(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పొద్దున లేవగానే పాల ప్యాకెట్ తీసుకురావడం మొదలు రాత్రి బయట డిన్నర్ చేయడం వరకూ ఎలాంటి పేమెంట్స్ అయినా ఫోన్ ద్వారానే చెల్లిస్తున్నాం. ఒక్క రూపాయి నుంచి లక్షల రూపాయల వరకూ యూపీఐ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నాం. దీని కోసం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ తదితర యాప్స్ వాడకం జీవితంలో ఒక భాగంగా మారింది. అయితే, మొన్నటివరకూ ఫ్రీగా జరిగిన ఈ లావాదేవీలు ఇకపై అలా ఉండబోవు. ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన మోదీ సర్కార్.. ఇక చార్జీల వాతకు తెరతీసింది. యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)’ను విధిస్తూ రూపొందించిన యూపీఐ ట్రాన్సాక్షన్ చార్జీల బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. తద్వారా యూపీఐ పేమెంట్స్, రూపే డెబిట్ కార్డు పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేసుకొనే అధికారం బ్యాంకులకు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు (పీఎస్పీ) ఇస్తూ కేంద్రం తలుపులు బార్లా తెరిచింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
లోక్‌సభలో ఆమోదం పొందిన తాజా బిల్లు ప్రకారం.. ఎంత మేరకు ఎండీఆర్ చార్జీలు విధిస్తారన్న దానిపై ఇప్పుడే స్పష్టత లేకపోయినప్పటికీ, రూ.2 వేలకు మించిన లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్‌ను విధించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ చార్జీల భారం వ్యాపారులపైనే ఉండనున్నట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నప్పటికీ, అంతిమంగా కొనుగోలుదారులపైనే భారం పడుతుందన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు.. ఓ కస్టమర్ రూ.2 వేల విలువైన వస్తువును ఓ షాపులో కొన్నాడు అనుకొందాం. రూపే డెబిట్ కార్డు లేదా యూపీఐ యాప్ ద్వారా రుసుం చెల్లించాడు. జీరో ఎండీఆర్ పాలసీ వల్ల ఇప్పటివరకూ ఈ పేమెంట్‌ను కస్టమర్‌కు చెందిన బ్యాంక్, వ్యాపారికి చెందిన బ్యాంక్‌లతోపాటు పీఎస్పీలు ఉచితంగానే ప్రాసెస్ చేసేవి. దీనివల్ల సదరు వస్తువును అమ్మిన వ్యాపారి ఖాతాలో రూ.2,000 జమ అయ్యేది. అయితే జీరో ఎండీఆర్ పాలసీ రద్దు కాబోతున్న నేపథ్యంలో.. కస్టమర్ పేమెంట్‌ను ప్రాసెస్ చేసినందుకు బ్యాంకులు, పీఎస్పీలు వ్యాపారుల దగ్గర ఇకపై ఛార్జీలను వసూలు చేస్తాయి. దీనివల్ల వ్యాపారి ఖాతాలో రూ. 2 వేల కంటే తక్కువ జమవుతుంది. దీంతో తాను నష్టపోయే సదరు చార్జీ మొత్తాన్ని వ్యాపారులు.. కస్టమర్ దగ్గరే వసూలు చేసే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. తాము కస్టమర్ల పేమెంట్స్‌పై చార్జీలు వేయట్లేదని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పటికీ.. ప్రాసెసింగ్ లేదా అదనపు చార్జీల పేరిటనో, వస్తువు ధరను పెంచో వ్యాపారులు కొనుగోలుదారుల వద్దే ఆ ఛార్జీలను రాబడుతారని హెచ్చరిస్తున్నారు. అలా అంతిమంగా సామాన్యుడిపైనే ఆర్థికపోటు పడొచ్చని చెప్తున్నారు. పైగా దీని వల్ల యూపీఐ లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో పాటు చివరకు ఆన్లైన్ లావాదేవీలను వ్యాపారులు నిరాకరించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ ’ విధించే అంశంపై బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే దాని నిర్వహణ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని, అయితే ఆ భారం నేరుగా సాధారణ వినియోగదారులపైనే పడుతుందని ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ‘వ్యవస్థ నిర్వహణకు ఖర్చు తప్పదు. ఆ ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అది సాధారణ వినియోగదారుడే చెల్లిస్తాడని చెప్పలేం. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థలోనే ఆ వ్యయం భరించే అవకాశం కూడా ఉంటుంది’ అని మల్హోత్రా వివరించారు. అయితే, అంతిమంగా వినియోగదారుల నుంచి సదరు చార్జీలను వ్యాపారులు వసూలు చేస్తారని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. గత నెలలోనే రూ.29.88 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. నిరుడు జూలై నెలలో జరిగిన లావాదేవీల విలువతో పోలిస్తే ఇది 19 శాతం ఎక్కువ.
కొనుగోలుదారులు నిత్యం రకరకాల దుకాణాలు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మరెన్నో చోట్ల చేసే ఆన్లైన్ (యూపీఐ) చెల్లింపులను బ్యాంకులు, పీఎస్పీలు ప్రాసెస్ చేస్తాయి. ఇందుకుగాను ఆయా వ్యాపారులు వాటికి చెల్లించే ఫీజునే మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా ఎండీఆర్ అంటారు. ఇప్పటివరకూ ఇది జీరోగా ఉం ది. తాజా బిల్లుతో ఎండీఆర్ ఫీజు రాబోతున్నది.