సిద్దిపేట, ఆగస్టు 6: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంట్‌ను కాటగలుపుతున్నదని, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకు ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా తమకు కరెంట్ సరిగ్గా రావడం లేదని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రాఘవాపూర్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి, సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్ పరిశీలించారు.
లాగ్‌బుక్ రికార్డు ప్రకారం బుధవారం రైతులకు 10.30 గంటలు మాత్ర మే సరఫరా చేసినట్లు రికార్డు అయ్యింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 నుంచి 24 గంటల కరెంటు వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 10 నుంచి12 గంటల కరెంటు మాత్రమే వస్తున్నదని రాఘవపూర్ రైతులు తన దృష్టికి తెచ్చారని హరీశ్‌రావు అన్నారు. ఇస్తున్న కరెంట్లోనూ అంతరాయం జరుగుతోందన్నారు. రాఘవపూర్ సబ్‌స్టేషన్‌లో లాక్ బుక్‌ను పరిశీలిస్తే బుధవారం రాఘవాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో రైతులకు కేవలం 10.30 గంటల మాత్రమే ఇచ్చారని హరీశ్‌రావు అన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి 10గంటలు మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌లో నీళ్లు నింపకపోవడంతో రాఘవపూర్ పెద్దచెరువులో నీళ్లు లేవన్నారు. ఈ ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సాగునీళ్లు లేక ఆందోళన చెందుతున్న రైతులకు కరెంట్ సరిగ్గా సరఫరా లేకపోవడంతో ఇబ్బం ది పడుతున్నట్లు తెలిపారు.
నాణ్యమైన కరెంట్ రాకపోవడంతో ట్రాన్స్ఫాఇర్మర్లు, మోటర్లు కాలిపోతున్నాయని, రైతులకు ఇచ్చే కరెంటు పగటిపూటకే పరిమితం చేశారని, తెల్లవారు జామున రైతులకు కరెంట్ ఇస్తే పంటలకు నీటి పారకం ఎక్కువగా ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వాలని రైతులు సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని, దీనికి సీఎం రేవంత్, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ఉచిత కరెంట్ సరఫరాకు మంగళం పాడిందా, కాంగ్రె స్ సర్కారు సరఫరా చేస్తున్న ఉచిత కరెంటు ఉత్తదేనా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలి
రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని డీడీలు కట్టారని, వారికి ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. రైతులకు విద్యుత్ కనెక్షన్ల కోసం ఏబీ కేబుల్, ఐరన్ ఇన్ప్రాస్ట్రక్చర్, ఇతర మెటీరియల్‌ను ప్రభు త్వం విడుదల చేయడం లేదని హరీశ్‌రావు అన్నా రు. రైతులకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ప్రభుత్వం ఇవ్వడం లేదని, సిద్దిపేట జిల్లాలో వెయ్యి కనెక్షన్ల కోసం రైతులు డబ్బులు కట్టి మెటీరియల్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతులు డీడీలు కట్టి 6, 7నెలలు ఆవుతున్నా మెటీరియల్ విడుదల చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4500 కడితే వెంటనే రైతులకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 10 వేలు కట్టించుకున్నా రైతులకు సకాలంలో కనెక్షన్, మమెటీరియల్ ఇవ్వడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.
సిద్దిపేట విద్యుత్ స్టోర్‌లో ట్రాన్స్ఫార్మర్లు లేవని, ఐరన్ స్ట్రక్చర్, విద్యుత్ మెటీరియల్ ఏమి లేదన్నారు. తక్షణమే విద్యుత్ శాఖ మంత్రి సమీక్ష చేసి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వెంటనే ఇచ్చేలా ఆదేశించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి లేదని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీదేవి చందర్రావు, ఎర్ర యాదయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భాసర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గ్యార యాదగిరి, మాజీ సర్పంచ్ రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు తిరుపతి, శంకర్, గోపీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.