ఎల్లారెడ్డి, ఆగస్టు 6: హామీల ఎగవేతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకీర్తిని మూట గట్టుకున్నది. ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అధికార పార్టీ అందరికీ రిక్త‘హస్తం’ చూపుతున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఉద్యోగులే కాదు, చివరకు వృద్ధులనూ రేవంత్ సర్కారు మోసగించింది. అధికారంలోకి రాగానే అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత విస్మరించింది. అంతేకాదు, రూ.2 వేలు ఇస్తున్న పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని ప్రగల్బాలు పలికింది. ఇప్పుడా హామీని అటకెక్కించింది. కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే, వాటిలో వృద్ధాప్య పెన్షన్లను పక్కన పెట్టినట్లు తెలిసింది. చేయూత పథకంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల నుంచి వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతులు, చేనేత, గీత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సెల్, ఎనిమియా బాధితుల వివరాలను మాత్రమే అధికారులు పరిశీలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
నిర్దేశిత వయస్సు పెంచిన ప్రభుత్వం..
అందరికీ అండగా నిలబడాలనే ఉద్దేశంతో అప్పట్లో కేసీఆర్ భావించారు. వృద్ధాప్య పెన్షన్‌కు అర్హత వయస్సును 57 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే, కాంగ్రెస్ వచ్చాక పండుటాకులకు వెన్నుపోటు పొడుస్తూ అర్హత వయస్సును పెంచింది. 57 సంవత్సరాలుగా ఉన్న వయస్సును ఏకంగా 8 ఏండ్లకు అంటే 65 సంవత్సరాలకు పెంచేసింది. దీంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య చాలా వరకు తగ్గి పోయింది. రేవంత్ సర్కారు నిర్ణయంపై వృద్ధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, 65 సంవత్సరాలు దాటిన వారు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇంకా పింఛన్లు ఇవ్వకపోవడం ఏమిటని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం హామీలిచ్చిన కాంగ్రెస్ నాయకులు అమలులో మాత్రం చొరవ చూపడం లేదని విమర్శిస్తున్నారు.
25 వేల వరకు పెండింగ్‌లోనే..
కామారెడ్డి జిల్లాలో వృద్ధాప్య పింఛన్ల కోసం 25 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. చేయూత పెన్షన్ల కోసం 42 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 25 వేల వరకు వృద్ధాప్య పెన్షన్ల కోసమేనని అంచనా. పింఛన్ల మంజూరుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం జిల్లా స్థాయి అధికారులు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం వృద్ధాప్యం కాకుండా మిగతా పెన్షన్ల గురించి మాత్రమే వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్ల మంజూరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అండగా నిలిచిన కేసీఆర్..మలి సంధ్యలో ఉన్న వారికి తెలంగాణ తొలి
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కొడుకుగా మారారు. వృద్ధులకు ఇచ్చే మొత్తాన్ని రూ.2 వేలు చేసిన కేసీఆర్.. కొత్త పెన్షన్లు ఇచ్చి ఎంతో మందికి ‘ఆసరా’గా నిలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 2022లో 17 వేల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పండుటాకులకు మొండి‘చేయి’ చూపింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు సమీపిస్తున్నా ఇప్పటిదాకా కొత్తగా వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయలేదు. కొద్ది నెలలుగా ప్రజా పాలన కార్యక్రమంలో, ప్రజా వాణిలో వేలాది మంది పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నా, వాటిపై కదలిక లేదు.
70 ఏండ్లున్నాయ్.. ఇంకెప్పుడు ఇస్తరు?
సర్కారు చెబుతున్నట్లు నాకు ఎప్పుడో పించిన్ రావాలే. ఇప్పటికీ ఇత్తలేరు. 70 ఏండ్లు ఉంటాయ్ నాకు. నాకంటే ఇరవై ఏండ్లు తక్కున్నోళ్లకు అత్తున్నది. నాకు మాత్రం అత్తలేదు. మీటింగ్ అయినప్పుడల్లా దరఖాస్తు ఇచ్చిన. ఎలచ్చన్లప్పుడు పక్కా ఇస్తమని అంటే ఓటు వేసిన. ఎలచ్చన్లు అయిపోయినంక ఇగ ఇటు ముఖం చూపిస్తలేరు. ఏ అధికారి వచ్చినా పించిన్ గురించి అడుగుతున్న. వోళ్లు కూడా కనికరిస్తలే.
– చాకలి విఠల్, రైతు, తిమ్మారెడ్డి
మంజూరీ కాలే..
నాకు 66 ఏండ్లు. కాంగ్రెస్ సర్కారు పెట్టిన నిబంధనల ప్రకారం నాకు పించిన్ రావాలె. కానీ ఇంకా అత్తలేదు. పించిన్ కోసం ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇచ్చిన. ఇంకా మంజూరీ కాలేదంటుండ్రు. ఎప్పుడు వస్తదో తెలుస్తలేదు. మా ఊళ్లే నాకంటే చిన్న వాళ్లకు పించిన్ అత్తున్నది. ఇప్పటికైనా నాకు మంజూరు చేసి న్యాయం జేయలే.
– రాంరెడ్డి, రైతు, తిమ్మారెడ్డి