న్యూఢిల్లీ : టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108) తన బ్యాట్ పవర్‌తో మరోసారి రికార్డులను షేక్ చేసేశాడు. ఖతర్నాక్ ఆటతో ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానం దద్దరిల్లేలా చేశాడు. పిడుగుల్లాంటి షాట్లతో అఫ్గానిస్థాన్ బౌలింగ్‌ను ఊచకోతకోశాడు. బంతి దొరికిందే ఆలస్యం.. బౌండరీ అవతలే దాని గమ్యం అన్నట్టుగా బాదేస్తూ 30 బంతుల్లోనే శతక గర్జన చేశాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఐసీసీ ఫుల్ మెంటర్ టీమ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తూ.. భారత్ తరఫున వేగవంతమైన శతకంతో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను దాటేస్తూ.. అతను సృష్టించిన విధ్వంసంతో గురువారం జరిగిన మూడో, చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అభి ధాటికి తొలుత భారత్ 20 ఓవర్లలో 221/7 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (25) టాప్ స్కోరర్. నితీశ్ రెడ్డి (3/25), రవి బిష్ణోయి (3/26), అక్షర్ (2/9) దెబ్బకొట్టారు. అభిషేక్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శాంసన్‌తో కలిసి అభిషేక్ అద్భుత ఆరంభం అందించాడు. ఎదుర్కొన్న మూడో బంతికి బౌండరీల ఖాతా తెరిచిన అభి.. అజ్మతుల్లా వేసిన రెండో ఓవర్లో రెండు సిక్సర్లు ఓ ఫోర్‌తో జోరందుకున్నాడు. ఆపై మరో పేసర్ ఫారుఖీని వరుసగా 6, 6, 4, 4తో దంచాడు. నబీ వేసిన ఐదో ఓవర్లో శాంసన్, అభిషేక్ అసలు సినిమా చూపెట్టారు. వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టిన సంజూ మూడో బాల్‌కు ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో జద్రాన్ డ్రాప్ చేయగా.. చివరి మూడు బంతులను శర్మ 6, 4,6గా మలచడంతో 29 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్న అభి.. ఆరో ఓవర్లో రషీద్ ఖాన్‌కు రెండు ఫోర్లు, సిక్స్‌తో స్వాగతం పలకడంతో పవర్ ప్లేలోనే భారత స్కోరు వంద దాటింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా అభి విధ్వంసం మారలేదు. మరో స్పిన్నర్ ముజీబ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి 90ల్లోకి వచ్చిన అతను తొమ్మిదో ఓవర్లో మరో సిక్స్ బాది సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెల్మెట్ తీసి మైదానంలో కూర్చుని ధ్యానం చేసిన తన సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి.
రషీద్ బౌలింగ్‌లో ఇంకో సిక్స్ బాదడంతో అభి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపించాడు. కానీ, అదే ఓవర్లో రషీద్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌పై వేసిన తెలివైన గూగ్లీని వెంటాడి పాయింట్ వద్ద గుర్బాజ్‌కు క్యాచ్ ఇవ్వడంతో శర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ముగిసింది. అభి ఉన్నంతసేపు బుల్లెట్ ట్రైన్‌లా దూసుకెళ్లిన భారత స్కోరు బోర్డు ఆ తర్వాత డీలా పడిపోయింది. అఫ్గాన్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వన్‌డౌన్‌లో వచ్చిన వైస్ కెప్టెన్ తిలక్ (2) రనౌటై నిరాశపరిచాడు. నిలకడగా ఆడుతూ వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న శాంసన్‌ను అజ్మతుల్లా 14వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో రషీద్ బౌలింగ్‌లో శివం దూబే (14) 6,4.. కెప్టెన్ శ్రేయస్ (29) సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌కు మళ్లీ జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, 16వ ఓవర్లో రషీద్ పట్టిన అద్భుత క్యాచ్‌కు దూబే డగౌట్ చేరగా.. ఇషాన్ (10), ఆల్‌రౌండర్ నితీశ్ (1) ఫెయిలయ్యారు. చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్న శ్రేయస్ వేగంగా ఆడలేకపోవడంతో 250 ప్లస్ స్కోరు పక్కా అనుకున్న భారత్ 220 మార్కుతోనే సరిపెట్టింది.
భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ జట్టంతా కలిసి అభిషేక్ సాధించిన పరుగులు కూడా చేయలేక చతికిల పడింది. నితీశ్ వేసిన తొలి ఓవర్లో గుర్బాజ్ (15) రెండు ఫోర్లు, జద్రాన్ సిక్స్‌తో ఛేదనను పోటీగానే ఆరంభించిన అఫ్గాన్ ఆ తర్వాత డీలా పడ్డది. నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ అక్షర్ తొలి బంతికే గుర్బాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు ఆఖరి బంతికి సెదిఖుల్లా (1)ను ఔట్ చేసి ఆ జట్టు పతనాన్ని ఆరంభించాడు. ఆ వెంటనే రసూలీ (0)ని బుమ్రా పిన్‌పాయింట్ యార్కర్‌తో బౌల్డ్ చేస్తే.. పోరాడుతున్న జద్రాన్‌ను యశ్ ఠాకూర్ వెనక్కుపంపడంతో పవర్‌ప్లేలోనే 51/4తో అఫ్గాన్ కష్టాల్లో పడింది. కాసేపు క్రీజులో నిలిచిన నూర్ రహ్మన్ (11)ను బిష్ణోయ్ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. ఇక 12వ ఓవర్లో నబీ (8), అజ్మతుల్లా (17), ముజీబ్ (0) ముగ్గురినీ పెవిలియన్ చేర్చిన నితీశ్ అఫ్గాన్ ఆశలు తుంచేశాడు.
అఫ్గాన్‌పై వీరోచిత శతకంతో అభిషేక్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఐసీసీ శాశ్వత సభ్య దేశాలపై అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా (30 బంతుల్లోనే) సెంచరీ చేసిన బ్యాటర్‌గా అతడు రికార్డులకెక్కాడు. గతంలో ఈ ఘనత న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్ (33 బంతుల్లో సౌతాఫ్రికాపై), జింబాబ్వే సారథి సికందర్ రజా (33 బంతుల్లో గాంబియాపై) పేరిట ఉండేది.

ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా సాహిల్ చౌహాన్ (ఈస్టోనియా) ఉన్నాడు. 2024లో అతడు సైప్రస్‌పై 27 బంతుల్లోనే శతకం బాదాడు. తాజా రికార్డుతో అభిషేక్.. భారత్ తరఫున ఈ ఫార్మాట్లో వేగవంతమైన శతకం బాదిన రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 35 బంతుల్లో)ను దాటేశాడు. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా అభిషేక్ (22 బంతుల్లో 76*).. ట్రావిస్ హెడ్ (స్కాట్లాండ్పై 73*) రికార్డును బ్రేక్ చేశాడు.
100 పవర్ ప్లేలో భారత్‌కు ఇదే బెస్ట్ స్కోరు. గతంలో ఇంగ్లండ్‌పై 95/1 చేసింది.
53 టీ20ల్లో భారత్ 200+ స్కోరు చేయడం ఇది 53వ సారి. సౌతాఫ్రికా (31) రెండో స్థానంలో ఉంది.
10 ఐపీఎల్ సహా టీ20ల్లో అత్యధికంగా పది శతకాలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ (205 ఇన్నింగ్స్‌ల్లో ).. విరాట్ కోహ్లీ (413 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును సమం చేశాడు.
భారత్: 20 ఓవర్లలో 221/7 (అభిషేక్ 108, శాంసన్ 50, అజ్మతుల్లా 2/27)
అఫ్గానిస్థాన్: 14.1 ఓవర్లలో 94 ఆలౌట్ (జద్రాన్ 25, నితీశ్ 3/25, బిష్ణోయ్ 3/26)