హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మీనాక్షీ నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కో రుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. కంభం శివకుమార్‌రెడ్డి కేసులో బాధితురాలైన శ్రీలత తాజాగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
మీనాక్షిపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లకుండా ఆమె పాస్‌పోర్ట్‌ను తక్షణమే జప్తు చేయాలని శ్రీలత కోర్టును అభ్యర్థించారు. శ్రీలత పెట్టిన కేసు వివరాలు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించని కారణంగానే గత జూన్‌లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి మీనాక్షీనటరాజన్ దాఖలుచేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇప్పటికే మీనాక్షికి ఎంపీ పదవి దకకుండా పోగా, ఇప్పుడు విదేశీ పర్యటన విషయంలో దాఖలైన పిటిషన్ ఎలాంటి చిక్కులు తెస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.