గోడలపై పెయింట్ వేసుకొనే నీకు జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్.. నీ కుటుంబసభ్యుల పేరిట విలువైన భూములు ఉండొచ్చు.. రెండెకరాల ఇంటిలో పుట్టి.. వ్యవసాయాన్ని నమ్ముకున్న కేసీఆర్‌కు వ్యవసాయ భూమి ఉండద్దా?. కేసీఆర్ పుట్టుకతోనే ధనవంతుడు, ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. మరి పెయింటర్ అయిన నీకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పు?
– కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాలని పదే పదే అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వెంటనే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఫామ్‌హౌస్ 67 ఎకరాలేనని ఒప్పుకొన్న నువ్వు మిగతా 933 ఎకరాలను ఏం చేసినవ్? 22-ఏలో పెట్టి కబ్జాపెట్టినవా?’ అని సూటిగా ప్రశ్నించారు. వాటిని చూపితే ప్రభుత్వానికే రాసిస్తామని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితంలో దీనిని మించిన సెల్ఫ్‌గోల్ మరొకటి లేదని దెప్పిపొడిచారు.
‘రేవంత్‌రెడ్డి.. నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పుట్టిన 1954 నుంచి ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు.. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడబెట్టుకున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. ధైర్యముంటే వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. విచారణలో తాము తప్పుచేసినట్టు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.
గురువారం తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినోత్సవాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి పవిత్రమైన రోజున అసెంబ్లీలో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు.

Ktr
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నదని రేవంత్‌రెడ్డి వెయ్యి సార్లు కంపునోరుతో అబద్ధాలు చెప్పిండు. మళ్లీ నిన్న ఆయనే అసెంబ్లీ సాక్షిగా ఫామ్‌హౌస్ 67 ఎకరాలేనని ఒప్పుకొన్నడు. అయినా ఎన్నికల అఫిడవిట్లోనే కేసీఆరే పెట్టిండు, నువ్వు కొత్తగా కనిపెట్టిందేమీలేదు. స్వయంగా రైతు అయిన కేసీఆర్ చట్టప్రకారం భూమిని కొన్నడు. ఆయన భూమిని దేవతలా కొలుస్తరు.. మంది కొంపలు ముంచిన నీలెక్క ఆటవస్తువులా చూడరు.
– కేటీఆర్
గ్యారెంటీల కోసం గల్లా పడతాం..
సీఎం రేవంత్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అయితే అసెంబ్లీని నెల రోజులు నడుపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ముందు బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయ్.. నీ కండ్లల్లోకి చూడటం కాదు.. గ్యారెంటీల కోసం గల్లాపడ్తాం’ అని హెచ్చరించారు. వెయ్యి రోజుల విఫల పాలన, 22-ఏపై నిలదీస్తామని భయపడి బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. రైతుబీమా, రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులు.. ప్రతినెలా మహాలక్ష్మి కింద రూ.2,500 ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న ఆడబిడ్డలు.. రూ.18వేల వేతనం ఎప్పుడిస్తరని అడుగుతున్న అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు.. 4వేల పింఛన్ ఖాతాలో ఎప్పుడేస్తరని ఆశగా ఎదురుచూస్తున్న అవ్వాతాతల తరఫున బరాబర్ బరిగీసి కొట్లాడుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
రేవంత్ తీరుతో సీఎం పదవికి కళంకం
సీఎం రేవంత్‌రెడ్డి పవిత్రమైన శాసనసభను భయంకరంగా దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి పదవికే తీవ్ర కళంకం తెస్తున్నారని కేటీఆర్ నిప్పులుచెరిగారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్‌ను అనుకరించేందుకు నాలుగు పద్యాలు, కొటేషన్లు, పెద్దల పేర్లు చెబితే గొప్ప నేత కావాలని శ్రీశ్రీ పేరును ప్రస్తావించారు తప్ప.. ఆ మహాకవి పూర్తి పేరు రేవంత్‌రెడ్డికి తెలియదంటూ చురకలంటించారు. సభాముఖంగా తన తెలివితక్కువ తనాన్ని మరోసారి నిరూపించుకున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్ అజ్ఞాన ప్రదర్శన సమయంలో తాము సభలో లేకపోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెణుకులు విసిరారు. అనుకోకుండా జాక్‌పాట్ తగిలినట్టు పదవులు వస్తే వ్యవస్థలు ఇలాగే తయారవుతాయని విమర్శించారు.
నాడు అభాండాలు.. నేడు అబద్ధాలు
రూ.80వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కేసీఆర్‌పై అభాండాలు వేసిన రేవంత్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అదే అబద్ధాల వరద పారిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు ఢిల్లీ నుంచి ఆర్టిస్టులు, టూరిస్టులను రప్పించి నాటకాలతో ప్రజలను బురిడీ కొట్టించి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి నేడు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల గడువు ముగుస్తుందని అనివార్యంగా అసెంబ్లీ నిర్వహించిన ప్రభుత్వం, ప్రజాసమస్యలపై చర్చ జరుగుతుందని ఆశించిన అన్ని వర్గాలను ఘోరంగా వంచించిందని విరుచుకుపడ్డారు. ప్రజలకు జవాబు చెప్పలేకే అసెంబ్లీ నుంచి పారిపోయిందని ఆరోపించారు.
కార్మికులకు ఇచ్చిన భూములు కబ్జాగా చిత్రీకరణ
సిరిసిల్లలో నిరుపేద కార్మికులకు దశాబ్దాల కిందట ఇచ్చిన భూములను కబ్జాగా చిత్రీకరించడం దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్ల ఒకనాటి రాయిని చెరువు భూముల్లో విస్తరించి ఉన్నదని, కమ్యూనిస్టుల కాలంలో చెరువు ఎండిపోయినప్పుడు సీహెచ్ రాజేశ్వర్‌రావు, ఇతర నేతలు పేద కార్మికులకు 60, 70 గజాల చొప్పున ప్లాట్లు చేసి పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 58, 59 కింద ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చిందని స్పష్టంచేశారు.
కానీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కబ్జా భూములుగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిరిసిల్ల పక్కనే ఉన్న పెద్దూరు, సర్ధాపూర్, బాబాజీనగర్, జగ్గారావుపల్లిలో రికార్డుల ప్రకారం 90శాతం ప్రభుత్వ భూములేనని తెలిపారు. పట్టణం విస్తరించిన పరిస్థితుల్లో ప్రజలు ఇండ్లు కట్టుకున్నారని, అక్కడి భూములు సాగుచేసుకుంటున్నారని, వాటన్నింటీని కబ్జాలని ముద్రవేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వీర్నపల్లి మండలం రంగంపేటలో గిరిజన రైతులకు బీఆర్ఎస్ సర్కార్ పోడు పట్టాలిస్తే, కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారంతో సీఎం అసెంబ్లీలో మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శమని తూర్పారబట్టారు.
సర్వే నంబర్లతో శ్వేతపత్రం విడుదల చెయ్..
మిడిమిడి జ్ఞానంతో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని కేటీఆర్ దుయ్యబట్టారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క గజం కూడా కొనలేదని, తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వస్తానని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే సిరిసిల్లలో 8వేల ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ సర్వే నంబరో, ఏ ఊరో, ఎవరు కబ్జా చేశారో సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. లేదంటే తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త అనిల్‌రెడ్డిని వేధించారని, ఆయన దొరుకలేదని గుండెజబ్బుతో బాధపడుతున్న ఆయన బాబాయ్ రాజిరెడ్డిని 14 రోజులు జైలులో పెట్టారు. అలాగే మాజీ నక్సలైట్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బలహీన వర్గానికి చెందిన తోట ఆగయ్యకు 1999లో సరెండర్ అయిన తర్వాత 2000లో ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చిన 3.5 ఎకరాల భూమిని రేవంత్ సర్కార్ కక్షపూరితంగా గుంజుకున్నది. 2007లో కాంగ్రెస్ హయాంలో డాక్యుమెంట్ నంబర్ 7289 ద్వారా మా పార్టీ నేత బొల్లి రామ్మోహన్ కొనుగోలు చేసిన భూమిని కూడా కబ్జా అని చెబుతున్నారు’ అంటూ దుయ్యబట్టారు.
30శాతం కమీషన్ల కోసమే 22-ఏ
ప్రజాసమస్యలను గాలికొదిలిన సీఎం రేవంత్‌రెడ్డి 30శాతం కమీషన్లు దండుకొనేందుకే 22-ఏ పేరుతో దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కోటి ఎకరాల నిషేధిత భూముల్లో 30లక్షల ఎకరాలు ప్రైవేట్ భూములేనని సీఎం ఒప్పుకొన్నారని చెప్పారు. ప్రభుత్వం తప్పుచేసి సామాన్యులను తమ ఆస్తులుగా నిరూపించుకోవాలని చెప్పడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దీనివెనుక వసూళ్ల దందా దాగి ఉన్నదని ఆరోపించారు.
జూబ్లీహిల్స్‌లోని తన ప్యాలెస్ 22-ఏలో పెడితే రాత్రికిరాత్రే తొలగించుకున్న రేవంత్‌రెడ్డి, సామాన్యుల భూములు ఎందుకు తీసేయడం లేదు? సీఎంకు, ప్రజలకు వేర్వేరు చట్టాలు ఉంటాయా? అని నిలదీశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్లలో చట్టబద్ధంగా చూపిన ఆస్తులపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లిలో 106 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడి ఎకో పార్కుగా మార్చిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
దళితులపై ప్రేమను చేతల్లో చూపండి
అసెంబ్లీలో సీఎం దళితులపై ఒలకబోసిన ప్రేమను చూస్తే స్పీకర్నో, డిప్యూటీ సీఎంనో సీఎం చేస్తారని అనుకున్నామని కేటీఆర్ చమత్కరించారు. కానీ మూడేండ్ల పాలనలో ఉద్ధరించిందేమీలేదని దుయ్యబట్టారు. ఎన్నికల హామీ మేరకు దళితబంధు కింద రూ.12 లక్షలు ఇచ్చి చేతల్లో చూపాలని సవాల్ విసిరారు. ‘బీసీల ఆత్మగౌరవ భవనానికి కోకాపేటలో ఎకరాకు రూ.200 కోట్ల విలువ చేసే 75 ఎకరాల రూ.15వేల కోట్ల విలువైన భూమిని కేటాయించారు.. కానీ రేవంత్ ప్రభుత్వం వారికి ఒక్క గజమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ భూమిని బడుగుల ఆత్మగౌరవానికి చిహ్నంగా చూస్తే రేవంత్ మాత్రం వ్యాపార వస్తువుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేండ్ల క్రితం సెప్టెంబర్ 17న కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచారని గుర్తుచేశారు. బంజారాహిల్స్‌లో రూ.400 కోట్ల విలువైన రెండెకరాల్లో బంజారా, కుమ్రం భీమ్ భవనాలను అద్భుతంగా నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు.
కేసీఆర్‌ను ఎదుర్కోలేకే చిల్లర మాటలు..
కేసీఆర్‌ను ఎదుర్కోవడం చేతగాక కాంగ్రెస్ నాయకులు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘1954లో కేసీఆర్ పుట్టినప్పుడే చింతమడకలో వారి కుటుంబానికి రెండెకరాల ఇల్లు ఉన్నది. ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. నిజాంకాలంలో అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ కింద భూమి పోతే వచ్చిన పరిహారంతోనే ప్రస్తుత భూమిని కొనుగోలు చేశారు’ అని స్పష్టంచేశారు. వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబంలో జన్మించి, 72 ఏళ్ల వయస్సులో 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటే ఆయన ఆస్తులు పెరిగినట్టా? తగినట్టా? అని సూటిగా ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా చింతమడకలో కేసీఆర్ స్వయంగా ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.
జన్మభూమి స్కీమ్‌లో భాగంగా తన రెండెకరాల ఇంటిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ను ఆయన తండ్రి పీజీ వరకు చదివించారు.. మమ్మల్ని కేసీఆర్ ఉన్నత చదువులు చదివించారు.. నేను జేఎన్‌యూ ఎంట్రెన్స్ రాసి, పీజీ చేసి, జీమ్యాట్ ఉత్తీర్ణత సాధించి అమెరికాకు వెళ్లి ఏంబీఏ చదివి, అక్కడే ఆరున్నరేళ్లు జాబ్ చేసి కష్టపడి సంపాదించా’ అని స్పష్టంచేశారు. ఏనాడు రేవంత్‌రెడ్డి లాగా చిల్లర బతుకులు బతకలేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌రెడ్డి 1983లో ఎస్సెస్సీ, 1985 ఇంటర్ పూర్తిచేశారు.. 1992లో డిగ్రీ చదివారు.. ఆయన డిగ్రీ చేసేందుకు ఏడేండ్లు పట్టిందని, పునాది గట్టిగా ఉండేందుకు ఏడేండ్లు తీసుకున్నట్టున్నారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సంపాదించే ట్రిక్కేంటో యువతకు చెప్పు?
వనపర్తిలో గోడలపై రాతలు రాసే స్థాయి నుంచి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్‌లు కట్టుకొనే స్థాయికి ఎలా ఎదిగారో.. వేల కోట్లు ఎలా సంపాదించారో ఆ ట్రికు నిరుద్యోగ యువతకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లెలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఎందు కు ఆత్మహత్య చేసుకున్నారో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయని చెప్పారు. సీఎం కుటుంబసభ్యులు ఉన్నట్టుండి ఏరోస్పేస్ కంపెనీలు పెట్టడం వెనుక ఉన్న అంతరిక్ష రహస్యమేందని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి నువ్వు నిన్నమొన్నటి దాకా కేఎల్ శ్రీధర్‌రెడ్డి (కేఎల్ఆర్ ఎస్ ఇన్ఫ్రా అధినేత) కార్లలో తిరిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కూకట్‌పల్లికి చెందిన కొండల్రావు వంటి వారి ఆస్తులన్నింటి నీ కేసీఆర్ ఖాతాలో వేస్తూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లగచర్లలో అల్లుడి కోసం గిరిజనుల భూములు లాకో వడం, సోదరుడికి అక్రమ భూకేటాయింపులు, బావమరిది సృజన్‌రెడ్డికి సింగరేణిలో వేల కోట్ల కాంట్రాక్టులు, వట్టినాగులపల్లి, నాదర్గుల్లో 379 ఎకరాల స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికే ‘ధరణి’ని రద్దు చేసి ‘భూ భారతి’ని తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్ సీఎంగా తిరిగిరావడమే పార్ట్-2
ముఖ్యమంత్రికి సాయంత్రం వేళల్లో వసూళ్ల లెకలు చూసుకోవడం, గల్లా పెట్టెలు సర్దుకోవడం, ఢిల్లీకి మూటలు పంపే పనుల్లో బిజీగా ఉంటారు కానీ తమకు అలాంటి పనులేమీ లేవని కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీ వ్యవహారాల్లో పార్ట్-2 లో ఏముంటుందని విలేకరులు అడుగగా, ‘కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తారు, సీక్వెల్ అదిరిపోతుంది చూసుకోండి‘ అని ధీమాగా చెప్పారు. ఫామ్‌హౌస్ విచారణ కమిటీ గురించి ప్రశ్నించగా, తన తొత్తులతో విచారణ చేయించి, అనుకూల పత్రికల్లో రాయించుకొని శునకానందం పొందడం తప్ప ఇందులో ఏమీ లేదని కొట్టిపారేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు జన్వాడ విషయంలో ఇగో బుల్డోజర్, అగో బుల్డోజర్ అని డైవర్షన్ గేమ్‌లు ఆడుతున్నారు తప్ప మూడేండ్లయినా తేల్చిందేమీ లేదని చెప్పారు.

రాష్ట్రంలో అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి పెద్దరికంగా, సభా మర్యాదలకు లోబడి వ్యవహరించాలని, అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పి శాసనసభను, ప్రజలను తప్పుదోవపట్టించడం దుర్మార్గం. మొన్న అసెంబ్లీలో ఆయన ప్రసంగం తలాతోకా లేకుండా సాగింది. రెండున్నర గంటల పాటు ఏం మాట్లాడారో, ఏం మొత్తుకున్నారో ఎవరికీ అర్థంకాలేదు.
– కేటీఆర్
ఐడెంటిటీ క్రైసిస్‌లో రేవంత్‌రెడ్డి
సొంత పార్టీలోనే రేవంత్‌రెడ్డిని ఎవరూ గుర్తించడం లేదని, పక నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ’ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి’ అని సంబోధించడాన్ని గుర్తుచేస్తూ రేవంత్ ఐడెంటిటీ క్రైసిస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోనో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మంచి సైకాలజిస్ట్‌తో చికిత్స చేయించాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్ల వద్ద కేసీఆర్ కుటుంబ ఆస్తులంటూ బ్యానర్లు కట్టడంపై స్పందిస్తూ, ‘అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉన్నప్పుడు బటన్లు నొకి మా ఆస్తులేవో బయటపెట్టి, శ్వేతపత్రం వేసి చర్యలు తీసుకోవచ్చు కదా‘ అని నిలదీశారు.
అలాగే కేసీఆర్ రెండెకరాల ఇంట్లో పుట్టినప్పటికీ హైదరాబాద్‌లో తమ కుటుంబమంతా కలిసి ఉండటానికి సరైన నివాసం లేక కేసీఆర్ ఎకడో ఫామ్‌హౌస్‌లో,తాను నార్సింగిలో వేర్వేరుగా ఉంటున్నామని, కానీ రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారని నిలదీశారు. మహిళలను గౌరవిస్తామని చెప్పుకునే రేవంత్ రెడ్డి, బంగారు రాఖీలు కట్టించుకుని రెండు రోజుల్లోనే గొంతుకోసే రకమని, అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయించి ఉల్టా 14మంది బీఆర్ఎస్ సభ్యులపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపైస్పందిస్తూ, దున్నుపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తా అన్నట్టున్నదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవం
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, చిరుమల్ల రాకేశ్, పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, కిశోర్‌గౌడ్, సుమిత్రానంద్, కురువ విజయ్ పాల్గొన్నారు.
యూపీఐ లావాదేవీలపై పన్ను ఆలోచన విరమించుకోండి
డిజిటల్ లావాదేవీలు, యూపీఐ లావాదేవీలపై పన్ను విధించే ఆలోచనను విరమించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. దేశంలో యువ పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు ముఖ్యంగా జెన్ జీ, జెన్ ఆల్ఫా తరాలు చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్సింగ్, సొంత ప్రాజెక్టులను సులభంగా నిర్వహించుకొనేందుకు యూపీఐ ఒక ప్రధాన వెన్నెముకగా మారిందని కేటీఆర్ పేరొన్నారు. సరికొత్త ఆలోచనలతో స్వయంఉపాధి పొందుతూ సూక్ష్మ వ్యాపారాలు చేస్తున్న యువతకు యూపీఐ సాంకేతికత ఎంతగానో తోడ్పడుతోందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలపై పన్నులు విధించడం వల్ల ఆర్థిక సమ్మిళితత్వానికి గండిపడుతుందని, మైక్రో ఆంత్రప్రెన్యూర్లు మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గుచూపే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.