హైదరాబాద్, సెప్టెంబర్ 17 నమస్తే తెలంగాణ): బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరిట పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు కోసమని బహదూర్‌గూడలో రైతుల నుంచి స్వాధీనం చేసుకొన్న దాదాపు 650 ఎకరాల విస్తీర్ణానికి కంచె ఏర్పాటు చేశారని తెలిపారు. అందులోని సుమారు 300 ఎకరాల భూమిని సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ పార్లమెంట్ సభ్యుడు అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు.
పరిహారంగా రైతులకు ప్లాట్లు ఇచ్చే ప్రక్రియలో కూడా భారీగా కమిషన్ల దందాలకు తెరలేపారని, దందాలు చేస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో తనపై సీఎం చేసిన ఆరోపణలను సుధీర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అక్కడ తామెలాంటి భూములు కబ్జా చేయలేదని, అసలు అక్కడి భూములే కొనుగోలు చేయలేదని స్పష్టంచేశారు.
గతంలో తన కుమారుడు అకడ భూమి కొనుగోలుకు ప్రయత్నించగా, ఆ భూములకు సంబంధించి సరైన పత్రాలు (డాక్యుమెంట్లు) లేవని తెలియడంతో వెంటనే ఆ కొనుగోలు ప్రక్రియను విరమించుకున్నామని వివరించారు. ఆ నిరాధార వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనందున తన సీఎం పీఠం ఎకడ కదులుతుందోనన్న భయంతోనే రేవంత్‌రెడ్డి కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతల భూములపై అసత్య ప్రచారానికి తెరలేపారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గతంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల వల్ల జీవోనంబర్ 118 పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సుధీర్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లుతెరిచి పాత జీవో ఆధారంగా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ పరిధిలో రేవంత్‌రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం చేసిన వ్యవహారాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి ఆధారాలతో నిరూపించారని, వాటికి బదులివ్వలేకే సీఎం నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని చెప్పారు.