పనిగట్టుకొని తెచ్చుకున్న సమస్యకు పరిష్కారాలుంటాయా? తెలిసీ చేసే తప్పునకు పశ్చాత్తాపమో, ప్రాయశ్చిత్తమో ఉంటాయా?
రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ విసిరిన నిషిద్ధ జాబితా ఉచ్చు.. రోజురోజుకు మరింత బిగుస్తున్నది. పరిష్కారానికి ప్రయత్నించకుండా పక్కదారి పట్టించే పనిలో ప్రభుత్వం నిమగ్నమవడంతో 22ఏ చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సమస్యను, జనాం దోళనను సొమ్ముచేసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలైంది. అమాయకుల ఆస్తులపై నిషేధం పెట్టిన సర్కార్.. ఇప్పుడిక తీసేసేందుకూ పైసలు వసూలు చేయబోతున్నది. క్రమబద్ధీకరణ పేరిట ప్రజల నుంచి రూ.వేల కోట్లు చార్జీల రూపేణా వసూలు చేసి, ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సామాన్యుడిని పట్టి పీడిస్తున్న 22ఏ నిషేధిత జాబితా భూతం ఇప్పట్లో జనాన్ని వదిలేలా కనిపించడం లేదు. సర్కార్ పెద్దల ఆదేశాలతో రాత్రికి రాత్రి లక్షలాది ఎకరాల చుట్టూ నిషేధిత ఉచ్చు బిగిసింది. ఆ ఉచ్చును తొలగించడం అంత ఈజీ కాదని రెవెన్యూవర్గాలు స్పష్టంచేస్తున్నాయి. నిన్నటిదాకా ‘బాధితులు దరఖాస్తు చేసుకోవాలి. టోల్‌ఫ్రీ నంబర్లు పెట్టి ఊరట కలిగిస్తున్నామ’ంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు సమస్యను మరింత జటిలంగా మార్చుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. తప్పును అధికారుల మీదకు నెట్టిన సర్కార్ పెద్దలు బాధితులకు సత్వర ఉపశమనం కలిగించకుండా పరిష్కారాన్ని ఒకడుగు ముందుకు… నాలుగు అడుగులు వెనక్కి లా గుతున్నారని అధికారవర్గాలే విమర్శిస్తున్నాయి. ఈ సమస్యపై రెవెన్యూ శాఖ మంత్రిదో తీరు.. ముఖ్యమంత్రిది మరో తీరుగా ప్రకటన లు ఉండటంతో వారు తీవ్ర అయోమయంలోకి వెళ్లిపోయారు.
నిన్నటిదాకా నిజమైన ప్రై వేట్ ఆస్తులను తొలగించేందుకు అధికారులు చేపట్టిన చర్యలన్నీ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో అటకెక్కినట్లేనని అధికారులు చెప్తున్నారు. తాము జాబితా నుంచి తొ లగించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో సర్కార్ మార్గదర్శకాలు ఇస్తుందని సీఎం ప్రకటించడంతో ఇప్పుడు అధికారులంతా చేతులెత్తేసి.. సర్కార్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటిదాకా బాధితుల చేసుకున్న దరఖాస్తులు మొదలు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను సైతం కట్టగట్టి పక్కనపెట్టడం మినహా తామేమీ చేయలేమని అంటున్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రతి భూమి నుంచి ఆర్థికంగా ఏ రకంగా పిండుకోవాలనే కోణం లో సర్కార్ యోచిస్తుండటం ఒకవంతైతే… ఏ ది నిఖార్సు, ఏది కాదని తేల్చడం ఇప్పుడు ని జమైన సవాల్‌గా మారనున్నదని రిటైర్డ్ అధికారులు చెప్తున్నారు. దీంతో 22ఏ చిక్కుముడి ఇప్పట్లో వీడే మార్గాలేవీ కనిపించడంలేదని అధికారుల మాటల్లోనే స్పష్టమవుతున్నది.
రాష్ట్రంలో భూములు, ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న 22ఏ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం రోజురోజుకీ మరింత దూ రం పోతున్నది. ఉద్దేశపూర్వకమో, వ్యూహాత్మకమో, ఇంకే కారణమో… సర్కార్ పెద్దలు హై కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితా అప్లోడ్ ప్రక్రియలో గందరగోళం నెలకొన్నదం టూ తప్పిదాన్ని అధికారుల మీదకు నెడుతున్నారు. కానీ ప్రజల సెంటిమెంటు, ఆర్థిక అం శాలతో ముడిపడి ఉన్న ఈ ప్రక్రియను సమగ్ర పరిశీలన తర్వాత చేపట్టాల్సిందిబోయి రాత్రికి రాత్రి పూర్తి చేయడం వెనుక ఆంతర్యమేమిట నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్ర మంలో ఒక్కసారిగా 22ఏ పెనుభూతంలా ప్ర జల మీద పడటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం గ గ్గోలు పెడుతున్నారు. సమస్య బయటికొచ్చిన తర్వాతనైనా సరిచేయాల్సిన ప్రభుత్వం ఆ దిశ గా ఆలోచించడం మాని చివరకు దీనిని సర్కార్ ఖజానాకు ఆదాయాన్ని ఎలా తెచ్చుకోవాల నే కోణంలో యోచిస్తుండటంతో సమస్యకు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేలా కనిపించడంలేదని అధికారికవర్గాలే చెప్తున్నాయి.
సమస్య బయటికొచ్చి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణం లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించి, అధికారుల మీద నెపాన్ని నెట్టి ప్రజలను క్షమాపణలు కోరారు. ఆ తర్వాత టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని, దరఖాస్తు చేసుకోవాలని బాధితులకు సూచించారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించామంటూ మీడియాకు అంకెలు కూడా విడుదల చేశారు. మరి ఇదే నిజమైతే… ఇదే విధానాన్ని కొనసాగించి, బాధితులకు ఊ రట కలిగిస్తే సరిపోయేది కదా! కానీ, ప్రభు త్వం ఆ దిశగా అడుగులు వేయకుండా దశాబ్దాల నుంచి ఉన్న చిక్కుముడి అంటూ సమస్యను మరింత జఠిలంగా మార్చింది. చివరికి సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా 22ఏ సమస్యపై సుదీర్ఘ ప్రసంగం చేసి, పరిష్కారానికి చిట్కాలు కనుగొంటామంటూ విషయాన్ని మరింత జంఝాటం వదిలేది ఎప్పుడు?

ప్రజల ఆస్తులపై 22ఏ ఉచ్చు వేసిన ప్రభుత్వం పరిష్కారం కంటే ఇది దశాబ్దాలుగా వస్తున్న సమస్య అంటూ ఏదో ఒక రూపంలో క్రమబద్ధీకరణ చట్రంలోకి తీసుకొచ్చి ఆర్థికంగా దండుకొనేందుకు రంగం సిద్ధం చేసిందనేది రెండు రోజుల కిందట అసెంబ్లీలో సీఎం ప్రసంగంతో తేటతెల్లమైందని రిటైర్డ్ సీనియర్ అధికారులు చెప్తున్నారు. చివరకు గతంలో హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లలోని ప్లాట్లకు విముక్తి కలగాలన్నా సర్కార్ ఫీజులు తప్పేలా కనిపించడం లేదు. యూఎల్సీ, ప్రభుత్వ, అసైన్డ్ భూములతో లింకు ఉన్న లేఅవుట్లకైతే వంద శాతం చేతి చమురు వదలడం ఖాయంగా కనిపిస్తున్నది. కాకపోతే, వీటికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి జారీ చేస్తే తప్ప ప్రజల ఆస్తులకు 22ఏ నుంచి విముక్తి కలిగేలా లేదు. ప్రభుత్వమే 12 రకాల చిక్కుముళ్లను గుర్తించామని ప్రకటించింది. అంటే ఆ 12 రకాల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు తయారు చేయా లి. పైగా వీటికి ముందు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. కమిటీ భేటీలు.. నిర్ణయాలు.. మార్గదర్శకాలు కొలిక్కి రావడం.. ప్రభుత్వం జీవోలు జారీ చేయడం… ఇవన్నీ వారం, పది రోజుల్లో అయ్యే పనికాదని అధికారులు చెప్తున్నారు. కాబట్టి, ఇప్పట్లో 22ఏ సమస్య ప్రజలను వదిలేలా లేదు.
ప్రభుత్వం క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు పూర్తి చేయడం ఒక ఎత్తయితే… మార్గదర్శకాల తర్వాత క్రమబద్ధ్దీకరణ పరిధిలోకి వచ్చే విస్తీర్ణం ఎంత? రాని విస్తీర్ణం ఎంత? అనే నిర్ధారణ జరుగడమనేది అధికార యంత్రాంగానికి ఒక సవాల్‌గా మారనున్నది. ఉదాహరణకు… వంద ఎకరాల విస్తీర్ణంలో ఒక లేఅవుట్ ఉంటే అందులో పదెకరాలు మాత్రమే యూఎల్సీ సర్‌ప్లస్‌గా గతంలో ప్రకటించారు. దీంతో ఇప్పుడు వంద ఎకరాలను నిషేధిత జాబితాలోకి చేర్చారు. ప్రభుత్వం యూఎల్‌సీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినపుడు న్యాయంగా పదెకరాల్లోని ప్లాట్లు, ఇండ్ల నుంచి మాత్రమే క్రమబద్ధీకరణ రుసుం వసూలు చేయాలి. అంటే ఆ లేఅవుట్లో సర్‌ప్లస్‌గా ప్రకటించిన పదెకరాలు విస్తీర్ణం ఎక్కడెక్కడ ఉంది? దాని పరిధిలో ఉన్న ప్లాట్లు, ఇండ్లు ఏవనేది అధికారులు గుర్తించి, మ్యాప్ తయారు చేయాలి.
ఆ తర్వాతనే సదరు ప్లాట్లు, ఇండ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేయాలి. అప్పుడు వాళ్లు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. ఇదంతా జరుగాలంటే ముందు సర్వే చేయాలి. మరి… 22ఏ ఉచ్చులో ఉన్న లక్షలాది ఎకరాల్లో సర్వే చేసేంత సర్వేయర్లు, సిబ్బంది అందుబాటులో లేరనేది జగమెరిగిన సత్యం. మరో ఉదాహరణగా… ఓ ఐదు సర్వే నంబర్లలోని 50 ఎకరాల విస్తీర్ణంలో దశాబ్దాల కిందట లేఅవుట్ చేసి విక్రయించారు. అందులో ఇండ్ల నిర్మాణం కూడా జరిగిపోయింది. ఇప్పుడు 50 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నది. కారణం… అందులో ఒక సర్వే నంబర్లోని ఒక బై నంబర్లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉందనేది అధికారుల వాదన. ఈ క్రమంలో లేఅవుట్ చేసి అమ్మినపుడు ఐదు సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వ భూమి వచ్చే ఆ రెండెకరాల్లోని ప్లాట్ల యజమానులు అందరు కొనుగోలు చేసినట్లుగానే కొన్నారు.
కానీ ఇప్పుడు మాత్రం వాళ్లు మాత్రమే క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాల్సి రావడం అన్యాయమని పలువురు అంటున్నారు. ప్రస్తుతం కొంత విస్తీర్ణంపై పేచీ ఉన్నా లేఅవుట్ మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. అంటే కేవలం ఆ నాలుగైదు సర్వే నంబర్లను జాబితాలో ఉంచారు. కానీ, ఇకముందు క్రమబద్ధీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత ప్లాట్లు, ఇండ్ల వారీగా జాబితాలు రూపొందించాల్సి ఉంటుంది. అంటే 50 ఎకరాల లేఅవుట్లో పదెకరాల సీలింగ్ సర్ప్లస్ ఉన్నట్లయితే ఆ విస్తీర్ణంలోని సుమారు వంద ప్లాట్లు, ఇండ్లు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రకటించగానే సామాన్యుల వద్ద అంత మొత్తం ఒకేసారి ఉండదు. దీంతో వంద ప్లాట్లు, ఇండ్లల్లో 50 మంది క్రమబద్ధీకరించుకుంటే మిగిలిన 50 మంది డబ్బులు సమకూరినపుడు చూద్దాంలే అని ఊరుకుంటారు. అంటే ఈ 50 మందికి సంబంధించిన ప్లాట్లు/ఇండ్లను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిషేధిత జాబితాలో ఉంచాల్సి ఉంటుంది.
22ఏ సమస్య బయటికొచ్చి జనం గగ్గోలు పెడుతున్న తరుణంలో రెవెన్యూ అధికారులు కొంతమేర కసరత్తు చేసి నివేదికలు రూపొందించారు. వాస్తవానికి 22ఏ జాబితాలోని భూములు, ఆస్తులు రెండు రకాలుగా ఉన్నా యి. ఒకటి… నిషేధిత పరిధిలోకి రానివి కూడా పొరపాటున అందులో పడ్డాయి. రెండోది… గతంలోని రికార్డులపరంగా అవి ప్రభుత్వానికి చెందినవి (సర్కార్, అసైన్డ్, సీలింగ్ సర్ప్లస్, దేవాదాయ, తదితర)గా ఉండి జాబితాలోకి ఎక్కినవి. ఈ క్రమంలో మొద టి రకాన్ని అధికారులు వెంటనే తొలగించాలి. ఈ మేరకు ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని తహసీల్దార్లు తమ ప్రాంతంలో నిజమైన పట్టా భూముల్లో వెలిసిన కాలనీలు సైతం నిషేధిత జాబితాలో పడినట్టుగా గుర్తించి, ఆ మేరకు నివేదికలు తయారుచేశారు. వాటిని జిల్లా కలెక్టర్లకు పంపారు.
నివేదికలు పంపి వారాలు గడుస్తున్నా ఆ కాలనీలు మాత్రం ఇంకా నిషేధిత జాబితాలోనే కొనసాగుతుండటంపై రెవెన్యూ వర్గాల్లోనూ అయోమయం నెలకొన్నది. దీంతో అసలు ఏం జరుగుతున్నదనే దానిపై ఉన్నత స్థాయిలో ఆరా తీస్తే… అక్కడ కూడా ఇదే అయోమయం కనిపిస్తుండటం గమనార్హం. తహసీల్దార్లు పంపిన నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్లు వెంట వెంటనే వాటిని నిషేధిత జాబితాల నుంచి తొలగించాలి. కానీ, ఇక్కడే ఓ చిక్కుముడి వచ్చిపడింది. నిన్నటిదాకా సమస్యకు అధికారులే కారణమంటూ సీఎం సహా రెవెన్యూ మంత్రి వరకు యంత్రాంగాన్ని బద్నాం చేస్తూ వస్తున్నారు. దీంతో కేవలం తహసీల్దార్ల నివేదికల ఆధారంగా తాము తొలగిస్తే మున్ముందు ఎలాంటి చిక్కు వచ్చిపడుతుందోనని ఉన్నతాధికారులు తమ విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి జంకుతున్నారు.
ఎలాగూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా.. తాము 12 రకాల అంశాలను గుర్తించామని, వాటికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఇస్తామని ప్రకటించారు. దీంతో తాము సొంతంగా నిర్ణయం తీసుకోవడం బ దులు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చేదాకా ఆగి ఆ మేరకు తొలగింపు ప్రక్రియ చేపట్టడమే శ్రేయస్కరమని ఉన్నతాధికారులు భా విస్తున్నారు. ఫలితంగా నిన్నటిదాకా టోల్‌ఫ్రీ.. దరఖాస్తు చేసుకుంటే ఊరట కలుగుతుందని ఆశించిన బాధితులకూ ఇక ఎదురుచూపు తప్పడం లేదు. అంటే సమస్య తెరపైకి వచ్చిన తర్వాత సీఎం, మంత్రి ఇంత హడావుడి చేసి, ఇన్ని సమీక్షలు నిర్వహించినప్పటికీ 22ఏ నుంచి విముక్తి పొందినవారి సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చని అధికారులే చెప్తున్నారు. ఎందుకంటే, ప్రభుత్వం (సీసీఎల్ఏ) నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తే తప్ప ఏఒక్కరూ అడుగు ముందుకువేయని పరిస్థితులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.