MP Vaddiraju : మనం ‘వికసిత భారత్ – 2047’ దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ ప్రయాణంలో పర్యావరణ శాఖ అంటే అనుమతులిచ్చే ఆఫీసు మాత్రమే కాదని, దేశాభివృద్ధికి ఒక ‘దిక్సూచి’ లాంటిదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) అన్నారు. అంతర్జాతీయ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌లో భారత్ చూపిస్తున్న నాయకత్వాన్ని ఆయన అభినందించారు.
పర్యావరణం, అడవుల పరిరక్షణపై రాజ్యసభలో సోమవారం సాయంత్రం జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. పారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవడంలో జీ-20 దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని ఎంపీ తెలిపారు. దేశానికి బొగ్గు, విద్యుత్తును అందిస్తూ వెలుగులు నింపుతున్న రాష్ట్రం తెలంగాణ ఆని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి చెందడం ఎలాగో మాకు తెలుసు అని ఎంపీ అన్నారు.
సుస్థిర మైనింగ్ కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొన్న చారిత్రాత్మక సింగరేణి కాలరీస్ (SCCL)కు నిలయమని ఎంపీ రవిచంద్ర తెలిపారు. పర్యావరణ అనుమతుల కోసం ఉన్న ‘పరివేష్ 2.0’ (Parivesh 2.0) పోర్టల్‌ను మరింత సులభతరం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇది కేవలం అనుమతులకే పరిమితం కాకుండా, మైనింగ్ పూర్తయ్యాక ఆ భూములను మళ్లీ అడవులుగా మార్చే (Mine Closure Plans) సాంకేతిక సాయం కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.
మిషన్ లైఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిందని, దీని ఉపయోగాలు గిరిజన ప్రాంతాలకు కూడా చేరాల్సి ఉందని ఎంపీ ఆకాంక్షించారు. పర్యావరణానికి మేలు చేసే ‘నేచర్ బేస్డ్ ప్రోడక్ట్స్’, సుస్థిర ఇంధనాలపై పరిశోధన చేసే సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఎంపీ వద్దిరాజు కేంద్రానికి సూచించారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ‘తెలంగాణకు హరితహారం’ పథకం గురించి చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతంగా అమలు చేయడంతో
అడవుల శాతం 7% పెరిగిందని, ఇది దేశానికే ఒక ఆదర్శనీయమని ఎంపీ వెల్లడించారు.
రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా సకాలంలో విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రవిచంద్ర కోరారు. కొత్తగూడెం, మణుగూరు వంటి అటవీ ప్రాంతాల్లో క్రూర మృగాల వల్ల వ్యవసాయానికి, రైతులకు నష్టం జరుగుతున్నదని.. ఈ సమస్యను అరికట్టడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన అభ్యర్థించారు.
కొత్తగూడెంలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రైల్వే డివిజన్ వంటి ప్రాజెక్టుల విషయంలో పర్యావరణాన్ని కాపాడుతూనే పనులను వేగవంతం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
“అడవులను కాపాడుకుందాం, అందులో నివసించే ప్రజలను గౌరవిద్దాం”అని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ రవిచంద్ర సలహా ఇచ్చారు.
పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల తెలంగాణ ఒక వింతైన, భయంకరమైన సమస్యను ఎదుర్కొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోతులు గ్రామాలపై, పంట పొలాలపై దాడులు చేస్తున్నాయని, రైతులు కష్టపడి పండించిన కూరగాయలు, పూలు, పండ్ల తోటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఫలితంగా రైతాంగం ఆర్థికంగా నష్టపోతోందని ఆయన చెప్పారు. కోతులు ఇళ్లలోకి చొరబడి పసిపిల్లలపై దాడులు చేస్తున్నాయని, కోతులు కరవడం వల్ల పిల్లలు తీవ్ర గాయాల పాలవుతున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఇళ్లలో ఉండాలన్నా, బయట తిరగాలన్నా ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారని ఎంపీ వాపోయారు.
కోతుల బెడద రాష్ట్ర సమస్య మాత్రమే కాదని కేంద్ర ప్రభుత్వం దీనిని ‘”వన్యప్రాణి-మానవ ఘర్షణ'”కింద గుర్తించాలని ఆయన సూచించారు. కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. అడవుల్లో వాటికి కావాల్సిన ఆహారం లభించేలా ‘ఫల వృక్షాలను’ నాటేందుకు కాంపా (CAMPA) నిధులను మళ్లించాలని ఎంపీ రవిచంద్ర సలహా ఇచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు, ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను కాపాడటం కూడా ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.