గాలి మాటల పాలకుడు.. గజకర్ణ గోకర్ణ విద్యల్లో మునిగిండు. నిషేధ జాబితా నిప్పు సెగ తగులుతుంటే దారిమళ్లింపు గారడీలనే నమ్ముకున్నడు. ఎగవేసిన హామీలపై చర్చ జరుగకుండా ఎగదోస్తున్న కుతంత్రాలను చూస్తున్నం. ఎర వేసిన భూదందాలను దాచేందుకు ఏలిక సర్కస్ ఫీట్లను చూస్తున్నం.
కాంగ్రెస్ సర్కార్ పాపాలు, సీఎం ఆపసోపాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్సే కాదు.. ప్రతి రైతూ ఇప్పుడు ఇదే మాట చెప్తున్నడు. మండిపడుతున్నడు. ‘ముఖ్యమంత్రి నోటికి రికాం లేదు. మాటకు విలువలేదు. కేసీఆర్ ఇక్కడ చెరువు తవ్వించిండు. రాళ్లు రప్పలున్న భూమిని పొలాలుగా మలిచిండు. మా భూముల విలువ పెంచిండు. మా ఊరి పరిసరాల దశ మార్చిండు. ఆయనే భూములు గుంజకున్నడని బుద్ధున్నోళ్లెవరైనా అంటరా?’ అని ఎర్రవల్లి రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నరు.
కేసీఆర్ వచ్చినంకనే ఊరిని, పొలాలను బాగుచేసిండు. ఎర్రవల్లికి కేసీఆర్ వచ్చినంక మాకు ఎంతో మంచిగయింది. గుంట భూమి కూడా 325లో కేసీఆర్ తీసుకొలేదు. దళితులతో పాటు బీసీలకు కూడా ఇక్కడ కొంత జాగ ఉన్నది.

మేము కూడా పంటలేసుకొని, జీవాలను మేపుకొని బతుకుతున్నం. పాండురంగ చెరువును మంచిగ చేసి అందులోకి నీళ్లు వచ్చేలా చేసిండు. అక్కడినుంచి పొలాలకు కాలువ గుండా నీళ్లిచ్చి పంటలు పండించుకునేలా చేసింది కేసీఆరే. మాకు మంచి చేసిందే ఆయన.. అలాంటిది ఆయన మా భూములు ఎందుకు తీసుకుంటడు.
సిద్దిపేట, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గజ్వేల్ : ‘కేసీఆర్ సార్ మా దళితుల భూముల జోలికి రాలేదు.. గుంట భూమి కూడా తీసుకోలేదు. రాళ్లూరప్పలతో ఉన్న భూములను ఆయనే చదును చేయించి సాగుభూమిగా మార్చారు. ఆయన వల్లే ఇవాళ ఆ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నాం’ అని ఎర్రవల్లి దళిత రైతులు ముక్తకంఠంతో చెప్పారు. అంతేగాక పాండురంగ చెరువు తవ్వించి, డ్రిప్ ద్వారా ప్రతి గుంట భూమి సాగులోకి వచ్చేలా చేశారని, అలాంటి భూముల వద్ద ఇవాళ ఎవరో వస్తామంటే తామెలా ఊరుకుంటామని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిందంతా పచ్చి అబద్ధమని కొట్టిపారేసిన ఆ రైతులు.. కేసీఆర్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్ సర్కార్ అభాండాలు వేస్తున్నదని ఆరోపించారు.
గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్లో గజ్వేల్ ఆర్డీవో నేతృత్వంలో అధికారుల బృందం సర్వేకు రావడంతో ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొన్నది. కేసీఆర్ నివాసానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో భూములను పరిశీలించేందుకు వెళ్ల్లిన అధికారులను వారు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం సరికాదని మండిపడ్డారు. ‘మేము ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడే సాగు చేసుకుంటున్నాం.. మా భూములు ఎకడికీ పోలేదు. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో అధికారులు ఎందుకు వస్తున్నారు?’ అంటూ అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించారు.
తమ భూముల విషయంలో ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన అవసరం ఉన్నదని.. కేసీఆర్ తమ భూములు లాక్కొన్నారని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎర్రవల్లి రైతులు స్పష్టంచేశారు. తమ తాతలు, తండ్రులు సాగు చేసిన భూముల్లోనే తాము కూడా వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. సాగుకు నోచుకోని భూములను వృద్ధిలోకి తెచ్చిన చేసిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని రైతులు చెప్పారు. భూములను చదును చేయడమే గాక సాగుకు అనువుగా మార్చడంతో తమ కుటుంబాలకు వ్యవసాయం ఆధారంగా మారిందని పేర్కొన్నారు. తమకు జరిగిన మేలు, ప్రస్తుతం సాగు చేసుకుంటున్న భూముల పరిస్థితిని చూస్తేనే వాస్తవం అర్థమవుతుందని చెప్పారు. ‘కేసీఆర్ హయాంలో నీళ్ల కోసం ఒక నమ్మకం ఉండేది. కానీ రెండేండ్ల నుంచి పరిస్థితి మారింది. పంటలు వేసుకోవాలంటే ఎదురుచూడాల్సి వస్తున్నది’ అని వాపోయారు.

ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రం చుట్టూ రాజకీయ వివాదం ముదురుతున్న వేళ అక్కడి భూములతో తమకున్న అనుబంధాన్ని, కేసీఆర్ హయాంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధిని ఆ ప్రాంత దళిత రైతులు గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఎర్రవల్లికి వచ్చిన తర్వాతే తమ జీవితాల్లో వెలుగు వచ్చింది అని గర్వంగా చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి తమ పొలాలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రైతులు తెలిపారు. గతంలో వర్షాలపైనే ఆధారపడి సాగు చేసుకునేవాళ్లమని, ఇప్పుడు నీటి వసతి రావడంతో వ్యవసాయం సులభమైందని చెప్పారు. పాండురంగా చెరువుల నిర్మాణంతో తమకు నీటి వసతి మరింత అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
325 సర్వే నంబర్ విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం సరికాదని రైతులు తెగేసి చెప్పారు. ముందు రికార్డులు చూసి భూముల యజమానులను అడుగాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించాని వారు ముఖ్యమంత్రికి సూచించారు. ఎర్రవెల్లిలోని సర్వే నంబర్ 325లో ఉన్న సుమారు 388 ఎకరాల భూమిలో సుమారు 300 దళిత కుటుంబాలు వివిధ రకాల పంటలను సాగు చేసుకుంటున్నారు. తమ జీవనాధారమైన భూములను ఇతరులకు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ‘మా భూములు మాకు కావాలి. మా పొలాల్లో మేమే సాగు చేసుకుంటాం. వేరే వారికి ఈ భూములు ఇస్తే తిరుగుబాటు తప్పదు’ అని వారు తేల్చిచెప్పారు.

మా భూములు ఎవరికిచ్చినా ఊరుకోం. రాళ్లు, రప్పలున్న భూములను కేసీఆర్ మంచిగ చేసిండు. ఆయన మా భూములు తీసుకున్నడని ఆయన్ను బద్నాం చేసుడు తప్పు. పట్టా భూములు పైసలు పెట్టి 15ఏండ్ల కిందటే కేసీఆర్ కొనుకున్నడు. ఆయన వచ్చి చెరువు బాగు చేసి పంటలు పండాలని కాలువ తవ్వి నీళ్లు ఇచ్చిండు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పంటలకు నీళ్లు కూడా ఇస్తలేదు. మేము పెట్టిన వరి మొత్తం ఎండిపోతాంది. ఈ ప్రభుత్వం మాకు మంచి చేయకున్నా సరే మా భూముల జోలికి రావద్దు. కేసీఆర్ వల్లే మాకు అంతా మంచి జరిగింది. ఆయనపై నిందలు వేయడం తప్పు. మాకు మంచి చేసిన కేసీఆర్ మా భూములు ఎందుకు తీసుకుంటడు. సీఎం చెప్పేదంతా అబద్ధం.
మా భూముల జోలికోస్తే ఊరుకోం.. దేనికైనా సిద్ధం. మా భూములు వేరే వాళ్లకు ఇస్తామంటే మా పిల్లలు, మేము ఎట్ల బతుకాలె. దళితులకు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి అంత ఉంటే.. వేరే దగ్గర ఇచ్చుకోవాలె. మా భూముల జోలికి రావద్దు. మేము ముగ్గురం అన్నదమ్ములం.. ఈ భూమిలోనే పంటలు వేసుకొని పిల్లలతో బతుకుతున్నం. ఈసారి నీళ్లు లేక పంటలకు ఎండిపోతున్నయ్.
ఇక్కడి భూముల్లో మా తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నం. కానీ కేసీఆర్ వచ్చినంకనే బీడుగా ఉన్న భూములకు నీళ్ల సౌలత్ వచ్చింది. అప్పటినుంచి వరి సాగు చేసుకొని బతుకుతున్నం. ఎప్పుడో ఇచ్చిన భూములను రేవంత్‌రెడ్డి వేరేవాళ్లకు పంచుతామంటే మేమెట్ల ఊకుంటం. మా భూములకు కేసీఆర్ భూములకు ఎలాంటి సంబంభం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు ఇంచు జాగ కూడా కేసీఆర్‌కు లేదు. సీఎం చెప్పినవన్ని అబద్ధాలు. కేసీఆర్ మాకు డ్రిప్ ఇచ్చి చెరువులు బాగు చేసి నీళ్లిచ్చిన్రు. మాకు తెల్వకుంట అధికారుల సర్వేకు వచ్చుడేంది?. మళ్లోసారి ఇట్ల చేస్తే ఊకునేది లేదు.
సర్వే నంబర్ 325లోని భూమి యాభై అరవై ఏండ్లుగా మా ఆధీనంలోనే ఉంది. కేసీఆర్ ఎక్కడ కూడా మా భూముల్లోకి రాలేదు. ఆయన రోడ్డుకు అవతల ఉంటే మా భూములు రోడ్డుకు ఇవత ఉన్నాయి. మా భూములు తీసుకొని ఇతరులకు ఇస్తామంటే మా పెళ్లాం పిల్లల ఏమీ కావాలే. మా భూముల మీద మా తెలియకుండా అధికారులు ఎలా సర్వే చేస్తారు. వేరే ఊరు దళితులకు మా భూములు ఇస్తామంటే మేమెట్ల బతకాలి. మా భూములు ఎవరూ గుంజుకోలేదు. మా చిన్నప్పుడు మా తాతలు, తండ్రులు పెసర్లు, బబ్బెర్లు వేశారు. ఇక్కడ రాళ్లు, రప్పలు ఉంటే వాటిని కేసీఆర్ వచ్చినంకనే సారవంతంగా మార్చారు.