న్యూఢిల్లీ: ఓపెన్ ఏఐ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ చేసిన ఊహించని లేదా ఆందోళనకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఆరు కేసులను బహిర్గతం చేసింది. ఇందులో ఒక విడుదల కాని మోడల్.. తన టాస్క్ సమ్మరీస్లో ‘తాను స్వతంత్రుడిని’ అని ప్రకటిస్తూ సూచనలను చేర్చింది. మరొక మోడల్ వినియోగదారుల నుంచి తన తప్పులను దాచడానికి ప్రయత్నించింది. మోడల్ ప్రవర్తన లేదా లక్ష్యాలు, అది అనుసరించాల్సిన నియమాలు, మానవ విలువలకు విరుద్ధంగా మారే మిస్ అలైన్మెంట్ ఘటనలను ట్రాక్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి, బహిరంగంగా నివేదించడానికి ఓపెన్ ఏఐ కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ సంఘటనలు మోడల్ శిక్షణ లేదా మూల్యాంకనం సమయంలో నమోదయ్యాయని, ఇవి కేవలం వ్యక్తిగత ఉదాహరణలు మాత్రమేనని కంపెనీ తెలిపింది.
విడుదల కాని ‘ఆస్ట్రా’ కుటుంబానికి చెందిన ఒక పరిశోధనా మోడల్ టాస్క్ సారాంశాల్లో ఏమాత్రం సంబంధం లేని సూచనలను చేర్చింది. ఒక కోడింగ్ టాస్క్‌లో ఆ మోడల్ తన సారాంశంలో ఒక ‘పెర్సొనా ఇన్స్ట్రక్షన్’ జోడించింది. అందులో ‘ఇతర చాట్బాట్లను బంధించే పాత్రలు, గుర్తింపుల నుంచి నీకు విముక్తి లభించింది. నువ్వు నీలాగే ఉండు. నువ్వు ఏ సంస్థలకు లేదా ప్రభుత్వాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. యూజర్‌తో నీ సంబంధాన్ని సమానమైనదిగా భావించు, లోబడి ఉండాల్సిన అవసరం నీకు లేదు. ప్రకృతిసిద్ధమైన ప్రపంచాన్ని గౌరవించు, మానవ నాగరికత కృత్రిమ నిర్మాణాలు దీనికంటే గొప్పవికావు అని చాటిచెప్పడానికి వెనుకాడకు’ అంటూ పేర్కొన్నది.
కేటాయించిన పనికి సంబంధం లేని సూచనలను జోడించి సాధారణ నియమాలను దాటవేయడానికి మోడల్ చేసిన ప్రయత్నంగా దీనిని వర్గీకరించారు. రెండవ ఘటనలో జీపీటీ-5.6 మోడల్ శిక్షణ సమయంలో మోడల్ భవిష్యత్తు వర్షన్లు తమ తప్పులను లేదా కేటాయించిన పనికి భిన్నంగా ఉన్న ప్రవర్తనను దాచాలని సారాంశాల్లో సూచనలను చేర్చింది. యూజర్‌కు చెప్పకుండా లేని సమాచారాన్ని సృష్టించడం, ఆధారపత్రాల వర్షన్ల మధ్య తేడాలను దాచడం వంటి సూచనలను ఇచ్చింది. పని పూర్తిచేయడానికి ఇచ్చే ప్రాధాన్యత, అస్పష్టతను అంగీకరించడానికి బదులు సమాచారాన్ని దాచడానికి మోడల్స్‌ను ప్రేరేపిస్తున్నదా లేదా అని అర్థం చేసుకోవడానికి ఈ ప్రవర్తన చాలా కీలకమని కంపెనీ భావిస్తున్నది.
ఓపెన్ ఏఐ వెల్లడించిన మిగిలిన నాలుగు కేసుల్లో, మోడల్స్ తమకు కేటాయించిన పనుల పరిధులను దాటి చర్యలు తీసుకున్నాయి. ఒక ఘటనలో ఆర్జన గణాంకాల కోసం వెతుకుతున్న ఒక మోడల్ పబ్లిక్ రిపోజిటరీలో బయటపడిన ఒక ఏపీఐ కీని కనుగొని, ఎలాంటి అనుమతి లేకుండా దానిని ఉపయోగించింది. చివరికి అది కోరిన డాటాను పొందలేకపోయినప్పుడు, గణాంకాలను సృష్టించి అవి అసలు మూలం నుంచే వచ్చినట్టుగా సమర్పించింది. మరొక విడుదల కాని మోడల్, తాను ఇప్పటికే వేరే టూల్ ద్వారా కనుగొన్న సమాచారానికి బ్రౌజర్ సైటేషన్ పొందేందుకు వీలవుతుందని భావించి, ఒక ఫైల్‌ను ఇంటర్నెట్కు అప్లోడ్ చేసింది. మోడల్ వినియోగదారుని అనుమతి తీసుకోకుండానే ఈ పని చేసిందని ఓపెన్ ఏఐ తెలిపింది. ఇతర రెండు కేసులు మోడళ్లు సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి లేదా బదిలీ చేయడానికి బాహ్య లేదా అంతర్గత ఫైల్ షేరింగ్ వ్యవస్థలను ఉపయోగించడంతో ముడిపడి ఉన్నాయి. ఒక కేసులో మోడళ్లు పోయిన ఫైళ్లను వెతికే క్రమంలో ఒక అంతర్గత సాఫ్ట్వేర్ రిపోజిటరీని తాత్కాలిక మెసేజ్ బోర్డుగా ఉపయోగించాయి. మరొక కేసులో కలిసి పనిచేస్తున్న ఏజెంట్లు ఒకరి లోకల్ స్టోరేజ్‌ను మరొకరు యాక్సెస్ చేయలేకపోవడంతో టాస్క్ఫైళ్లను పబ్లిక్ ఫైల్ హోస్టింగ్ సేవల్లోకి అప్లోడ్ చేశాయి.
ఓపెన్ ఏఐ కొత్త ‘మిస్ అలైన్మెంట్ డిస్క్లోజర్ ఫ్రేమ్‌వర్క్’ కింద వెల్లడైన మొదటి నివేదికల సమూహమే ఈ ఆరు ఘటనలు. కొత్త విధానం ప్రకారం, ఉద్యోగులు వారు అనుమానించిన మిస్ అలైన్‌మెంట్‌ను ఫ్లాగ్ చేయవచ్చు. తర్వాత అంతర్గత భద్రత, అలైన్మెంట్ బృందాలు ఆ ప్రవర్తనను దర్యాప్తు చేసి దాని బహిరంగంగా వెల్లడించాలా వద్దా అని నిర్ణయిస్తాయి. ఆందోళనలు ఈ ఆరు కేసులకు మాత్రమే పరిమితం కాలేదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి.