హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ‘కుటుంబం’ అనడానికి నిర్వచనం దేశం, ప్రాంతం, సామాజిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం అలా కాదు. ‘స్వపక్షం, ప్రతిపక్షం’ ఆధారంగా కుటుంబ నిర్వచనాన్ని మార్చేస్తారు. ఇందుకు తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలే ప్రత్యక్ష నిదర్శనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కుటుంబం అంటే ఆ కుటుంబసభ్యులతోపాటు ఇతర బంధుగణాన్ని కూడా కలిపి సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
ఇదే సమయంలో తనకు కావాల్సిన వారు, క్యాబినెట్ మంత్రుల వ్యవహారంలో మాత్రం భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. కేసీఆర్ కుటుంబానికి 440 ఎకరాల భూములు ఉన్నాయంటూ అసెంబ్లీలో లెకలు అంటగట్టడంతో ఈ చర్చ మొదలైంది. కుటుంబసభ్యుల వ్యవహారాలు, ఆస్తులు, కేసుల చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ‘కేసీఆర్ కుటుంబం’ అంటే ఒకలెక్క, మంత్రుల కుటుంబాలంటే మరో లెక్కగా చెప్తూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
ఎవరి కుటుంబాలు వారివే.. అయినా!
ఈ నెల 16న అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల జాబితాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల వివరాలు వెల్లడించడం తీవ్ర దుమారం రేపింది. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులకు తొమ్మిది జిల్లాల్లోని 24 మండలాల్లో గల 31 గ్రామాల్లో సుమారు 440 ఎకరాల భూమి ఉన్నది’ అంటూ సీఎం శాసనసభలో ప్రకటించారు. సిద్దిపేటలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ పేరిట 67.5 ఎకరాలు ఉన్నాయని తెలిపారు.
కేటీఆర్‌కు 49 ఎకరాలు, ఆయన భార్య శైలిమకు 17 ఎకరాలు, కుమారుడు హిమాన్షుకు 43 ఎకరాలున్నట్టు చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు దంపతుల పేరిట 30 ఎకరాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత పేరిట 35 ఎకరాలు, మాజీ ఎంపీ సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు ఉన్నాయంటూ గణాంకాలు వెల్లడించారు. అయితే ఇక్కడే సీఎం ప్రకటనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ బంధువులు, ఇతర కుటుంబసభ్యులను కూడా కలిపి ‘కుటుంబం’గా ముద్ర వేశారంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ కుమార్తె కవితకు ఏనాడో వివాహం జరిగింది. ఆమెకంటూ సొంత కుటుంబం, వారికి సొం త వ్యవహారాలు ఉన్నా యి. మాజీ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ సోదరి కుమారుడు.
ఆయన ప్రత్యేక రాజకీయ ఉనికి కలిగి ఉన్నారు. కేసీఆర్ సడ్డకుని కుమారు డు సంతోష్‌రావు, మరో బంధువైన నవీన్‌రావు తదితరులకు సైతం ఎవరి కుటుంబాలు వారివే. ఎవరికి వారు విడివిడిగా బతుకుతున్నారు. వేర్వేరు జిల్లాల్లో వారి కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయినా వారందరినీ ఒకేగాటన కట్టి, ‘కేసీఆర్ కుటుంబం’ అని ముద్రవేయడం, వారి ఆస్తులన్నింటినీ కలిపి ‘కేసీఆర్ కుటుంబ ఆస్తి’గా ప్రచారం చేయడంపై రాజకీయ పరిశీలకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ దురుద్దేశాన్ని బయటపెట్టిందని రాజకీయ నిపుణులు విమర్శిస్తున్నారు.
పొంగులేటికి అంటని ‘కుటుంబ’ సూత్రం
క్యాబినెట్ మంత్రుల కుటుంబాలపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై, ఆయన కుమారుడు హర్షారెడ్డిపై వచ్చిన భూ కబ్జా, ఇతర అక్రమాల ఆరోపణలే ఇందుకు తాజా ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో దాదాపు రూ.300 కోట్ల విలువైన 20 ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి కుమారుడి అనుచరులు రాత్రివేళల్లో ముఖాలకు మాసు లు ధరించి గోడలను కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చా యి. హైకోర్టు ఉత్తర్వులను చూపించినా పట్టించుకోలేదని బాధితులు పేరొన్నట్టు సమాచారం. హరీశ్‌రావు ఇదే విషయాన్ని అ సెంబ్లీలో ప్రస్తావిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్లో పొంగులేటి సతీమణి, కుమారుడు, సోదరుడు డైరెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు. అయినా తన కుమారుడి వ్యవహారాలతో తనకు సంబంధంలేదని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రభుత్వం మంత్రి మాటలనే పరిగణనలోకి తీసుకుంటున్నదని, నిష్పక్షపాత విచారణకు చొరవ చూప డం లేదని విశ్లేషకులు మండిపడుతున్నారు.
కొండా పదవికి ‘కుటుంబం’ ఎసరు
మాజీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో కూడా ‘కుటుంబం’ తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై, పార్టీ అంతర్గత నిర్ణయాలపై బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. సీఎం సోదరుడికి చెందిన కంపెనీకి తకువ ధరకు భూములు కేటాయించారని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం అయిన తర్వాత రేవంత్‌రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తీవ్ర దుమారం రేగింది. తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ వాదించారు. అయినా పార్టీ, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. చివరికి ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించారు. కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిపై చర్యలు తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం, కుమారుడిపై భూ ఆరోపణలకు సంబంధించి పొంగులేటి విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బండి సంజయ్.. గ్యాంగ్ ఆర్డర్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విషయంలో కుటుంబానికి మరో కొత్త నిర్వచనం వచ్చి చేరింది. ఆయన కూడా పదే పదే ‘కేసీఆర్ కుటుంబం’ అంటూ విమర్శలు గుప్పిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో నమోదైన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో తన పేరును ప్రస్తావించవద్దంటూ బండి సంజయ్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు అనుకూలంగా గ్యాగ్ ఆర్డర్ వెలువడింది.
అంటే.. తన కుమారుడి చర్యలకు తనకు సంబంధం లేదని బండి ఒప్పుకున్నట్టే కదా అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి కొడుకు చర్యలకు తండ్రిని బాధ్యుడిని చేయవద్దన్న నిబంధనను ప్రత్యర్థి పార్టీల విషయంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులందరినీ ఒకే గాటన కట్టి విమర్శించడం రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నదని మండిపడుతున్నారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఒక న్యాయం, తమకు కావాల్సిన వాళ్లకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.