ఫీజు బకాయిలను చెల్లించకుండా నిరుపేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఆ తప్పును బీఆర్ఎస్ మీద వేసి తప్పించుకునేందుకు యత్నిస్తున్నది. బకాయిలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనివేనని అసత్య ప్రచారాన్ని చేస్తూ, ఆ నిధులను ఇవ్వబోమంటూ తెగేసి చెబుతున్నది. ఈ ఏడాది నుంచే నిధులను విడుదల చేస్తామంటూ షరతులు విధిస్తూ కాలేజీ యాజమాన్యాలను వేధిస్తున్నది. కానీ వాస్తవమేమంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిలు మొత్తంగా రూ.8820కోట్లుకాగా, అందులో కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలోని బకాయిలే రూ.5529కోట్లు కావడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలు రూ.3092కోట్లు కాగా, అవీ కరోనా సమయంలోనివి మాత్రమే. ఇవీ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వమే వెల్లడించిన గణాంకాలు. దీంతో ఉద్దేశపూర్వకంగానే బకాయిలు చెల్లించకుండా బీఆర్ఎస్పై నెపం మోపుతున్నదని స్పష్టమవుతున్నది. సర్కార్ వ్యవహారం మూలంగా బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు నలిగిపోతున్న దుస్థితి నెలకొన్నది.
– హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. అదేవిధంగా ఉపకారవేతనాలను కూడా చెల్లిస్తున్నది. అయితే కాంగ్రెస్ సర్కార్ ఆ పథకానికి సంబంధించిన నిధుల విడుదలను పూర్తిగా అటకెక్కించింది.
వాస్తవంగా ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లను 3 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా సర్కార్ గతంలో మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దాని ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభంలో 25%, మధ్యలో 50%, చివర్లో మరో25 శాతం చెల్లించాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ఆ విధానానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. 34నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన నిధులను విడుదల చేస్తున్నది. అదీ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీతలతో స్కీమ్‌కు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులను మాత్రం జారీ చేస్తున్నది. దాదాపు ఆ విధంగా రూ. 2200కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తున్నట్టుగా బీఆర్వోలను జారీ చేసింది. కానీ వాస్తవంగా ఆ నిధుల్లోనూ రూ. 500కోట్లకు మించి కూడా ఆయా శాఖల ఖాతాల్లో జమకాని దుస్థితి నెలకొన్నది. కాలేజీలకు విడుదల చేసిందీ అంతకన్నా లేకుండా పోయింది.
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లకు సంబంధించి బకాయిలు కాంగ్రెస్ హయాంలోనే భారీగా పెరిగిపోయాయి. 2014-15 నుంచి 2025-26వరకు ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో పావు వంతు మాత్రమే విడుదల చేస్తున్నది. వెరసి 34 నెలల కాలంలోనే 5,513.76కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇక ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మరో రూ.2200కోట్లను కూడావిడుదల చేయాల్సి ఉంటుంది. ఆ నిధులను సైతం కలుపుకొంటే కాంగ్రెస్ సర్కారే దాదాపు రూ.8వేలకోట్లకు పైగా నిధులు చెల్లించాల్సి ఉంది. అవన్నీపోగా బకాయిలను ఇప్పట్లో చెల్లించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే తెగేసి చెబుతున్నారు. కేవలం 2026-27 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే నిధులను విడుదల చేస్తామంటూ షరతులను విధిస్తున్నారు. తాజాగా జారీ చేసిన జీవో9లోనూ అదే విషయాన్ని వెల్లడించింది.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల బకాయిలు చెల్లించబోమని ఎప్పుడూ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.4వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలన్నింటినీ కేసీఆర్ సర్కార్ చెల్లించింది. అంతేకాదు 2014-15 నుంచి 2019-2020 విద్యా సంవత్సరం వరకు ఒక్క రూపాయి బకాయి లేకుండా ఎప్పటికప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్లను చెల్లిస్తూ వచ్చింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచే ఫీజుల బకాయిలు పడుతూ వచ్చాయి. అదీ కరోనా మహమ్మారి నేపథ్యంలో జీరో విద్యాసంవత్సరాన్ని ప్రకటించిన కొంత గందరగోళం ఏర్పడింది. నాటి నుంచే ఫీజుల చెల్లింపు కొద్దిగా గాడితప్పింది. అప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి సైతం కేవలం రూ.3077.87కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఆ బకాయిలను చెల్లించబోమంటూ చెబుతుండటం గమనార్హం.
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 14లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతోనే చాలామంది విద్యాభ్యాసానికి ముందుకువస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చేరుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. ఫీజులు చెల్లించనిదే ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదు. అప్పులు చేసి కొందరు ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆ స్థోమత కూడాలేని వారు ఉన్నత విద్యకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు తమ కోర్సులను సైతం పూర్తి చేసుకున్నారు. ఫీజు బకాయిలు ఉండటంతో వాళ్లకు ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యాలు అర్హత సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వచ్చాకే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యే దుస్థితి నెలకొన్నది. ఇటీవల ఇదే విషయమై పలువురు విద్యార్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారంటే ప్రస్తుత పరిస్థితికి దర్పణం
పడుతున్నది.
ఉమ్మడిరాష్ట్రంలో వచ్చిన దాదాపు రూ.4వేల కోట్ల బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది.

