హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యంతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నాయకులు ఆర్ శివకుమార్, కొమ్మనబోయిన సైదులుయాదవ్, ఇబ్రహీంలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
గురుకులాల ప్రిన్సిపాళ్ల సలహాలు, సూచనలు తీసుకోకుండానే ఏకపక్షంగా సరుకుల సరఫరా బాధ్యతను నాకాఫ్కు అప్పగించడం ఏందని ప్రశ్నించారు. గురుకులాలకు సరఫరా అయ్యే వస్తువుల్లో గతంలోనే సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణాన్ని తాము బయటపెట్టామని చెప్పారు. ఇప్పుడు విద్యార్థుల ఆహారంలో ఉపయోగించే వస్తువుల సరఫరాలో సుమారు రూ.900కోట్ల విలువైన టెండర్లకు తెరతీశారని మండిపడ్డారు.
గతంలో జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీలు(డీపీసీలు) కలెక్టర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసి విద్యార్థులకు అందించేవారని చెప్పారు. ప్రస్తుతం ఆహార సరఫరా వ్యవస్థను కేంద్రీకృతం చేశారని, ఒకే సరఫరాదారు ద్వారా లక్షలాది మంది గురుకుల విద్యార్థులకు ఆహారం అందించే విధానం తీసుకొస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ సొసైటీస్ ఫెడరేషన్ (నాకాఫ్) అనే సంస్థకు ఈ అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు.
ఆఫ్రికా నుంచి పప్పు గతంలో తాండూరు కందిపప్పు వంటి నాణ్యమైన స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉండేదని, ఇప్పుడు ఆఫ్రికా నుంచి కందిపప్పు తీసుకువస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గతంలోనే మార్ఫెడ్ నాకాఫ్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని తెలిపారు. శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి నాకాఫ్ను నడిపిస్తున్నారని, కమీషన్ల కోసమే రేవంత్‌రెడ్డి సర్కార్ ఇదంతా చేస్తున్నదని ఆరోపించారు. గతంలో బెల్ట్, టై, ఐడీ కార్డు రూ.60లకు లభించే వస్తువులకు ఇప్పుడు రూ.240 వరకు చెల్లిస్తున్నారని విమర్శించారు. రూ.15 వేలకే లభించే బంకర్ బెడ్‌కు ప్రభుత్వం రూ.30 వేలు చెల్లిస్తున్నదని ఆరోపించారు.
ఇక మటన్, చికెన్ సరఫరా అంతంతే
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి విద్యార్థికి వారానికి ఐదు గుడ్లు ఇచ్చేవారని, ప్రస్తుతం మూడు గుడ్లకు మించి ఇవ్వడం లేదని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. గతంలో నెలకు నాలుగుసార్లు చికె న్, రెండుసార్లు మటన్ అందించే విధానం ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు ఆ పరిస్థితి లేదని నిలదీశారు. గురుకులాల వ్యవస్థపై ముగ్గురు సంక్షేమ మంత్రులకు అవగాహన లేదని విమర్శించారు. మం త్రులు సంబంధిత నోట్‌ఫైల్‌తో గన్పార్ వద్దకు వస్తే తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని స్పష్టం చేశారు.