దేశీయ స్టాక్ మార్కెట్లు గతకొన్ని వారాలుగా నష్టాలకే పరిమితమవుతున్నాయి. అంతర్జాతీయంగా పశ్చిమాసియా సంక్షోభం, జాతీయంగా వివిధ ప్రతికూల పరిస్థితులు.. సూచీలను కోలుకోనివ్వడం లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం సెన్సెక్స్ 399.22 పాయింట్లు పడిపోయి 73,895.74 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205.90 పాయింట్లు కోల్పోయి 23,140.50 దగ్గర ఆగింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదుడుకులకు వీలుందన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కీలకం కానున్నాయి.
అలాగే బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, ఐఆర్డీఏఐ ఇటీవలి ప్రతిపాదనలు, ఆర్బీఐ రాబోయే ద్రవ్య సమీక్ష ప్రభావం కూడా మార్కెట్ తీరుతెన్నులపై ఉంటుందన్న అంచనాలున్నాయి. దీంతో ఆటో, బ్యాంకింగ్, చమురు-గ్యాస్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, బీమా రంగాల షేర్లు ఆటుపోట్లకు గురికావచ్చు. మెటల్, ఐటీ షేర్ల కదలికలూ ముఖ్యమే. కాగా, హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణా, గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరల పతనంతో సూచీలు లాభాలను అందుకోవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయగలవు. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,300-23,500 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత.