. అది చేయించింది ఆ మహిళ భర్తే అని మరో విషయం బయటపడింది. ఆమెను చంపేందుకు లక్ష రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్లు అతడు వెల్లడించాడు. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వృషాలికి, ఆమె భర్తకు, అతడి కుటుంబ సభ్యులకు మధ్య కొంతకాలంగా విబేధాలున్నాయి. ఆమెను అతడి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. దీనిపై ఆమె కొంతకాలంక్రితం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
ఇదే సమయంలో భార్య, భర్తలు ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ, ఇటీవలే పెద్దలు వారి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో తిరిగి కలిసుంటున్నారు. కానీ, అప్పటికే భార్యపై పగ పెంచుకున్న భర్త ఆమెను చంపేందుకు, తనపై కేసు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేశాడు. ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించాలని ప్రయత్ని్ంచాడు. ఇందుకోసం తన స్నేహితుడు, మరో వ్యక్తితో కలిసి ప్రణాళిక సిద్ధం చేశారు. వారు ఒక డ్రైవర్‌కు లక్ష రూపాయలు ఇచ్చి, తన భార్యను చంపాలని ఆదేశించారు. దీంతో ఆ డబ్బులు తీసుకున్న డ్రైవర్ ఎవరికీ దొరకకుండా ఆమె బైకును ఢీకొట్టి వెళ్లిపోయాడు. కానీ, విచారణలో దొరికిపోయాడు. దీంతో పోలీసులు అతడితోపాటు భర్తను, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. నగదును స్వాధీనం చేసుకున్నారు.